Bath Soaps: సబ్బులు కొనేముందు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి!
ముఖం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి మనం సబ్బులను రెగ్యులర్ గా వాడుతుంటాం. అయితే సబ్బులు కొనే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలట. అవేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

మంచి సబ్బు ఎలా కొనాలి?
సబ్బులను ఎంచుకోవడానికి ముందుగా మీ చర్మ రకాన్ని తెలుసుకోవాలి. చర్మం పొడిగా, దురదగా ఉంటే గ్లిజరిన్, మాయిశ్చరైజర్, షియా బటర్, కొబ్బరి నూనె వంటి సహజ నూనెలు కలిసిన సబ్బులను ఎంచుకోవాలి. ఆవుపాలతో తయారుచేసిన సబ్బులు కూడా పొడి చర్మానికి మంచివి. చర్మం చాలా జిడ్డుగా ఉంటే సాలిసిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, యాంటీ బాక్టీరియల్ సబ్బులను వాడచ్చు. ఈ సబ్బులు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
చర్మం సున్నితంగా ఉంటే సువాసన, రంగులు లేని, తక్కువ రసాయనాలు కలిగిన సబ్బులను ఎంచుకోవాలి. సాధారణ చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ కలిగిన సబ్బులను వాడచ్చు.
సబ్బు TFM చూడాలి
సబ్బు కొనే ముందు TFM (Total Fatty Matter) ను పరిగణించాలి. ఇది సబ్బులోని కొవ్వు ఆమ్లాల శాతాన్ని సూచిస్తుంది. గ్రేడ్ 1:76% లేదా అంతకంటే ఎక్కువ TFM కలిగిన సబ్బులు. చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తక్కువ రసాయనాలు కలిగి ఉంటాయి. ఇవి నాణ్యమైన సబ్బులు. గ్రేడ్ 2 అంటే 70% నుంచి 75% TFM కలిగినవి. గ్రేడ్ 3 అంటే 69% లేదా అంతకంటే తక్కువ TFM కలిగినవి. ఈ సబ్బుల్లో రసాయనాలు ఎక్కువగా, కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి సబ్బు కొనే ముందు దాని లేబుల్‌పై ఉన్న TFM విలువను చూడాలి.
సబ్బు pH చూడాలి
సబ్బులు కొనే ముందు pH (ఆమ్లత) స్థాయిని తనిఖీ చేయడం ముఖ్యం. 4.5 నుంచి 5.5 వరకు pH ఉన్న సబ్బులు తక్కువ ఆమ్లత కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది. సాధారణంగా సబ్బుల pH 7 నుంచి 9 వరకు ఉంటుంది. ఇది చర్మం సహజ pH సమతుల్యతను దెబ్బతీసి, చర్మాన్ని పొడిగా చేస్తుంది. కాబట్టి pH 5.5 లేదా pH Balanced సబ్బులను ఎంచుకోవడం మంచిది. ఇవి చర్మ సహజ ఆమ్లతను కాపాడతాయి. సబ్బులోని రసాయనాల జాబితాను కూడా జాగ్రత్తగా చదవాలి. కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు.
ఈ రసాయనాలు వద్దు
ఎక్కువ నురగ రావడానికి సబ్బుల్లో సల్ఫేట్లు కలుపుతారు. ఇవి చర్మాన్ని పొడిగా చేసి, దురద కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు సల్ఫేట్లు ఎక్కువగా ఉన్న సబ్బులను నివారించాలి. సబ్బుల్లో కలిపే పారాబెన్లు, కృత్రిమ సువాసనలు, రంగులు కొంతమందికి అలెర్జీలను కలిగిస్తాయి. కాబట్టి సువాసన, రంగులు లేని సబ్బులను ఎంచుకోవాలి. యాంటీ బాక్టీరియల్ సబ్బుల్లోని ట్రైక్లోసాన్ పర్యావరణానికి హానికరం. అలెర్జీలను కూడా కలిగిస్తుంది. మంచి సబ్బు కావాలనుకునేవారు గ్లిజరిన్, సహజ నూనెలు కలిసిన సబ్బులను ఎంచుకోవాలి.
ప్రకటనలను పూర్తిగా నమ్మకూడదు
నమ్మకమైన బ్రాండ్ల సబ్బులను ఎంచుకోవడం మంచిది. సాధ్యమైతే.. చర్మ నిపుణులు సూచించిన సబ్బులను ఎంచుకోవచ్చు. ఒక వారంలో తెల్లగా అవ్వచ్చు.. ఒకే రోజులో అన్ని చర్మ సమస్యలకు పరిష్కారం వంటి అసాధ్యమైన ప్రకటనలను నమ్మకూడదు. చర్మ సంరక్షణ అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రకటనల్లో చూపించినట్లు తక్షణ ఫలితాలు చాలా వరకు అబద్ధం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సబ్బులు కొంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.