మనం సబ్బులను రెగ్యులర్ గా వాడుతుంటాం. అయితే చాలామంది ప్రకటనలు చూసి సబ్బులు కొంటుంటారు. కానీ అందరి స్కిన్ ఒకేలా ఉండదు. అన్నిసబ్బులు ఒకేలా తయారుకావు. చర్మ రకాన్ని బట్టి సబ్బులు ఎంచుకోవడం ముఖ్యం. మీ చర్మానికి ఏ సబ్బు సెట్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.  

ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల సబ్బులు అందుబాటలో ఉన్నాయి. మనం స్నానం చేయడానికి, ముఖం కడుక్కోవడానికి సబ్బులను ఉపయోగిస్తుంటాం. చాలా తక్కువమంది సబ్బుకు బదులు శనగపిండి, పెసరపిండి లాంటివి వాడుతుంటారు. కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువగా వాడేది మాత్రం సబ్బే. అసలు మనం వాడే సబ్బు నిజంగా మనకు మంచిచేస్తుందా? లేదా చెడు చేస్తుందా? అసలు ఎలాంటి సబ్బు తీసుకుంటే చర్మానికి మంచిదో ఇక్కడ చూద్దాం.  

చర్మ రక్షణ కోసం ఎలాంటి సబ్బు వాడాలి?     

ఎవరైనా సరే వారి చర్మానికి అనువైన సబ్బును ఎంచుకోవడం ముఖ్యం. దానివల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.

పొడి చర్మం ఉన్నవారు   

చర్మం చాలా పొడిగా ఉన్నవారికి గ్లిజరిన్ ఉన్న సబ్బులు మంచివి. ఇది మేక పాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొడి చర్మం ఉన్నవారు మేక పాలతో తయారు చేసిన సబ్బులను వాడటం మంచిది .

సెన్సిటివ్ చర్మం 

సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి మెడికల్ షాపుల్లోనే అనేక సబ్బులు లభిస్తాయి. వీరు వాసన, రంగు లేని సబ్బులనే వాడాలి. కాబట్టి మీరు చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకుని సబ్బులు వాడడం మంచిది.

ఆయిల్ స్కిన్

ఆయిల్ స్కిన్ ఉండేవారు యాంటీ బాక్టీరియల్ సబ్బులు వాడచ్చు. ముఖ్యంగా కరివేపాకు, సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సబ్బులు చర్మంలోని అధిక నూనెను తొలగిస్తాయి. దీంతో పాటు లావెండర్, టీ ట్రీ ఆయిల్ కలిగిన సబ్బులు కూడా వీరు వాడచ్చు.

ఒకే రకం సబ్బును చాలా ఏళ్లు వాడితే ఏమవుతుంది?

మీ చర్మ అవసరాలను బట్టి ఒకే రకం సబ్బును చాలా సంవత్సరాలు వాడవచ్చు. కానీ వయసు, హార్మోన్ల మార్పులు, వాతావరణం చర్మాన్ని మారుస్తాయి. ఉదాహరణకు యవ్వనంలో మీకు ఆయిల్ స్కిన్ ఉంటే.. దానికి తగిన సబ్బును వాడి ఉంటారు. కానీ వయసు పెరిగిన తర్వాత పొడి చర్మానికి ఆ సబ్బు సరిపోదు. కాబట్టి చర్మ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు సబ్బులు మార్చుకోవడం మంచిది. వైద్యుల సలహాతో సబ్బును మార్చడం ఇంకా మంచిది.