మీకు వాట్సాప్ లో ఈ మెసేజ్ వచ్చిందా.. అస్సలు టచ్ చేయకండి
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఒకేసారి వందలాది వాట్సాప్ గ్రూపులపై దాడికి పాల్పడ్డారు. మీ వాట్సాప్ కు కూడా ఏపికే ఫైల్స్ వచ్చాయా..? అయితే జాగ్రత్త. అస్సలు టచ్ చేయకండి

రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు
Cyber Crime : ఈ హైటెక్ యుగంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సైబర్ కేటుగాళ్లు కొత్తకొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు సిబ్బందిమంటూ ఫోన్ చేసి వివరాలను సేకరించే స్థాయినుండి మన ప్రమేయమే లేకుండా వ్యక్తిగత వివరాలను సేకరించే స్థాయికి సైబర్ నేరగాళ్ళు ఎదిగారు. తాజాగా మరో కొత్తరకం సైబర్ మోసం వెలుగుచూసింది.
వాట్సాప్ లో సైబర్ క్రైమ్
తెలుగు ప్రజలే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని భయపెట్టి వాట్సాప్ గ్రూప్స్ లో వేలాదిగా APK (Android Package Fit) ఫైల్స్ పంపిస్తున్నారు. నిజంగానే అకౌంట్ క్లోజ్ అవుతుందేమోనని భయపడి ఈ ఫైల్ పై క్లిక్ చేశారో అంతే సంగతి... ఫోన్ హ్యాక్ అవుతుంది... అందులోని సమాచారమంతా సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట నిన్న(ఆదివారం) వేలాది వాట్సాప్ గ్రూప్స్ లో APK ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. సాధారణ వాట్పాప్ గ్రూప్స్ లోనే కాదు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఈ ఫైల్స్ కనిపించాయి. గ్రూప్ లోని ఏ సభ్యుడైనా దీనిపై క్లిక్ చేసాడో అతడి ఫోన్ లోని మిగతా వాట్సాప్ గ్రూప్స్ కి ఈ ఫైల్స్ వెళ్లిపోయాయి. ఇలా చెయిన్ సిస్టమ్ లా వేలాది వాట్సాప్ గ్రూప్స్ కి ఈ ఏపికే ఫైల్స్ చేరాయి.
ఈ జాగ్రత్తలు పాటించండి...
- వాట్సాప్ తెలియనివారు పంపించే లింక్స్, APK ఫైల్స్ అస్సలు ఓపెన్ చేయరాదు.
- పొరపాటున APK ఫైల్స్ పై క్లిక్ చేస్తే వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసి దీన్ని అన్ ఇన్ స్టాల్ చేయాలి.
- మీ ఫోన్ లో ఏదైనా అసహజ చర్యలు కనిపిస్తే వెంటనే ఫోన్ ను రీసెట్ చేయండి.
- బ్యాంకింగ్, యూపిఐ యాప్స్ పాస్ వర్డ్ మార్చండి.
- మీ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయమైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా 15531కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
సైబర్ క్రైమ్ శిక్షణ
ధన ఫైనాన్స్ పేరిట అమాయలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జిల్లాలోని మారుమూల తండాకు చెందిన ఏడుగురు యువకులు ఫైనాన్స్ పేరిట ఇప్పటివరకు మూడు కోట్ల వరకు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ యువకులు సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో కలకత్తాలో శిక్షణపొందినట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ నేరాల రకాలు
విషింగ్ స్కాం :
బ్యాంకు సిబ్బంది లేదా ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలను సేకరించి వాటి ఆధారంగా మోసగించడం. ఇది చాలా పాత పద్దతి. ఇప్పటికే దీనిపై ప్రజలకు అవగాహన వచ్చింది. అందుకే కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.
ఫిషింగ్ :
బ్యాంక్ లేదా ఇతర సంస్థల నుండి మెయిల్స్, లింక్ పంపించి పాల్పడే మోసాలను ఫిషింగ్ అంటారు. వీటిని ఓపెన్ చేయగానే మన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళుతుంది.
మొబైల్ స్కాం :
మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ను నమ్మించి మన పేరిట ఉన్న మొబైల్ నంబర్ తో కొత్త సిమ్ తీసుకుంటారు. దీనికే ఓటిపి, ఇతర వివరాలు వచ్చేలా చేసుకుని బ్యాంకు అకౌంట్లోని డబ్బులు కాజేస్తారు.
మాల్ వేర్ అటాక్ :
కంప్యూటర్, మొబైల్స్ కి హానికరమైన వైరస్ ను పంపిస్తారు. దీనిద్వారా బ్యాంక్ అకౌంట్, ఇతర వివరాలు సేకరించి మోసాలకు పాల్పడతారు.

