IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Hyderabad Weather : తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయో తెలుసా..? ఏ మారుమూల గ్రామంలోనో కాదు రాజధాని నగరం హైదరాబాద్ లోనే. ఇక్కడ తెల్లవారుజామున ఎన్ని డిగ్రీల టెంపరేచర్ ఉంటోందంటే…

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
Telugu States Weather Update : తెలుగు ప్రజలను చలి వణికిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిరోజులు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని... చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణంగా పల్లెటూళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... కానీ ప్రస్తుతం హైదరాబాద్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరవాసులు చలికి గజగజా వణికిపోతున్నారు.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ 07.2 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం హైదరాబాద్ దే... నగర శివారులోని పటాన్ చెరులో ఏకంగా 7.8 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక రాజేంద్రనగర్ లో 9.5, హయత్ నగర్ 10 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం అయితే హైదరాబాద్ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నాయి... మొయినాబాద్ లో 6.6°C, ఇబ్రహీంపట్నంలో 7.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట.
ఈ తెలంగాణ జిల్లాల్లో గజగజలాడించే చలి
మొత్తంగా చూసుకుంటే తెలంగాణలోని ఓ ఏడు జిల్లాల్లో చలి తీవ్రత పీక్స్ లో ఉంది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ లో 07.2, మెదక్ 8, హన్మకొండ 10, నిజామాబాద్ 11.9, రామగుండం 12.6, ఖమ్మం 13.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇలా...
ఇక తెలంగాణలోని మరో 21 జిల్లాల్లో 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట... వీటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో మాత్రం 15 డిగ్రీలకు పైగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
అప్పటివరకు తెలంగాణలో చలే...
తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని... రాబోయే 2-3 రోజులు రాష్ట్రంల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 16 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. తర్వాత చలితీవ్రత కాస్త తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయాయి. అరకు ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఏకంగా 3.6, జి.మాడుగులలో 3.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

