Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!
Telangana Panchayat Elections 2025 : తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఎంత విలువైన లిక్కర్ పట్టుబడిందో తెలుసా?

తెలంగాణలో మొదటివిడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
Telangana Panchayat Elections 2025 : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఇవాళ మొదటివిడత పూర్తవనుంది. ప్రస్తుతం మొదటి విడతలో అత్యంత కీలకమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండే ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగుస్తుంది... రెండు గంటలనుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది... సాయంత్రంలోపు అన్ని గ్రామపంచాయతీల పలితాలు వెలువడనున్నాయి. తర్వాత ఎన్నికైన వార్డు మెంబర్స్ లోంచి ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.
37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి విడతలో 56, 19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
భారీ పోలీస్ బందోబస్తు
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించినట్లు... రాజకీయ పార్టీల నాయకులే కాదు ఓటర్లు కూడా గుంపులుగా పోలింగ్ కేంద్రాలవద్దకు రావద్దని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియకు అవాంతరాలు కలిగించవద్దని ఆయన కోరారు.
తల్లిగా మారిన పోలీస్ అధికారిణి
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ చంటిబిడ్డతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు రాగా అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణి ఇది గమనించారు. వెంటనే ఆ పాపను తన ఒడిలోకి తీసుకుని అమ్మలా లాలించింది. దీంతో సదరు మహిళా ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకుంది.
నల్గొండలో ఘర్షణ
ఇదిలావుంటే నల్గొండ జిల్లా కోర్లపహాడ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు... దీంతో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు బందోబస్తును మరింత పెంచారు.

