మిడిల్ క్లాసోళ్లతో టమాటా ఆటాడుకునేలా ఉందిగా..! తెలుగు స్టేట్స్ లో కిలో ధరెంతో తెలుసా?
Tomato Price : టమాటా ఎవరిమాటా వినడంలేదు… పైపైకి ఎగబాకుతోంది. కొద్దిరోజుల క్రితం కిలో రూ.10-20 పలికిన ధర ఇప్పుడు ఎంతకు చేరుకుందో తెలుసా? ఇందుకు కారణమేంటి?

ఘాటెక్కిన టమాటా...
Vegetable Price : ప్రతి వంటింట్లో ఏ కూరగాయ ఉన్నా లేకున్నా టమాటా ఉండాల్సిందే. వెజ్, నాన్ వెజ్, బిర్యాని, కూర, పప్పు... ఇలా ప్రతి వంటకంలోనూ టమాటా ఉపయోగిస్తారు. తెలుగు ప్రజలు టమాటాను మరింతగా ఇష్టపడతారు... టిఫిన్ లోకి టమాటా చట్నీ, లంచ్ లోకి టమాటా రైస్, కర్రీ... చాలామందికి టమాటా ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి టమాటా మెళ్లిగా సామాన్యులకు దూరం అవుతోంది... ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర?
ఇటీవల కిలో టమాటా రూ.10-15 కు కూడా అమ్మడం మనందరం చూశాం. ఈ సమయంలో టమాటా రైతుల పరిస్థితి మరీ ఘోరం... గిట్టుబాటు ధరలేక పంటను అలాగే వదిలేసినవారు కొందరైతే రోడ్లపై పారబోసిన వారు మరికొందరు. ఇంత దారుణ స్థాయికి టమాటా ధర పడిపోవడం చూశాం.... అదే ఇప్పుడు టమాటా ధరలు పెరగడం చూస్తున్నాం. రోజురోజుకు ధరలు పెరుగుతూ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర హాఫ్ సెంచరీకి (రూ.40-45 కి) చేరువయ్యింది. అంటే కేవలం నెల నెలన్నర రోజుల్లోనే 3-4 రెట్లు పెరిగిందన్నమాట.
రాష్ట్రాలవారిగా టమాటా ధర పెరుగుదల
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర పెరుగుదల తక్కువగానే ఉందని చెప్పవచ్చు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో 40% పైగా ధర పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ చెబుతోంది. ఇదే చండీగఢ్‌లో టమాటా ధర 112% పెరిగిందట. మహారాష్ట్రలో 45%, ఢిల్లీలో 26% ధర పెరిగిందని వినియోగదారుల శాఖ ప్రకటించింది. ఇలా దేశవ్యాప్తంగా టమాటా ధర పైపైకి వెళుతోంది... ఇది ఏ స్థాయికి చేరుకుంటుందోనని వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.
టమాటా ధర పెరుగుదలకు కారణమిదే
వర్షాకాలం చివర్లో అంటే అక్టోబర్ లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం కొనసాగింది... భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. ఈ వర్షాలే ప్రస్తుతం టమాటా ధర పెరుగుదలకు కారణమయ్యాయి.
భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది... దీంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇలా మార్కెట్లోకి టమాటా సరఫరా బాగా తగ్గి డిమాండ్ పెరిగింది. అందువల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ టమాటా ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారినా రైతులు, చిరు వ్యాపారులకు లాభం చేయనుంది.
టమాటా ధర మరింత పెరిగే అవకాశం
ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ సమయంలో టమాటా సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి... రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మంచి నాణ్యమైన టమాటా కిలో రూ.50 లోపు పలుకుతోంది... కానీ ఇది రూ.100 మార్కుకు చేరుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో సామాన్యులు టమాటా తినలేని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట... వారి వంటిళ్ల నుండి టమాటా మాయం అవుతుందన్నమాట. టమాటా ధరల పెంపు హోటల్స్, రెస్టారెంట్స్ లో అహార పదార్థాల పెరుగుదలకు కూడా కారణం కావచ్చని అంటున్నారు.
ద్రవ్యోల్బణంపైనా టమాటా ఎఫెక్ట్
అక్టోబర్‌లో టమాటా, ఉల్లి ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం 0.25%కి పడిపోయింది... ఇది 2013 తర్వాత అత్యంత తక్కువ. కానీ ఇప్పుడు ధరలు మళ్లీ పెరగడంతో ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ఇలా ద్రవ్యోల్బణాన్ని కూడా టమాటా ధర ప్రభావితం చేస్తోంది.

