IMD Rain Alert : ఒకటి కాదు వరుసగా రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇక చలి తగ్గి మళ్లీ వర్షాలు మొదలవనున్నాయట. బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలుంటాయట… వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాాఖ హెచ్చరిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Weather Alert : బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం కొనసాగుతోంది... దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి మరో అల్పపీడనం కూడా తోడయ్యే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకుంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇవాళ్టి (నవంబర్ 20, గురువారం) నుండి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని... చలితీవ్రత క్రమక్రమంగా తగ్గి వర్షాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
వచ్చే శనివారం (నవంబర్ 22) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అంటే వాయుగుండంగా మారనుందన్నమాట. ఇప్పటికే అల్పపీడనానికి అనుకూల పరిస్థితులు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి... కాబట్టి ఇవాళ్టి నుండే అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది.
ఏపీలో వర్షాలు
ఇక రేపు శుక్రవారం (నవంబర్ 21) మరికొన్ని జిల్లాలకు వర్షాలు విస్తరించనున్నాయని APSDMA ప్రకటించింది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ప్రకాశం, అనంతపూరం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడే వరుస అల్పపీడనాల ప్రభావంతో చలి తగ్గి వర్షాలు పెరగనున్నాయట. ఇవాళ్టి(గురువారం) నుండి అత్యంత చలి పరిస్థితులు మారతాయని... ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరతాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం చెబుతోంది. శనివారం నుండి వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది. నవంబర్ 22న మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 19, 2025
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
నవంబర్ 23న అంటే వచ్చే ఆదివారం కూడా తెలంగాణలో వర్షాలుంటాయట. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 19, 2025
తెలంగాాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలివే...
తెలంగాణ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే బుధవారం (నవంబర్ 19న) అత్యల్పంగా మొదక్ లో 9.6, ఆదిలాబాద్ లో 9.7 డిగ్రీ సెల్సియస్ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అలాగే పటాన్ చెరులో 11, హన్మకొండలో 12, నిజామాబాద్ లో 13.2, రామగుండంలో 13.6, హైదరాబాద్ లో 14.3, దుండిగల్ లో 15.3, నల్గొండలొ 15.4 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

