IMD Rain Alert : 'సెన్యార్' తుపాను లోడింగ్..? ఏపీ తీరంవైపే దూసుకొస్తుందా..?
IMD Rain Alert : మొంథా తుపాను తరహాలోనే తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ వెదర్ మ్యాన్. తాజాగా కీలక వాతావరణ సమాచాారాన్ని వెల్లడించారు వెదర్ మ్యాన్.

తెలుగు ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త
Cyclone Senyar : సాధారణంగా అక్టోబర్-నవంబర్ ను తుపానుల కాలం అంటారు. అక్టోబర్ లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయి... ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయి... ఈ సమయంలో సముద్రంలో ఉష్ణోగ్రతలు మారి అల్పపీడనాలు ఏర్పడతాయి... ఇవి వాయుగుండం, తుపానులుగా మారతాయి. ఇలా ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో చూశాం. ఇలాంటిదే మరో తుపాను లోడ్ అవుతున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులనుబట్టి చూస్తే నవంబర్ లో మరో తుపాను తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సెన్యార్ తుపాను
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించడంలేదు... అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే త్వరలోనే (నవంబర్ 22న) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే ఇకపై ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తుపాను ఏర్పడితే దీనిపేరు 'సెన్యార్' గా ఉండనుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపే దూసుకువచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
CYCLONE SENYAR LOADING 🌀
The next system is definetely going to be a Cyclone/Deep Depression
If it's a cyclone, then it will be named as Cyclone Senyar, very likely to move towards AP coast
It will be a hybrid type of 2018 Phetai and 2025 Montha Cyclone
Therefore East…— Telangana Weatherman (@balaji25_t) November 19, 2025
మరో తుపాను ఎఫెక్ట్
రాబోయే సెన్యార్ 2018 లో వచ్చిన ఫెథాయ్ తుపాను... 2025 లో వచ్చిన మొంథా తుపానుకు హైబ్రిడ్ మోడల్ గా ఉండనుందని వెదర్ మ్యాన్ అభిప్రాయపడ్డారు. అంటే దీనితీవ్రత ఆ తుపానుల స్థాయిలో లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీభత్సమైన వర్షాలను కురిపించే అవకాశాలుంటాయన్నమాట. ఈ సెన్యాన్ ఏపీలోనే తీరందాటితే పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది... ఒకవేళ దారిమారితే తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తక్కువగా ఉంటుంది.
తుపాను లేకున్నా వర్షాలు తప్పవు...
సెన్యార్ తుపాను ఏర్పడినా, ఏర్పడకున్నా అల్పపీడనం ఏర్పడటం మాత్రం పక్కా. కాబట్టి రాబోయే పదిరోజుల్లో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురవడం ఖాయం. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో నవంబర్ 27,28 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలుంటాయని తెలిపారు. అయితే ఈ వర్షాల తీవ్రత అనేది తుపాను ఏర్పడుతుందా? అల్పపీడనం, వాయుగుండం తోనే ఆగిపోతుందా? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
నవంబర్ 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అకవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇకపై వచ్చే 5 తుపాన్ల పేర్లివే
ఒక్కో తుపానుకు ఒక్కోదేశం పేరు పెడుతుంది... ఇటీవల వచ్చిన తుపానుకు మొంథా అని థాయిలాండ్ నామకరణం చేసింది. ఇక తర్వాత రాబోయే తుపానుకు 'సెన్యార్' అని పేరుపెట్టింది అరబ్ ఎమిరేట్స్. ఆ తర్వాత వచ్చే తుపానుకు యెమెన్ 'డిత్వా' అని... తర్వాతిదానికి బంగ్లాదేశ్ అర్నబ్ అని పేరు పెడతారు. వీటి తర్వాత వచ్చేది 'మురుసు' తుపాను... ఇది ఇండియా పేరు. దీని తర్వాత ఇరాన్ పేరుతో 'అక్వాన్' తుపాను వస్తుంది.

