IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఈ ఆరు జిల్లాలకు అలర్ట్
IMD Weather Alert : ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి… ఇవి తెలంగాణకు కూడా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ విభాగాలు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే చలిగాలులు తెలుగు ప్రజలను వణికిస్తుంటే దీనికి వానలు తోడవుతున్నాయి. అయితే వర్షాలు మొదలైతే చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాల కారణంగా పొడిగాలులు తగ్గి గాలితో తేమ పెరుగుతుంది... దీంతో చలి తగ్గుతుంది.
కొనసాగుతున్న అల్పపీడనం
ఇక ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి వంటి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, అనంతపురం, సత్యసాయి,యకడన, చిత్తూరు జిల్లాలపైనా అల్పపీడన ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలుంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించింది.
ఏపీలో వర్షాలు
ఇదిలాఉంటే నవంబర్ 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ప్రభావంతో నవంబర్24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నవంబర్ 22న వర్షాలు మొదలవుతాయని... మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండుమూడు రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది.
మరో రెండ్రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని... మరో రెండ్రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ వణికిస్తున్న చలి
మంగళవారం హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరు ఈక్రిశాట్ వద్ద 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హయత్ నగర్ 12.6. హకీంపేట 15.3. బేగంపేట 14.2, రాజేంద్రనగర్ 12 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
తెలంగాణలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 9.2, మెదక్ లో 9.8 సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదయ్యింది. హన్మకొండ 12.5, నిజామాబాద్ 12.6, రామగుండం 13.1, భద్రాచలం 17.0, ఖమ్మం 15.4, మహబూబ్ నగర్ 16, నల్గొండ 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆంధ్ర ప్రదేశ్ లో అయితే అల్లూరి సీతారామరాజులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా అరకులు 6.6 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇక జి. మాడుగులలో 7.4, పాడేరులో 9.8, చింతపల్లిలో 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

