తెలంగాణలో మరో కొత్త పథకం.. ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల భరోసా కల్పించేలా నిర్ణయం
Telangana: తెలంగాణ ప్రభుత్వం 2026-207 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించగా రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా మరో కొత్త పథకం అమలు చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్త భీమా పథకం
తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ప్రజలకు కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతి కుటుంబానికి రక్షణ
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత భీమా అందించనున్నారు. ప్రతి కుటుంబానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. కుటుంబానికి ఆధారంగా ఉండే వ్యక్తి లేకపోయినా, ఆర్థికంగా కష్టాల్లో పడకుండా సహాయం చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ఎప్పుడు అమల్లోకి రానుంది.?
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ పథకం 2026 జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇది వర్తించనుంది. ఇదిలా ఉంటే ఈ పథకాన్ని పేద-ధనిక తేడా లేకుండా అందరికీ అమలు చేయనున్నారు. పేదలు, మధ్యతరగతి, ధనికులు అందరికీ ఒకే విధంగా ఈ భీమా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా ఎలాంటి పరిమితులు ఉండవు.
బడ్జెట్‌లో ఇతర కీలక నిర్ణయాలు
ఈ బడ్జెట్ మొత్తం రూ.3.24 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువ. విద్యా రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం, ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2000 స్టైపెండ్ ఇవ్వనున్నారు. విద్యా రంగానికి ప్రత్యేకంగా రూ.26,674 కోట్లు కేటాయించారు.
మెరుగవుతోన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరిందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైందని ప్రభుత్వం చెబుతోంది.

