- Home
- Telangana
- Metro: మెట్రోలో టాయిలెట్ వాడితే డబ్బులు ఇస్తున్నారా.? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయంటే
Metro: మెట్రోలో టాయిలెట్ వాడితే డబ్బులు ఇస్తున్నారా.? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయంటే
Metro: సహజంగా రైల్వే స్టేషన్లలో టాయిలెట్లు ఉచితంగా వాడుకోవచ్చు. కానీ మెట్రో స్టేషన్‌లో మాత్రం డబ్బులు చెల్లిస్తుంటాం. ఇంతకీ మెట్రోలో టాయిలెట్స్‌కి డబ్బులు ఎందుకు చెల్లించాలి.? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

టాయిలెట్ వాడితే ఎందుకు డబ్బులు తీసుకుంటారు?
మెట్రో స్టేషన్‌లో టాయిలెట్ల నిర్వహణకు ఖర్చు ఉంటుంది. టాయిలెట్లను శుభ్రంగా ఉంచడం, నీటి సరఫరా, సిబ్బంది నిర్వహణ వంటి వాటికి ఖర్చు అవుతుంది. అందుకే కొన్ని మెట్రో స్టేషన్లలో టాయిలెట్ వినియోగానికి స్వల్ప రుసుము వసూలు చేస్తున్నారు. సాధారణంగా రూ.5 లేదా రూ.10 వంటి మొత్తాన్ని తీసుకుంటారు. అయితే ఈ రుసుము అన్ని మెట్రో స్టేషన్లలో ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం.
2023లో పార్లమెంట్‌లోనూ ప్రశ్న
మెట్రో టికెట్ కోసం ప్రయాణికులు ఇప్పటికే డబ్బులు చెల్లిస్తున్నప్పుడు.. టాయిలెట్ ఉపయోగించేందుకు అదనంగా ఎందుకు చెల్లించాలనే ప్రశ్న 2023లో పార్లమెంట్‌లోనూ ప్రస్తావనకు వచ్చింది. మెట్రో ప్రయాణానికి టికెట్ తీసుకున్న వారికి స్టేషన్‌లోని టాయిలెట్ సదుపాయం ఉచితంగా ఉండాలా అనే అంశంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై ఇచ్చిన సమాధానంలో టాయిలెట్ నిర్వహణ, అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై స్పష్టత ఇచ్చారు.
మెట్రో స్టేషన్‌లో టాయిలెట్ నిర్వహణ ఎవరు చేస్తారు?
మెట్రో స్టేషన్లలో టాయిలెట్ సదుపాయాలను మెట్రో సంస్థ నేరుగా నిర్వహించే సందర్భాలు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే విధానం కూడా ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించింది. సులభ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు సహా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కొన్ని టాయిలెట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
టాయిలెట్‌కు వసూలు చేసే డబ్బులు చట్టబద్ధమేనా?
మెట్రో స్టేషన్‌లో టాయిలెట్ ఉపయోగించినందుకు స్వల్ప రుసుము వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం కాదని ఈ వివరణల ద్వారా తెలుస్తోంది. టాయిలెట్ సదుపాయం నిర్వహణ కోసం ప్రయాణికుల నుంచి రుసుము తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీలు ఈ సదుపాయాన్ని నిర్వహిస్తున్నప్పుడు.. శుభ్రత, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగదారుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయవచ్చు.
టాయిలెట్ ఉచితంగా ఉండాల్సిందేనా?
మెట్రో టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన స్టేషన్‌లోని టాయిలెట్‌ను ఉచితంగా ఉపయోగించే హక్కు ఉంటుందని చెప్పే నిబంధన లేదు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ హైకోర్టుకు ఇచ్చిన వివరాల ప్రకారం.. ప్రయాణికులకు టాయిలెట్ సదుపాయం ఉచితంగా అందించాల్సిందే అనే నిబంధన లేదు. అందువల్ల స్టేషన్‌లో నిర్ణయించిన రుసుము చెల్లించి టాయిలెట్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఏ స్టేషన్‌లో ఎంత రుసుము వసూలు చేస్తారనేది అక్కడి నిర్వహణ విధానం, సంబంధిత ఏజెన్సీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

