- Home
- Telangana
- School Holidays : ఇంకా రెండ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
School Holidays : ఇంకా రెండ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
అక్టోబర్ నెల వస్తూనే సెలవులను మోసుకొస్తోంది. ఈ నెలలో ఇలా అడుగుపెట్టగానే అలా ఓ సెలవు వస్తోంది… ఇది కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ ను అందించనుంది. ఇంతకూ ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసుకుందాం.

ఈ వారాంతం వరుస సెలవులు... లాంగ్ వీకెండ్
School Holidays : సెలవులు... ఈ మాట వినిపిస్తే చాలు విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. సాధారణంగా ఓ నెలలో ఒకటి రెండు ప్రత్యేక సెలవులు వస్తేనే పొంగిపోతారు, అలాంటి నెలలో సగానికి పైగా సెలవులుంటే... వారిని ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటిదే ఈ అక్టోబర్.. ఈ నెలలో దసరా పండక్కి 13 రోజుల సెలవులున్నాయి... వీటికి అదనంగా గాంధీ జయంతి సెలవు వస్తోంది, ఇక ఆదివారాలు ఎలాగూ ఉన్నాయి. ఇలా అక్టోబర్ నెలంతా హాలిడేస్ తో నిండిపోయి స్కూల్, కాలేజీ విద్యార్థులను అసలుసిసలైన పండగ చేసుకోమంటుంది.
ఇంకా సెప్టెంబర్ నెలే ముగియలేదు, అప్పుడే అక్టోబర్ సెలవుల గురించి మాట్లాడున్నాడేంటని అనుకుంటున్నారా? ఎందుకంటే అక్టోబర్ నెల ఆరంభంలోనే సెలవు వస్తోంది. సరిగ్గా పిల్లల పరీక్షల వేళ, దసరా హాలిడేస్ కు ముందు వస్తున్న ఈ హాలిడే చాలా ప్రత్యేకమైనది. అందుకే ఈ సెలవు గురించి ముందుగానే మాట్లాడాల్సి వస్తోంది.
ఈ శుక్రవారం అధికారిక సెలవు
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రెండ్రోజులే (సెప్టెంబర్ 30, అక్టోబర్ 1) స్కూళ్లు, కాలేజీలు నడిచేది... తర్వాత వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి. ఇలా అక్టోబర్ నెల ప్రారంభమవుతుందో లేదో అలా సెలవు వస్తోంది. అక్టోబర్ 2న భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి... ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉంది. ఇది జాతీయ సెలవుదినం కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యార్థులు, ఉద్యోగులకు ఈ శుక్రవారం స్పెషల్ హాలిడే ఉంటుంది.
అక్టోబర్ 3 సెలవేనా?
హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ, కార్పోరేట్ కంపెనీలు ఎక్కువగా ఉంటాయి... ఈ ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవులుంటాయి. అయితే ఇలాంటి ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే విద్యాసంస్థలు కూడా ప్రతి వీకెండ్ రెండ్రోజుల సెలవు విధానాన్ని పాటిస్తాయి. ఇలా వీకెండ్ రెండ్రోజుల సెలవులుండే విద్యార్థులకు గాంధీ జయంతి సెలవు కలిసిరానుంది... వీరికి వరుసగా అక్టోబర్ 2,3,4 (శుక్ర, శని, ఆదివారాలు) మూడ్రోజులు సెలవులే.
అయితే అక్టోబర్ 3 (శనివారం) సెలవు చాలా తక్కువమందికి వర్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు శనివారం వర్కింగ్ డేనే... చాలా ప్రైవేట్ స్కూల్స్ యదావిధిగా నడుస్తాయి, కొన్నింటికి హాఫ్ డే ఉండవచ్చు. పరీక్షల సమయం కాబట్టి శనివారం డుమ్మా కొడితే మూడ్రోజుల సెలవులు కలిసివస్తాయని విద్యార్థులు భావించకూడదు... స్కూల్ ఉంటే తప్పనిసరిగా హాజరవ్వండి.
అక్టోబర్ 4 సెలవే..
అక్టోబర్ 4 ఆదివారం... ప్రతి వారంలో మాదిరిగానే ఈరోజు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది. పరీక్షల సమయం కాబట్టి ఈ సండే కూడా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది... బాగా చదువుకుని ఎగ్జామ్ కు మరింత బాగా సన్నద్దం కావచ్చు. అప్పటికే ఎగ్జామ్స్ కోసం కష్టపడి చదివినవారు కాస్త రిలాక్స్ కావచ్చు. మొత్తంగా పరీక్షల మధ్యలో వచ్చే ఆదివారం విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనది.
ఇలా గాంధీ జయంతి సెలవుతో కొందరికి లాంగ్ వీకెండ్ కలిసివస్తోంది. దసరా సెలవులకు ముందు ఇలా వరుసగా సెలవులు రావడం విద్యార్థులకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ పరీక్షల సమయం కాబట్టి ఈ సెలవులను చదువు కోసమే కేటాయించాలి… తర్వాత ఎలాగూ దసరా సెలవులుంటాయి కాబట్టి అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు.
అక్టోబర్ 2న వైన్ షాపులు బంద్
జాతిపిత మహాత్మా గాంధీజీ ఆల్కహాల్ ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఇది ఒక అలవాటు కాదు సమాజానికి పట్టిన అతిపెద్ద శాపంగా పేర్కొనేవారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో మందు మహమ్మారిపై నిషేధం అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు... కానీ అది జరగలేదు. అయితే మహాత్మా గాంధీపై గౌరవంతో ఆయన జన్మదినం రోజు అంటే అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయాలను నిలిపివేస్తారు. ఇలా అక్టోబర్ 2న కూడా వైన్స్ లు, బార్లు బంద్ అవుతాయి... ఈరోజు మందు అమ్మడం చట్టరిత్యా నేరం.

