- Home
- Telangana
- Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాలకు హెచ్చరికలు పంపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్‌డేట్స్ మీకోసం.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారుతోంది. గత కొన్ని రోజులుగా దంచికొట్టిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకునే లోపే, బంగాళాఖాతంలో పరిణామాలు మళ్లీ మారాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో అక్కడక్కడ వానలు.. ఈదురుగాలుల హెచ్చరిక
తెలంగాణ విషయానికి వస్తే, ప్రస్తుతం భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి అత్యవసర హెచ్చరికలు లేదా ప్రత్యేక అలర్ట్‌లు జారీ చేయలేదు. కానీ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం క్షణాల్లో మారే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేవారు, వాహనదారులు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని ఐఎండీ పేర్కొంది.
ఏపీ వెదర్ అప్‌డేట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రా వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమతో పాటు రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్ష సూచన ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద
ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి నదిలో వరద ఉధృతి కాస్త తగ్గుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 36.4 అడుగులకు చేరుకోగా, కూనవరం వద్ద 17.8 మీటర్లు, పోలవరం వద్ద 11.7 మీటర్లుగా నమోదైంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు ప్రస్తుతం 9.71 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాస్త తగ్గుతున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రమాదకర ప్రయాణాలు వద్దు.. అధికారుల సూచనలు
వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న కాజ్‌వేలు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ఉరుములు-మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా పాత హోర్డింగ్‌ల వద్ద నిలబడకూడదని స్పష్టం చేశారు. రైతులు, గొర్రెల కాపరులు వర్షం కురిసే సమయంలో సురక్షితమైన కాంక్రీట్ నిర్మాణాలలో ఆశ్రయం పొందడం మంచిదని పేర్కొన్నారు.

