ఖైరతాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి… ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా అసెంబ్లీ కార్యదర్శి ఈ సీటు రెండేళ్ల కిందటే ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల చేశారు.

Khairatabad Byelection : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో ఉపఎన్నికలు ఖాయమయ్యాయి... అయితే వీటిని ఎప్పుడు నిర్వహిస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదలచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఖైరతాబాద్ అసెంబ్లీకి వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

2024 లోనే ఖైరతాబాద్ సీటు ఖాళీ..

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి విడుదలచేసిన రాజపత్రం (గెజిట్) లో ఆసక్తికర అంశాన్ని గమనించవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరినట్లు తెలంగాణ హైకోర్టు, దేశ సుప్రీంకోర్టు తేల్చాయి... దీంతో అతడు పార్టీ పిరాయించినట్లు కన్ఫర్మ్ చేశాయి. ఈ క్రమంలో అతడిపై అనర్హత 2024 ఏప్రిల్ 23 నుండి అమల్లోకి వచ్చింది... ఇదే విషయాన్ని గెజిట్ లో కూడా పేర్కొన్నారు.

దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఖైరతాబాద్ సీటు ఖాళీ అయ్యిందన్నమాట... అంటే దాదాపు రెండేళ్లకు పైగా అయ్యింది. కాబట్టి త్వరలోనే ఖైరతాబాద్ ఉపఎన్నిక జరపాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఎన్నికల సంఘం ఎప్పుడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేస్తుందో చూడాలి.

అసలేంటి దానం నాగేందర్ వివాదం?

తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయింది... మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారాన్ని కోల్పోవడంతోనే బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు… వీరిలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన దానం నాగేందర్ ఒకరు.

ఇలా తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బిఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దానం నాగేందర్ పై ఫిర్యాదుచేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఈ వ్యవహారంపై పలుమార్లు విచారణ జరిపింది... పూర్తి సమాచారాన్ని సేకరించి, ఇరుపక్షాల వాదనలు వింది. సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన దానం పార్టీ పిరాయించినట్లు నిర్దారించింది… ఈ మేరకు సెప్టెంబర్ 18న దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై తుదితీర్పు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది... దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టుకు వెళ్లారు... అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయ్యింది. మొత్తంగా ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ ఖాళీ అయ్యింది… ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.