- Home
- Telangana
- ఈ చట్నీ జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే బ్రో.. హైదరాబాద్‌లో 50 ఏళ్ల నాటి టిఫిన్ సెంటర్.
ఈ చట్నీ జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే బ్రో.. హైదరాబాద్‌లో 50 ఏళ్ల నాటి టిఫిన్ సెంటర్.
Hyderabad: హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ, ఇరానీ ఛాయ్. కానీ ఇక్కడి గల్లీలలో దొరికే టిఫిన్స్ కూడా అంతే ప్రత్యేకం. అటువంటి అరుదైన, పురాతనమైన టిఫిన్ సెంటర్లలో మల్లేపల్లిలోని 'లింగయ్య టిఫిన్ సెంటర్' ఒకటి.

50 ఏళ్ల వారసత్వం - అమోఘమైన రుచి
లింగయ్య టిఫిన్ సెంటర్ కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు, అది ఒక వారసత్వం. సుమారు 50 ఏళ్లుగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వీరు టిఫిన్స్ అందిస్తున్నారు. కాలం మారుతున్నా ఇక్కడి రుచి మాత్రం ఇంచు కూడా మారలేదని ఇక్కడికి వచ్చే కస్టమర్లు చెబుతుంటారు.
ఇడ్లీ, వడ మాత్రమే
లింగయ్య టిఫిన్ సెంటర్‌లో కేవలం ఇడ్లీ, వడ మాత్రమే లభిస్తాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తటి ఇడ్లీలు, బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే వడలు ఇక్కడి ప్రత్యేకత. ప్రతిరోజూ తాజాగా రుబ్బిన పిండితో, వేడివేడిగా వడ్డిస్తారు. ముఖ్యంగా ఇక్కడి వడ రుచి చూడటానికి నగరంలోని నలుమూలల నుండి భోజన ప్రియులు తరలివస్తుంటారు.
నోరూరించే చట్నీ.. అద్భుతమైన రుచి
టిఫిన్ సెంటర్లలో చట్నీ అనేది ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వడ్డించే చట్నీలు చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి పల్లీ చట్నీ ఇడ్లీ, వడల రుచిని మరో స్థాయికి తీసుకెళ్తుంది. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ఈ చట్నీలు ఇంటి రుచిని గుర్తుకు తెస్తాయి. కేవలం ఈ చట్నీ తినడానికే ఈ టిఫిన్ సెంటర్‌కి జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతుంటారు.
సామాన్యులకు అందుబాటులో..
నగరంలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, లింగయ్య టిఫిన్ సెంటర్‌లో మాత్రం సామాన్యుడికి అందుబాటులోనే ధరలు ఉన్నాయి. తక్కువ ధరకే కడుపు నిండా నాణ్యమైన, పరిశుభ్రమైన అల్పాహారం లభించడం ఇక్కడి విశేషం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడ క్యూ కడుతుంటారు.
ఇంతకీ టిఫిన్ సెంటర్ ఎక్కడుందంటే.?
ఈ ప్రసిద్ధ టిఫిన్ సెంటర్ హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉంది. మల్లేపల్లి చౌరస్తా నుంచి కామెర్లకు మందు వేసే ఆసుపత్రి దారిలో ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. గోషామహల్, నాంపల్లికి సమీపంలో ఉంటుంది. మరెందుకు ఆలస్యం హైదరాబాద్‌లోని స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిని ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నా, లింగయ్య టిఫిన్ సెంటర్‌లోని చట్నీని రుచి చూడాలన్నా వెంటనే ఓసారి మల్లేపల్లికి వెళ్లిరండి.

