- Home
- Telangana
- Business Ideas : తెలుగు మహిళలకు లక్కీ ఛాన్స్.. చేతిలో రూపాయి లేకున్నా ప్రభుత్వమే బిజినెస్ పెట్టిస్తుంది, నెలనెలా రూ.40 వేల ఆదాయం
Business Ideas : తెలుగు మహిళలకు లక్కీ ఛాన్స్.. చేతిలో రూపాయి లేకున్నా ప్రభుత్వమే బిజినెస్ పెట్టిస్తుంది, నెలనెలా రూ.40 వేల ఆదాయం
Indira Dairy Scheme : తెలంగాాణ ప్రభుత్వం మహిళల కోసం మరో అద్భుతమైన పథకాన్ని అమలుచేస్తోంది. డబ్బులిచ్చిమరీ బిజినెస్ పెట్టించి నెలకు రూ.20-40 వేల ఆదాయం పొందే అవకాశం కల్పిస్తోంది.

మహిళల కోసం సూపర్ బిజినెస్
Indira Dairy Scheme : గతంలో జనాభాలో మాత్రమే మహిళలకు సగభాగం... మిగతా అన్నిరంగాల్లో పురుషాధిక్యమే. ఇప్పుడు కాలం మారింది... ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది... ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే మహిళల సక్సెస్ రేటే ఎక్కువగా ఉంటోంది. అన్నిట్లో మహిళలు సగభాగంగా మారారు. ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం అనేక పథకాలను తీసుకువస్తున్నాయి. ఇలా రేవంత్ సర్కార్ కూడా ఆర్టిసికి బస్సులను అద్దెకివ్వడం, పెట్రోల్ బంకులను పెట్టించడం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ మార్గాలను చూపిస్తోంది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల కోసం అమలుచేస్తున్న ఓ అద్భుతమైన పథకం గురించి చాలామందికి తెలియదు. ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలవుతోంది.. రాష్ట్రవ్యాప్తంగా అమలయితే మాత్రం మహిళా సంఘాల్లోని ప్రతి ఆడపడుచుకు వ్యక్తిగత ఆదాయం పెరగనుంది. ప్రభుత్వమే వ్యాపారం పెట్టించి ఆదాయమార్గం చూపించే ఈ పథకం గురించి తెలుసుకుందాం.
ఏమిటీ ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్..?
తెలంగాణ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వమే మహిళా సంఘాల సభ్యులకు రూ.2 లక్షల విలువచేసే రెండు పాడిగేదెలు లేదా ఆవులు ఇస్తుంది. వీటి ద్వారా మహిళలు ప్రతిరోజూ ఆదాయాన్ని పొందవచ్చు.
ప్రభుత్వం గేదెల కోసం అందించే పెట్టుబడి డబ్బులో రూ. 1,40,000 సబ్సిడీ... అంటే 70 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 60 వేలు అంటే 30 శాతం డబ్బులను కూడా బ్యాంకుల నుండి రుణం అందేలా చూస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళలు చిన్న డెయిరీ ఫామ్ ఏర్పాటుచేసుకుని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
ప్రభుత్వం కల్పించే మరిన్ని సదుపాయాలు
ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ కింద పాడిగేదెలను అందించడమే కాదు మహిళలకు అవసరమైన ఇతర ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేస్తుంది. పశువులకు గడ్డి, దాణా సరఫరా బాధ్యతను గ్రామీణ యువతకు అప్పగించనున్నారు. తద్వారా మహిళలకే కాదు యువతకు కూడా స్థానికంగా ఉపాధి కల్పించవచ్చు అనేది రేవంత్ సర్కార్ ప్లాన్.
ఇక పాడిపశువుల ఆరోగ్య బాధ్యత పశు వైద్యులకు అప్పగించనుంది. పశువుల కోసం ఏర్పాటుచేసే షెడ్ కు సౌర విద్యుత్ కల్పించనున్నారు. ఇలా అన్నివిధాలుగా మహిళలకు డెయిరీ నిర్వహణలో సహకారం అందించనుంది ప్రభుత్వం. తద్వారా మహిళలు నెలకు రూ.40 నుండి రూ.50 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
మహిళలకు డెయిరీ ద్వారా వచ్చే ఆదాయం ఎంత?
ఇందిరా డెయిరీ పథకం ద్వారా ఓ మహిళా సంఘం సభ్యురాలు రూ.2 లక్షలతో రెండు మేలుజాతి ముర్రా గేదెలను తీసుకుంది అనుకుందాం. ఒక్కో గేదె ఉదయం 5, రాత్రి 5 లీటర్ల పాలు ఇచ్చినా రెండుపూటలు కలిపి రోజుకు 20 లీటర్లు అవుతాయి. లీటర్ కు తక్కువలో తక్కువ రూ.50-60 వచ్చినా 20 లీటర్లకు రూ.1000-1200 అవుతుంది. నెలకు పాల ద్వారానే రూ.30,000-36,000 వరకు ఆదాయం వస్తుంది. ఇక పశువుల ఎరువు ద్వారా కూడా మరికొంత ఆదాయం పొందవచ్చు. మొత్తంగా రెండు గేదెల ద్వారా రూ.30,000 నుండి రూ.40,000 ఆదాయం పొందవచ్చు. ఇందులో రూ.20,000 ఖర్చులు పోయినా రూ.20,000 లాభం పొందవచ్చు. ఇలా గ్రామీణ మహిళలు నెలనెలా మంచి ఆదాయాన్ని పొంది వారి కాళ్లపై వాళ్లు నిలబడవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశం ఈ ఇందిరా డెయిరీ స్కీమ్ ద్వారా మహిళలకు కల్పిస్తోంది కాంగ్రెస్ సర్కార్.
పైలట్ ప్రాజెక్టుగా మధిరలో అమలు
ఈ ఇందిరా డెయిరీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దీన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో అమలుచేస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో కూడా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇలా ముందుగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి పరిశీలించనున్నారు.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రభుత్వం అంచనాలు సిద్దంచేసింది... మొత్తం 781 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. ఇందులో 286 కోట్లను విడుదల కూడా చేసింది. మిగతా నిధులు కూడా త్వరలోనే విడుదలచేసి ప్రతి మహిళా సంఘంలోని ఔత్సాహిక మహిళలతో డెయిరీ బిజినెస్ పెట్టిస్తామంటోంది రేవంత్ సర్కార్.

