నీరజ్ చోప్రాకి రూ.6 కోట్ల పారితోషికం... భజరంగ్ పూనియాకి రూ.2.50 కోట్లు... హర్యానా ప్రభుత్వం ప్రకటన...
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాపై వరాల జల్లు కురిపించింది హర్యానా ప్రభుత్వం. హర్యానాలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా... ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే...
స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకి రూ.6 కోట్ల నగదు పారితోషికం ప్రకటించారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్... ‘నీరజ్ చోప్రాకి రూ.6 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నాం.
అలాగే క్లాస్ 1 ప్రభుత్వ ఉద్యోగం, హర్యానాలో ఎక్కడ కావాలంటే అక్కడ 50 శాతం కంసెషన్తో ఫ్లాట్... అలాగే పంచ్కులాలో ఓ అథ్లెటిక్స్ సెంటర్ నిర్మించి ఇస్తాం...’ అంటూ ప్రకటించారు మనోహర్ లాల్...
అలాగే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన హర్యానాకు చెందిన భజరంగ్ పూనియాకి కూడా రూ.2.5 కోట్ల పారితోషికం ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. భజరంగ్కి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఫ్లాట్‌ని కూడా ఆఫర్ చేశారు హర్యానా సీఎం...
రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాకి రూ.4 కోట్ల నగదు పారితోషికం అందించిన హర్యానా ప్రభుత్వం... హర్యానికి చెందిన హాకీ ప్లేయర్లు సురేందర్ కుమార్, సుమిత్ వాల్మికీలకు చెరో రూ.2.5 కోట్లు నగదు పారితోషికంతో పాటు ఫ్లాట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు...
భారత క్రికెట్ బోర్డు కూడా నీరజ్ చోప్రాకి రూ. కోటి నగదు పారితోషికం ప్రకటించింది. రజత పతకం సాధించిన మీరాభాయి ఛాను, రవికుమార్ దహియాలకు చెరో రూ.50 లక్షల పారితోషికం ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జై షా... కాంస్య పతక విజేతలు పీవీ సింధు, లవ్లీనా, భజరంగ్ పూనియాలకు తలా రూ.25 లక్షల పారితోషికం ప్రకటించాడు.
అలాగే 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకి రూ.1.25 కోట్లు నగదు బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...