దిత్వా తుపాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Cyclone Ditwah : దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

దిత్వా తుపాను: ఆంధ్ర, తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను బలహీనపడుతోంది. కానీ, తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దిత్వా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖలు హెచ్చరికలు చేశాయి. చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి.
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం బుధవారం (డిసెంబర్ 3) ఏపీలోని పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ తిరుపతి జిల్లాలోని మల్లం (53.5 మి.మీ.), తడ (50.7 మి.మీ.), చిత్తమూరు (50.2 మి.మీ.), పూలతోటలో 33.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ ప్రకారం, బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో కూడా వర్ష సూచనలు
వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘాలతో నిండిన వాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, కొన్ని చోట్ల వర్షాలు పడే ఛాన్సులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇదిలా వుండగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రంత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం పొగమంచు కారణంగా రాకపోకల పై ప్రభావం పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువైంది.
చెన్నైలో దిత్వా ప్రభావం.. దంచికొడుతున్న వానలు
తమిళనాడులో దిత్వా తుపాను ప్రభావం కనిపిస్తోంది. బలహీనపడిన వ్యవస్థ చెన్నై తీరానికి అతి సమీపంలో స్థిరంగా ఉండటంతో భారీ వానలు పడుతున్నాయి. చెన్నై తీరానికి 40 కి.మీ దూరంలోనే వ్యవస్థ నిలిచిపోయినట్లు ఐఎండీ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
వర్షాల కారణంగా చెన్నైలో ముఖ్య రహదారి మౌంట్ రోడ్‌కు వరదనీరు చేరింది. ఆసియాలో అతిపెద్ద ‘కోయంబేడు మార్కెట్’ను మూసివేశారు. మెరీనా బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 1,601 గుడిసెలు ధ్వంసం అయ్యాయి. నలుగురు మృతి చెందగా, 2.11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
విద్యాసంస్థలకు సెలవులు
చెన్నై, తిరువళ్ళూర్, చెంగల్పట్టు, రానిపేట, కాంచీపురం జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. చెన్నై, తిరువళ్ళూరు జిల్లాల్లో బుధవారం స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
అలాగే, ఏపీ కోస్తాంధ్ర జిల్లాలకూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

