బీసీసీఐ లేకపోతే మీ బతుకు ఎంత.? సఫారీల కోచ్‌పై గవాస్కర్ గుస్సా
Sunil Gavaskar: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ టీమిండియాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి తీసుకురావడంలో..

సఫారీల కోచ్ వ్యాఖ్యలు వైరల్
దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌహతి టెస్ట్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ మండిపడ్డారు. ఇటీవల భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
సఫారీల కోచ్ పై గుస్సా
ఈ విజయానంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రెండవ ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా ఎందుకు డిక్లేర్ చేశారని అడిగిన ప్రశ్నకు, టీమిండియాను మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి, చివరికి వారిని తమ ముందు సాష్టాంగం పడేలా చేసేందుకే అలా చేశామని కాన్రాడ్ బదులిచ్చారు. భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాలని, కానీ ఫలితం తమకు అనుకూలంగా రావాలని, చివరి రోజు చివరి నిమిషం వరకు టీమిండియా ప్లేయర్స్ పోరాడుతూనే ఉండాలని, తాము పైచేయి సాధించాలని అన్నారు.
గవాస్కర్ కీలక కామెంట్స్..
షుక్రీ కాన్రాడ్ చేసిన ఈ వ్యాఖ్యలపై రెండు దేశాల క్రికెట్ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జియో హాట్ స్టార్ షో క్రికెట్ లైవ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. 20 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న దక్షిణాఫ్రికాకు ఆ సమయంలో భారత క్రికెట్ బోర్డు అండగా నిలిచిందని గవాస్కర్ తెలిపారు. సఫారీలు నిషేధం తర్వాత ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ భారత్‌లోనే అని ఆయన గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని కాన్రాడ్ మర్చిపోయారా అంటూ గవాస్కర్ ప్రశ్నించారు.
మంచి సత్సంబంధాలు ఉండగా ఈ కామెంట్స్..
రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సత్సంబంధాలు ఉన్న నేపధ్యంలో, షుక్రీ కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం దురదృష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం లేదని, కానీ తదుపరి మీడియా సంభాషణలో దీని గురించి మాట్లాడతారని తాను ఆశిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నారు. "నేను వ్యక్తిగతంగా క్షమాపణలు నమ్మను, కానీ తప్పును సరిదిద్దుకోవడం మంచిది. ఎవరైనా భావోద్వేగంతో మాట్లాడే సందర్భాలు ఉంటాయి. భావోద్వేగంతో అతను అలా మాట్లాడాడని నేను భావిస్తున్నాను," అని సన్నీ అన్నారు.
పగ తీర్చుకున్న టీమిండియా
ఈ వివాదం మధ్య, రాంచీ జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది. సునాయాసంగా గెలుస్తుందని భావించినప్పటికీ, సఫారీ బ్యాటర్లు చివరి వరకు భారత జట్టును భయపెట్టారు. అయితే, మన బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీయడంతో భారత్ విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు ఇప్పుడు రెండో వన్డేపై దృష్టి సారించింది.

