Relationship Tips: భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?
Relationship Tips: సంతోషకరమైన వివాహానికి వయసు అసలు అడ్డంకే కాదు. ప్రేమకు కులం, వయసు, లింగ బేధం ఉండదు. కానీ, విజయవంతమైన వివాహానికి ఒక నిర్దిష్ట వయసు వ్యత్యాసం అవసరం అని శాస్త్రీయంగా చెబుతారు.

Relationship Tips
దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా సంతోషంగా ఉండాలి అంటే ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండాలి. దంపతులను ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయితే.. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది వారి మధ్య ఏజ్ గ్యాప్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అందరూ చెబుతుంటారు. ఇది నిజమేనా? అసలు.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం....
వయసు వ్యత్యాసం..
సంతోషకరమైన వివాహానికి వయసు అసలు అడ్డంకే కాదు. ప్రేమకు కులం, వయసు, లింగ బేధం ఉండదు. కానీ, విజయవంతమైన వివాహానికి ఒక నిర్దిష్ట వయసు వ్యత్యాసం అవసరం అని శాస్త్రీయంగా చెబుతారు. సాధారణంగా, మన దేశంలో భార్య వయసు భర్త కంటే తక్కువ ఉండాలి అని నమ్ముతుంటారు. భారతీయ సంస్కృతిలో... భార్యాభర్తల మధ్య 3 నుంచి 5 సంవత్సరాల వయసు అంతరం ఉండాలని భావిస్తుంటారు. కానీ.. ఈ నియమాన్ని ఈ మధ్యకాలంలో ఎవరూ పట్టించుకోవడం లేదనే చెప్పొచ్చు. సేమ్ వయసు ఉన్నవారు పెళ్లి చేసుకుంటున్నారు... ఎక్కువ గ్యాప్ ఉన్నవారు కూడా చేసుకుంటున్నారు.
శాస్త్రీయ కారణం ఏమిటి?
మానసిక, శారీరక పరిపక్వత వివాహ బంధంలో కీలకం. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పరిణతి చెందుతారు. అమ్మాయిల్లో హార్మోన్ల మార్పులు 7 నుండి 13 సంవత్సరాల మధ్య జరుగుతాయి, అబ్బాయిల్లో అయితే 9 నుండి 15 సంవత్సరాల మధ్య కనిపిస్తాయి. ఈ కారణంగా, అమ్మాయిలు మానసికంగా , శారీరకంగా అబ్బాయిల కంటే త్వరగా పెద్దవాళ్లవుతారు. అందుకే 3 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం సహజంగా సరిపోతుందని చెబుతారు.
అసలు వివాహాన్ని విజయవంతం చేసేది ఏమిటి?
అయితే, కేవలం వయస్సు వ్యత్యాసమే ఒక వివాహం సాఫల్యాన్ని నిర్ణయించదు. ఒక జంట సంతోషంగా ఉండటానికి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. దంపతుల మధ్య ప్రేమ, గౌరవం, భాగస్వామ్యం , అవగాహన ఉండాలి. ఇవి ఉంటే... ఏజ్ గ్యాప్ అనేది అసలు మ్యాటరే కాదు.