Parenting Tips: పిల్లలకు జ్వరం, తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
చాలామంది పిల్లలకు జ్వరంతో పాటు తలనొప్పి కూడా వస్తుంటుంది. దానివల్ల పిల్లలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు.. పిల్లలకు జ్వరంతో పాటు తలనొప్పిని నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Kids Headache Home Remedies
పెద్ద వాళ్లలో తలనొప్పి రావడం సాధారణం. నిద్రలేమి, ఒత్తిడి ఇతర కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. కానీ చిన్న పిల్లలకు జ్వరంతోపాటు తలనొప్పి వస్తే వారు చాలా ఇబ్బంది పడతారు. సాధారణంగా చిన్న పిల్లలకు కొన్ని రకాల ఆహారాలు, వాసనలు, ఇతర కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే జ్వరం సమయంలో సైనస్ ఇన్ఫెక్షన్, జలుబు వంటి వాటి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. పిల్లల్లో జ్వరంతో వచ్చే తలనొప్పిని తగ్గించే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి తెలుసుకోండి.
తగినంత నీరు
సాధారణంగా పిల్లలు జ్వరం సమయంలో తగినంత నీరు తాగరు. కాబట్టి వారికి ఎప్పటికప్పుడు నీరు, పండ్ల రసాలు ఇవ్వాలి. అలాగే జీలకర్ర నీరు వంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే నొప్పి కొంత తగ్గుతుంది. జ్వరం కూడా క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
నుదురుపై మసాజ్..
చాలామంది పిల్లలకు జ్వరం రాగానే తలనొప్పి కూడా వస్తుంది. నొప్పిని తగ్గించడానికి మసాజ్ చేయవచ్చు. దీని కోసం మీ అరచేతిని పిల్లల నుదుటిపై ఉంచి మెల్లగా మసాజ్ చేయాలి. మెడ, భుజాలపై కూడా మసాజ్ చేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది.
శ్వాస వ్యాయామం
శ్వాస వ్యాయామం కూడా తలనొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. అందుకోసం పిల్లలను సౌకర్యవంతంగా కూర్చోబెట్టి శ్వాస వ్యాయామం చేయమని చెప్పవచ్చు. ఈ వ్యాయామం వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జ్వరంతో అలసిపోయిన శరీరం తిరిగి కోలుకుంటుంది.
ఐస్ క్యూబ్
తలనొప్పిని తగ్గించడానికి పిల్లల నుదురు, మెడపై ఐస్ క్యూబ్ పెట్టవచ్చు. అయితే ఐస్ క్యూబ్ ను నేరుగా పిల్లల నుదుటిపై ఉంచకూడదు. ఒక మృదువైన క్లాత్ లో చుట్టి నుదురు, మెడపై నెమ్మదిగా మసాజ్ చేయడం మంచిది. దానివల్ల శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.
నొప్పి నివారణ మాత్రలు
పిల్లలకు జ్వరంతో వచ్చే తలనొప్పిని తగ్గించడానికి కొన్ని నొప్పి నివారణ మందులు ఉపయోగపడతాయి. అయితే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని వాడటం మంచిది.
గమనిక:
పిల్లలకు జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, డబుల్ విజన్ వంటివి ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.