ఎన్టీఆర్, కేసీఆర్ రాజకీయాలు: ఈటల రాజేందర్ ఎగ్జిట్ వెనక
ఈటెల రాజేందర్ ని కేసీఆర్ ఏకంగా బర్తరఫ్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేసీఆర్ ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి గత రాజకీయాలను పరిశీలించాల్సిందే..!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద అంత తీవ్రమైన చర్య తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఈటల రాజేందర్ వరకే పరిమితమైన విషయమా? ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే కేసీఆర్ వ్యవహార శైలిని మాత్రమే కాదు, మొత్తం ప్రాంతీయ పార్టీల పనితీరును కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
నిజానికి, ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా నడుస్తుంటాయి. మనం దేశంలోని ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను పరిశీలించినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వ్యవహారాలను చూసినా మనకు అర్థమవుతుంది. టీడీపీలో కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలవంటివే చోటు చేసుకున్నాయి.
తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించి ముందుకు సాగుతున్న క్రమంలో కొంత మంది ముఖ్య నాయకులు అనివార్యంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కర రావు ఎక్కువ కాలం అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆనాడు ప్రతిపక్షాలన్నీ ఏకమైన పెద్ద ఉద్యమమే చేపట్టాయి. ఆ క్రమంలో నాదెండ్ల భాస్కర్ రావు గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ అనేది ఎన్టీఆర్ కు సంబంధించిన పార్టీ కావడం.
ఆ తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ ముఖ్య నేతగా ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ఆయనే అధికార కేంద్రంగా ఉంటూ వచ్చారు. చెప్పాలంటే పార్టీలో ఆయన రెండో అధికార కేంద్రంగా కొనసాగారు. ఇది సహజంగానే ఎన్టీఆర్ కు లేదా ఆయన కుటుంబ సభ్యులకు నచ్చని వ్యవహారం. దీంతో పార్టీలో రాజకీయాలు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. దీంతో ఆయన పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు జానా రెడ్డి కూడా టీడీపీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి అందుకే వచ్చింది.
ఎన్టీఆర్ మీద తిరగబడి విజయం సాధించిన నాయకుడు కేవలం చంద్రబాబు ఒక్కరే. చంద్రబాబు విజయం సాధించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి. ఒక్కటి ఆయన ఎన్టీఆర్ కు స్వయాన అల్లుడు కావడం, రెండో కారణం ఒక సంబంధించిన సామాజిక వర్గం ప్రభావశీలురు చంద్రబాబుకు అండగా నిలవడం. పార్టీ, ప్రభుత్వం ఎన్టీఆర్ నాయకత్వంలో ఉన్నప్పుడు పార్టీని అన్ని విధాల చంద్రబాబు తన నియంత్రణలోకి తెచ్చుకోవడం. అల్లుడు కావడంతో ఎన్టీఆర్ ఆయనపై విశ్వాసం ఉంచడం అందుకు దోహదపడింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశాన్ని తన బలసమీకరణకు పార్టీ శ్రేణులను కూడగట్డడానికి బలంగా వాడుకున్నారు.
ప్రస్తుత టీడీపీ వ్యవహారాలను చూసే మనకు అదే కనిపిస్తుంది. టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం ఆయన కుమారుడు నారా లోకేష్ దే. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ విషయాన్ని బేషరతుగా అంగీకరించాల్సిందే. నారా లోకేష్ కు అడ్డువస్తారని భావించిన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కకు తప్పించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను తన వైపు తిప్పుకుని ఎన్టీఆర్ మరో కుమారుడు నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని ఆయన పక్కన పెట్టారు.
తమిళనాడు రాజకీయాలకు సంబంధించి డిఎంకేలో కరుణానిధి తర్వాత స్టాలిన్ ముందుకు వచ్చారు. కరుణానిధి తన వారసత్వాన్ని కరుణానిధికి అప్పగించడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. మరో కుమారుడు అళగిరి వ్యతిరేకించినా ఆయన పట్టించుకోలేదు. స్టాలిన్ తర్వాత ఆయన కుమారుడు మాత్రమే వస్తారు గానీ మరొకరు డీఎంకెను తమ చేతుల్లోకి తీసుకుని అవకాశం లేదు. మహారాష్ట్రలో శివసేన తీరుతెన్నులను చూసినా మనకు అదే అర్థమవుతుంది.
టీఆర్ఎస్ విషయానికి వస్తే.. ఇన్నయ్య కేసీఆర్ కు అన్ని విధాల పక్కన నిలబడుతూ వచ్చారు. కొంత కాలం తర్వాత ఆయన కేసీఆర్ కు దూరం కావాల్సి వచ్చింది. ఆయన ప్రస్తుతం ఓ అనాథ శరణాలయం నడుపుతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆలే నరేంద్రకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన తర్వాతి నాయుకుడిగా ఆలే నరేంద్రను చూపిస్తూ వచ్చారు. చివరకు ఆయన పార్టీలో ఇమడలేని పరిస్థితులను ఎదుర్కున్నారు. దాంతో బయటకు రావాల్సి వచ్చింది.
ఆ తర్వాత ప్రస్తుత బిజెపి నాయకురాలు విజయశాంతి వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విజయశాంతికి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. తనకు పెట్టనికోట అయిన మెదక్ స్థానం నుంచి పోటీ చేయించి లోకసభ దాకా తీసుకుని వెళ్లారు. కేసీఆర్ తర్వాతి కుర్చీ విజయశాంతిదే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. విజయశాంతి తన ఆవేదనను బయటకు చెప్పుకోలేక, లోపల అణచుకోలేక పూర్టీ నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ లో నరేంద్రకు, విజయశాంతికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. ఈటల రాజేందర్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి వచ్చినట్లు ప్రతిపక్షాల చేత అనిపించుకున్నారు. ఇది కేసీఆర్ కుటుంబ సభ్యులకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ గానీ, ఆయన ఇతర కుటుంబ సభ్యులు గానీ ముందుకు రావాలి గానీ ఈటల రాజేందర్ ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. ఆ స్థితిలోనే ఈటల రాజేందర్ ను తప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
చివరకు ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, నరేంద్ర మాదిరిగానో, విజయశాంతి మాదిరిగానో ఆయన తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల పట్ల మౌనంగా ఉండిపోలేదు. తన బలాన్నీ బలగాన్నీ కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనపై ఆవినీతి ఆరోపణలు ముందుకు వచ్చాయి. దాన్ని చూపించి కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈటలపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో వాస్తవం ఎంత అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కానీ ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.