Earth 5 Major Risks : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
Earth 5 Major Risks: భూమికి కవచంలా, రాత్రికి వెలుగులా నిలిచే చంద్రుడు మనకు దూరమైతే ఏమవుతుంది? చంద్రుడు ప్రతి ఏటా భూమి నుండి 3.8 సెం.మీ దూరంగా జరుగుతున్నాడు. దీనివల్ల భవిష్యత్తులో రోజు నిడివి తగ్గడం, భయంకరమైన తుపానులు రావడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.

అలర్ట్: చంద్రుడు దూరమవుతున్నాడు... భూమి అంతానికి ఆరంభమా?
రాత్రి వేళ ఆకాశంలో చల్లని వెలుగును పంచే చంద్రుడు మనకు కేవలం ఒక ఉపగ్రహం మాత్రమే కాదు. నిజానికి, చంద్రుడు భూమికి అతిపెద్ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లాంటివాడు. ఆకాశంలో చంద్రుడు శాంతంగా, స్థిరంగా కనిపిస్తాడు. కానీ, భూమిపై జీవం నిలబడటంలో, సముద్రపు అలల కదలికలో, చివరకు భూమి తిరిగే వేగంలో కూడా చంద్రుడి పాత్ర ఎంతో కీలకం.
అయితే, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఆకాశం నుండి చంద్రుడు మాయమైపోతే లేదా భూమికి చాలా దూరంగా వెళ్లిపోతే ఏం జరుగుతుంది? ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో మన గ్రహం ముఖచిత్రం ఎలా మారిపోతుందో తెలిపే 5 ప్రధానమైన ప్రమాదాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి ఏటా భూమికి దూరంగా జరుగుతున్న చంద్రుడు
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, చంద్రుడు స్థిరంగా ఒకే చోట ఉండటం లేదు. ఇది ప్రతి సంవత్సరం భూమి నుండి సుమారు 3.8 సెంటీమీటర్ల మేర దూరంగా జరుగుతోంది. వినడానికి ఈ దూరం చాలా తక్కువగా అనిపించవచ్చు. దీనివల్ల ఏదైనా పెద్ద విపత్తు రావడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. కానీ, ఒకవేళ నిజంగానే చంద్రుడు భూమికి శాశ్వతంగా దూరమైతే మాత్రం, మన గ్రహం స్వరూపం పూర్తిగా మారిపోతుంది. భూమిపై జీవరాశి మనుగడ సాగించడం అసాధ్యంగా మారుతుంది.
రోజుకు 24 గంటలు ఉండవు.. సమయం సగానికి తగ్గిపోతుంది
ప్రస్తుతం మనకు ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి. చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి భ్రమణ వేగానికి ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. అంటే భూమి మరీ వేగంగా తిరగకుండా చంద్రుడు నియంత్రిస్తుంటాడు.
ఒకవేళ చంద్రుడు దూరంగా వెళ్లిపోతే, భూమిపై ఈ బ్రేకింగ్ ప్రభావం ఉండదు. ఫలితంగా భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, అప్పుడు ఒక రోజు కేవలం 6 నుండి 12 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే పగలు, రాత్రి సమయాలు చాలా త్వరగా మారిపోతాయి. అంతేకాదు, ప్రస్తుతం సంవత్సరానికి 365 రోజులు ఉంటే, అప్పుడు ఆ సంఖ్య 1000 రోజులకు పైగా పెరిగే అవకాశం ఉంది.
సముద్ర అలలు తగ్గుతాయి .. జీవరాశికి ముప్పు
సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రధానంగా చంద్రుడి ఆకర్షణ వల్లే ఏర్పడతాయి. చంద్రుడు దూరంగా వెళ్తే, సముద్రపు అలల శక్తి దాదాపు 75 శాతం వరకు తగ్గిపోతుంది. దీనివల్ల సముద్రం శాంతించినట్లు అనిపించినా, ఇది పర్యావరణానికి తీరని నష్టం చేస్తుంది.
ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండే మడ అడవులు, పగడపు దిబ్బలు వంటి పర్యావరణ వ్యవస్థలు పూర్తిగా నాశనమవుతాయి. సముద్రపు నీటి కదలిక తగ్గడం వల్ల సముద్ర జీవులకు అందాల్సిన ఆహారం, పోషకాలను అందించే సైకిల్ ఆగిపోతుంది. ఇది సముద్ర జీవరాశి అంతానికి దారితీస్తుంది.
వాతావరణంలో పెనుమార్పులు.. ఎండలు, మంచు తుఫానులు
ప్రస్తుతం భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరుగుతోంది. ఈ వంపును స్థిరంగా ఉంచడంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ స్థిరత్వం వల్లే మనకు కాలాలు సక్రమంగా వస్తున్నాయి.
చంద్రుడు లేకపోతే భూమి ఒక బొంగరం లాగా ఊగిపోతుంది. దీనివల్ల వాతావరణం పూర్తిగా అదుపు తప్పుతుంది. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఉదాహరణకు, భూమధ్యరేఖ వంటి అత్యంత వేడి ప్రాంతాల్లో మంచు గడ్డకట్టవచ్చు. అలాగే ధృవాల వద్ద భరించలేనంత ఎండలు కాయవచ్చు. వాతావరణం ఎంత అనూహ్యంగా మారుతుందంటే, వ్యవసాయం చేయడం అసాధ్యమవుతుంది. మనుషులు, జంతువులు బ్రతకడం కష్టమైపోతుంది.
గంటకు 500 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు
చంద్రుడు దూరమవడం వల్ల భూమి వేగంగా తిరుగుతుంది. ఇలా భూమి భ్రమణ వేగం పెరిగితే, వాతావరణంలోని గాలుల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల గ్రహం మొత్తం మీద అత్యంత వినాశకరమైన తుపానులు ఏర్పడతాయి.
ఈ తుపాను గాలుల వేగం గంటకు 400 నుండి 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న అత్యంత ప్రమాదకరమైన తుపానుల కంటే ఇవి చాలా రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఇంతటి వేగంతో వీచే గాలులను తట్టుకుని ఎత్తైన భవనాలు, చెట్లు నిలబడటం అసాధ్యం. ఇవి భూమిపై ఉన్న ప్రతిదాన్ని నేలమట్టం చేయగలవు.
జంతుజాలానికి, పక్షులకు గడ్డుకాలం
కేవలం మనుషులకే కాదు, లక్షలాది జంతు, పక్షి జాతులకు కూడా చంద్రుడు ఎంతో అవసరం. సముద్ర తాబేళ్లు, అనేక రకాల చేపలు, పక్షులు తమ పునరుత్పత్తి, వేట, వలసల కోసం చంద్రుడి వెలుగు మీద, చంద్రుడి దశల మీద ఆధారపడతాయి. చంద్రుడు దూరమైతే వాటి సహజ జీవన చక్రం దెబ్బతింటుంది. ఇది అనేక అరుదైన జీవజాతులు అంతరించిపోవడానికి కారణమవుతుంది.
అయితే, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోంది. కానీ, ఈ విషయాలు మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. భూమిపై జీవం ఎంత అందంగా, స్థిరంగా ఉందంటే దానికి కారణం మనకు దగ్గరగా ఉన్న చందమామ. చంద్రుడు కేవలం కవిత్వానికి మాత్రమే కాదు, మన మనుగడకు కూడా ఎంతో ముఖ్యమని పరిశోధనలు చెబుతున్నాయి.

