Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణమేంటి?
Ahmedabad plane crash: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియ విమానం రన్‌వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదానికి కారణమేంటి?

అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం
Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు.
ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణమేంటి?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే, NDTVకి అందిన సమాచారం ప్రకారం, విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొట్టడంతో ఇది గరిష్ఠ టేకాఫ్ వేగాన్ని సాధించలేకపోయి కూలిపోయిన ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విమానయాన నిపుణులు స్పష్టంగా పేర్కొన్నారు.
పైలట్ సౌరభ్ భట్నాగర్ అభిప్రాయం ప్రకారం మల్టిపుల్ బర్డ్ హిట్ కేసు
మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ మాట్లాడుతూ.. “ఇది మల్టిపుల్ బర్డ్ హిట్ కేస్‌గా అనిపిస్తోంది, ఇందులో రెండు ఇంజిన్లు పవర్ కోల్పోయినట్లుంది. టేకాఫ్ సమయం సరిగానే సాగింది, కానీ గేర్ ఎత్తే సమయానికి విమానం దిగడం ప్రారంభించింది. ఇది ఇంజిన్ పవర్ కోల్పోయినపుడే జరుగుతుంది. అయితే విచారణ అనంతరం నిజమైన కారణం తెలుస్తుందని” అన్నారు.
అలాగే, విమానానికి పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లుగా రికార్డుల ప్రకారం ఉందని, ఇది అత్యవసర పరిస్థితిని సూచించేదని ఆయన పేర్కొన్నారు.
నిపుణుడు సంజయ్ లజర్ విశ్లేషణ ప్రకారం పక్షులు తాకిడి కారణం కావచ్చు
విమానయాన నిపుణుడు సంజయ్ లజర్ కూడా ఈ అంశాన్ని సమర్థించారు. “టేకాఫ్ సమయంలో పక్షుల తాకిడికి గురైనట్లయితే, విమానానికి ఎత్తుకు వెళ్లే శక్తి లేకపోవచ్చు. సాధారణంగా, అలాంటి పరిస్థితుల్లో 6 నుంచి 7 నిమిషాలకే విమానం నేలపైకి పడిపోతుంది” అని వివరించారు.
“ఈ విమానం కొత్తదే.. కేవలం 11 ఏళ్ల పాతదే గనుక సాంకేతిక లోపాలు ఉండే అవకాశం తక్కువ. విమానాశ్రయం సమీపంలో నివాస ప్రాంతముంది, అక్కడ పక్షుల సంచారం ఉండొచ్చు” అని లజర్ అన్నారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలోని ప్రయాణికుల వివరాలు ఇవే
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద విమానంలో ఉన్న వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనెడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల కుటుంబ సభ్యుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800 5691 444 ను ఏర్పాటు చేసింది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందన
ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన మనల్ని షాక్‌కు గురిచేసింది. ఇది మాటల్లో చెప్పలేని బాధ. బాధితుల సహాయార్థం మంత్రులు, అధికారులు కృషి చేస్తున్నారు” అని ఆయన X ప్లాట్‌ఫారంలో పేర్కొన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది. విచారణ పూర్తయ్యే వరకు పక్షుల తాకిడే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.