ahmedabad plane crash: ప్రమాదానిక గురైన ఎయిరిండియా విమానం నడిపిన పైలట్లు ఎవరు?
ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ నడిపిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.

అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం
గురువారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. AI 171 నంబర్ కలిగిన ఈ విమానం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి లండన్ గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది.
అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేడే (Mayday) కాల్ ఇచ్చిన ఈ విమానం, ఆ తర్వాత ఏటీసీ (Air Traffic Control) సంకేతాలకు స్పందించలేదు. పక్కనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరు?
ఈ విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్ నడిపించారు. ఆయన ప్రధాన పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు 8200 గంటల ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం, ఎల్టీసీ (Line Training Captain) అనుభవం ఉన్నట్టు సమాచారం.
ఆయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్ (First Officer) క్లైవ్ కుండర్ ఉన్నారు. క్లైవ్‌కు 1100 గంటల ఫ్లయింగ్ అనుభవం మాత్రమే ఉంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
ahmedabad plane crash: ఫస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు?
ఒక విమానాన్ని నడిపించేటప్పుడు సాధారణంగా ఇద్దరు పైలట్లు ఉంటారు. ఒకరు కేప్టెన్ కాగా, మరొకరు ఫస్ట్ ఆఫీసర్ అవుతారు. ఫస్ట్ ఆఫీసర్ సాధారణంగా జూనియర్ పైలట్ అవుతారు. వారికి అనుభవం పెరిగిన తర్వాత, సుమారు ఐదేళ్ల తర్వాత, కేప్టెన్‌గా పదోన్నతి పొందుతారు. ఈ విమానంలో క్లైవ్ కుండర్ ఫస్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద వివరాలు
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎటీసీకి మేడే సంకేతం ఇచ్చింది. ఆ తర్వాత ఏ సంకేతాలకు స్పందన రాలేదు. విమానం ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే కూలిపోయింది. ఘటనా స్థలంలో పెద్దగా నలుపు పొగలు కనిపించాయి. ప్రస్తుతం అధికారులు ప్రాణనష్టం వివరాలను వెల్లడించలేదు.
ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిరిండియా, డీజీసీఏ అధికారికంగా ప్రకటించనున్నారు. పైలట్ల అనుభవం, టేకాఫ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, అమిత్ షా స్పందన
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాన మోడీ అధికారులను, సంబంధిత శాఖ మంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అమిత్ షా సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్రం బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు.