Do you Know: 90 శాతం మందికి ఇవేంటో తెలియదు.. ఇంతకీ స్టీల్ పరికరం ఉపయోగం ఏంటంటే?
Do you Know: మన నిత్యం జీవితంలో ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుంటాం. అయితే వాటి వెనకాల ఎంతో సైన్స్ దాగి ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో పైన ఫొటోలో కనిపిస్తున్న స్టీల్ పరికరం కూడా ఒకటి. ఇంతకీ దీని ఉపయోగం ఏంటంటే.?

టర్బో వెంటిలేటర్
సాధారణంగా హైవేల మీద ప్రయాణిస్తుంటే ఫ్యాక్టరీల పైకప్పులపై గుండ్రంగా తిరిగే స్టీల్ పరికరం చాలామందికి కనిపించే ఉంటుంది. చాలా మంది దాన్ని అలంకరణ కోసమో లేదా సాధారణ ఫ్యాన్‌లాగా భావిస్తారు. కానీ నిజానికి ఇది ఒక ముఖ్యమైన ఇంజనీరింగ్ పరికరం. దీనిని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు.
టర్బో వెంటిలేటర్ అంటే ఏమిటి?
టర్బో వెంటిలేటర్ అనేది గాలి ప్రసరణను సహజంగా మెరుగుపరచే పరికరం. దీనిని ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్‌ట్రాక్టర్, అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇవి కేవలం ఫ్యాక్టరీలకే కాకుండా షాపింగ్ మాల్స్, గోదాములు, రైల్వే స్టేషన్లు వంటి పెద్ద భవనాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
వీటి ప్రధాన ఉపయోగం ఏమిటి?
ఫ్యాక్టరీలలో పని చేసే కార్మికులకు శుభ్రమైన, చల్లని గాలి అవసరం. టర్బో వెంటిలేటర్ ఈ అవసరాన్ని సులభంగా తీర్చుతుంది. లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపిస్తుంది బయట నుంచి చల్లటి గాలిని లోపలికి తీసుకువస్తుంది. తేమ, దుర్వాసనలను తగ్గిస్తుంది. లోపలి వాతావరణాన్ని సహజంగా చల్లగా ఉంచుతుంది. ఇవి విద్యుత్ అవసరం లేకుండా పనిచేయడం మరో ముఖ్యమైన లాభం.
ఇందులో పనిచేసే సైన్స్ ఏమిటి?
టర్బో వెంటిలేటర్ పని చేయడానికి వెనుక ఒక సరళమైన శాస్త్రీయ సూత్రం ఉంది. వేడి గాలి ఎప్పుడూ పైకి లేస్తుంది, చల్లటి గాలి కిందికి వస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఈ సూత్రం ఆధారంగానే ఈ పరికరం పనిచేస్తుంది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వేడి గాలి పైకి ఎగసి వెంటిలేటర్ దగ్గరకు చేరుతుంది. బయట గాలి వీచినప్పుడు ఈ పరికరం తిరుగుతుంది. ఈ రొటేషన్ వల్ల లోపలున్న వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. అదే సమయంలో బయట గాలి లోపలికి వస్తుంది. దీనిని సహజ గాలి ప్రవాహం (Natural Ventilation) అంటారు.
ఎందుకు ఇవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
టర్బో వెంటిలేటర్ ఉపయోగానికి ప్రధాన కారణాలు కరెంట్ అవసరం ఉండదు, ఇన్‌స్టాలేషన్ సులభం, నిర్వహణ ఖర్చు తక్కువ, దీర్ఘకాలం పనిచేస్తుంది అలాగే పర్యావరణానికి అనుకూలం. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే స్మార్ట్ సొల్యూషన్‌గా మారాయి.

