హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత ధర ఉందంటే..
Hyderabad: అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోని జిల్లాల నుంచి చాలా మంది ఉద్యోగాల కోసం హైదరాబాద్ రావడం సాధారణం. ఇక నగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారు కూడా చాలా మంది ఉంటారు. మరి నగరంలో ప్రస్తుతం ఇళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

హైదరాబాద్‌లో ప్రస్తుత రియల్ ఎస్టేట్ ధరలు
హైదరాబాద్‌లో ప్రాంతాలవారీగా చదరపు అడుగుకు ధరలు చాలా మారుతున్నాయి. ప్రస్తుతం కోకాపేటలో చదరపు అడుగకు రూ. 12,539గా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రూ. 10,935గా, హైటెక్ సిటీలో రూ. 10,968, మాధాపూర్‌లో రూ. 10,850, గచ్చిబౌలిలో రూ. 10,500, నార్సింగిలో రూ. 9,741, కొండాపూర్‌లో రూ. 9,200గా ఉన్నాయి.
ఇక ధరలు మధ్యస్థంగా ఉన్న ప్రాంతాల విషయానికొస్తే.. మణికొండలో రూ. 8,582, తెల్లాపూర్‌లో రూ. 8,068, పుప్పాలగూడలో రూ. 8,109 వద్ద ఉన్నాయి. మరి అందుబాటులో ఉన్న ధరలు ఏవంటారా.? వాటి విషయానికొస్తే.. మియాపూర్‌లోరూ. 7,422, కుకట్‌పల్లిలో రూ. 6,951, నిజాంపేట్‌లో రూ. 6,943, బాచుపల్లిలో రూ. 6,760, కొల్లూరులో రూ. 6,396, పటాన్‌చెరులో రూ. 5,800గా ఉన్నాయి.
గమనిక: ఈ డేటా మార్కెట్ అంచనాల ఆధారంగా ఉంటుంది. ప్రాజెక్ట్, బిల్డర్, లోకేషన్ ఆధారంగా ధరలు మారవచ్చు.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
హైదరాబాద్‌లో ప్రాపర్టీ ధరలు పెరగడానికి కొన్ని ముఖ్యమైనా కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైవని.. నగరంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లభించడం. మెట్రో, రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరగడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వలసలు రావడం. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ (West Hyderabad) ప్రాంతాలు ప్రస్తుతం హాట్ మార్కెట్‌గా మారాయి.
ఏ ఏరియాలో ఇల్లు కొనాలి?
మీ బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఎంపిక చేసుకోవాలి. హై ఎండ్ బడ్జెట్ అంటే చదరపు అడుగుకు రూ. 10 వేల వరకు పెట్టుబడి పెట్టగలం అనుకునే వారికి కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. అదే రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు పెట్టగలిగే వారికి మణికొండ, నార్సింగి, తెల్లాపూర్ సరిపోతాయి. ఇక రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు పెట్టుబడి పెట్టే వారికి మియాపూర్, కూకట్‌పల్లి, బాచుపల్లి వంటివి బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. అయితే ఉద్యోగానికి దగ్గరగా ఉంటే ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయి. దీన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోండి. లేదు అంటే పిల్లలకు స్కూళ్లు దగ్గరగా ఉండే ప్రదేశాలు కూడా ఎంచుకోవచ్చు.
ఇంటి కొనుగోలు ముందు ప్లానింగ్ ఎలా ఉండాలి?
ఇల్లు కొనడం ఒక పెద్ద ఫైనాన్షియల్ నిర్ణయం. కాబట్టి ముందుగానే సేవింగ్స్ ప్రారంభించాలి. హోమ్ లోన్ EMI మీ ఆదాయంలో 30–40% మించకూడదు. బిల్డర్ విశ్వసనీయత చెక్ చేయాలి. RERA రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూడాలి. భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలి.
ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమా?
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త స్తబ్ధతలో ఉంది. భవిష్యత్‌లో ధరలు మరింత పెరిగే అవకాశముంది. కాబట్టి ఇది సరైన సమయంగా చెప్పొచ్చు. రెంటల్ ఇన్‌కమ్ కోసం చూసే వారికి కూడా దీర్ఘకాల పెట్టుబడిగా మంచి రిటర్న్స్ పొందొచ్చు. త్వరగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్‌లో లాభం ఎక్కువగా ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి లేదా ఇంటిని కొనుగోలు చేసే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.

