Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

Telangana : స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ప్రభుత్వం కొంత ఊరట పొందింది. ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదే ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం అవనుంది. ఇప్పటికే ప్రభుత్వం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసి, మొదట జడ్పిటిసి–ఎంపిటిసి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నెలన్నరలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Andhra Pradesh : కర్ణాటక-ఆంధ్ర సాంస్కృతి పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక మాజీ జస్టిస్ వి. గోపాల గౌడ 75వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రెండు రాష్ట్రాల మధ్య భాష వేరు అయినా సంస్కృతీ బంధం బలంగా ఉందన్నారు. కోలార్, చిక్కబళ్లాపుర ప్రాంతాల నీటి సమస్య పరిష్కారానికి సహాయం చేస్తామన్నారు.
జస్టిస్ గోపాల గౌడ రైతులు, కార్మికుల హక్కుల కోసం చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. 2019లో ఓటమి తర్వాత ధైర్యం చెప్పిన జస్టిస్ గోపాల గౌడకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక భక్తులకు శ్రీశైలంలో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గోపాల గౌడ పవన్‌ను రైతుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు.
India : దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. బీహార్ షెడ్యూల్ ఇదే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 నియోజకవర్గాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత నవంబర్ 6న, రెండో విడత నవంబర్ 11న నిర్వహిస్తారు. ఫలితాలు నవంబర్ 14న వెల్లడించనున్నారు.
జూబ్లీహిల్స్ సహా మరో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
ఇదే రోజు దేశంలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఉప ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ (బుద్గాం, నగ్రోటా), తెలంగాణ (జూబ్లీహిల్స్), రాజస్థాన్ (అంటా), జార్ఖండ్ (ఘట్‌సిలా), పంజాబ్ (తార్న్ తరణ్), మిజోరం (దంపా), ఒడిశా (నుపవాడా)లో నిర్వహించనున్నారు. ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.
Nobel Prize 2025 : వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
వైద్యశాస్త్రంలో 2025 నోబెల్ బహుమతి షిమోన్ సకాగుచి, మేరీ ఇ. బ్రున్కోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్‌లకు సంయుక్తంగా లభించింది. మానవ రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ ప్రక్రియను వీరు వివరిస్తూ చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది.
ఈ టాలరెన్స్ మన రోగనిరోధక శక్తి సొంత కణాలపై దాడి చేయకుండా కాపాడుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులైన టైప్ 1 డయాబెటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లకు కొత్త చికిత్సల దారిని వీరి పరిశోధనలు చూపించాయి. నియంత్రణ టీ కణాల (Tregs) ఆవిష్కరణతో ఇమ్యూనాలజీ రంగం కొత్త దశలోకి అడుగుపెట్టింది.
Cricket : జింబాబ్వే యంగ్ ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ సెన్సేషన్
జింబాబ్వే యంగ్ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్ 2025లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. అక్టోబర్ 2న కెన్యాతో జరిగిన సెమీ ఫైనల్లో ఆరు బంతులకు ఆరు ఫోర్లు కొట్టి టీ20 క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయి సాధించాడు. అంతకుముందు సెప్టెంబర్ 30న టాంజానియాపై సెంచరీ బాదిన అతను, మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతని ప్రదర్శనలతో జింబాబ్వే 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.