Nobel Prize 2025: వైద్య విభాగంలో 2025 నోబెల్ పురస్కారాన్నిముగ్గురు పరిశోధకులైన షిమోన్ సకాగుచి, మేరీ ఇ బ్రున్కోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్ లు అందుకున్నారు. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ రహస్యాలను వెలుగులోకి తీసుకురావడంతో వీరికి నోబెల్ లభించింది.
Nobel Prize 2025: 1940లలో, అమెరికా టెన్నస్సీ రాష్ట్రంలోని ఓక్ రిడ్జ్ ప్రయోగశాలలో అణుబాంబు కోసం శాస్త్రవేత్తలు రేడియేషన్ ప్రభావాలను పరీక్షిస్తున్నప్పుడు పుట్టిన ఒక విచిత్రమైన ఎలుక జాతి స్కర్ఫీ మౌస్. చిన్నగా, పొలుసులు తొలిచిన చర్మం, వాపుతో నిండిన శరీరంతో ఉంటుంది. అది కొన్ని వారాల్లో చనిపోయేది. కానీ దానిలో దాగి ఉన్న రహస్యమే ఇప్పుడు ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని అందించింది.
Nobel Prize 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం..
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి 2025 వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా లభించింది. వారే షిమోన్ సకాగుచి, మేరీ ఇ బ్రున్కోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్. ఈ ముగ్గురూ మానవ శరీరంలోని అత్యంత శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థను (Immune System) నియంత్రించే విధానంపై చేసిన అద్భుతమైన ఆవిష్కరణలకు ఈ గౌరవం దక్కింది. వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ (Peripheral Immune Tolerance) రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఈ టాలరెన్స్ అంటే రోగనిరోధక శక్తి మన సొంత కణాలపై దాడి చేయకుండా కాపాడే అంతర్గత భద్రతా వ్యవస్థ.
మన శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి దాడులను ఎదుర్కోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో తన స్వంత కణాలపై కూడా దాడి చేస్తుంది. దీని వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు టైప్ 1 డయాబెటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి. అయితే, రోగనిరోధక వ్యవస్థ శత్రువును, స్నేహితుడిని ఎలా వేరు చేస్తుందనే ప్రాథమిక ప్రశ్నకు వీరి పరిశోధనలు సమాధానం ఇచ్చాయి. ఈ ముగ్గురూ రోగనిరోధక వ్యవస్థ సెక్యురిటీ గార్డ్స్ గా పనిచేసే నియంత్రణ టీ కణాలను (Regulatory T cells లేదా Tregs) గుర్తించారు. వీరి పరిశోధనలు రోగనిరోధక శాస్త్రంలో (Immunology) ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాక, క్యాన్సర్, స్వీయ రోగనిరోధక వ్యాధులు (Autoimmune Diseases), అవయవ మార్పిడి చికిత్సలలో (transplantation) విప్లవాత్మక చికిత్సల అభివృద్ధికి పునాది వేశాయి.
వీరి ఆవిష్కరణలు రోగనిరోధక వ్యవస్థ పనితీరు, స్వీయ రోగనిరోధక వ్యాధుల విషయాన్ని అర్థం చేసుకోవడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి: నోబెల్ కమిటీ

Tregs ను ఆవిష్కరించిన షిమోన్ సకాగుచి
1990లలో రోగనిరోధక శక్తిపై పరిశోధనలు చేస్తున్న జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచి, అప్పటి సాధారణ శాస్త్రీయ నమ్మకానికి భిన్నంగా ఆలోచించారు. రోగనిరోధక కణాలు (T కణాలు) కేవలం థైమస్‌లోనే నియంత్రించబడతాయనే (సెంట్రల్ టాలరెన్స్) భావనను ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రయోగాలు సాగాయి. నవజాత ఎలుకల నుండి థైమస్‌ను తొలగించినప్పుడు వాటికి స్వీయ రోగనిరోధక వ్యాధులు వస్తున్నాయని ఆయన గమనించారు. కొన్ని T కణాలను వేరు చేసి, థైమస్ లేని ఎలుకల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, ఆ ఎలుకలు స్వీయ రోగాల నుంచి సురక్షితంగా బయటపడ్డాయి.
ఈ పరిశోధనల ఆధారంగా 1995లో సకాగుచి Regulatory T cells (Tregs) అనే కొత్త తరగతి టీ కణాలను ప్రకటించారు. ఈ CD4, CD25 ప్రోటీన్‌లు కలిగిన Tregs, రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేసే వ్యవస్థలుగా పనిచేస్తాయని నిరూపించారు.
మిస్టరీని ఛేదించిన బ్రున్కోవ్, రామ్స్‌డెల్, స్కర్ఫీ ఎలుక
సకాగుచి Tregs ను గుర్తించినప్పటికీ, వాటిని నియంత్రించే ప్రధాన స్విచ్ ఏమిటనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. ఈ రహస్యాన్ని అమెరికాకు చెందిన మేరీ ఇ. బ్రున్కోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్ ఛేదించారు.
స్కర్ఫీ మిస్టరీ ఏంటి?
1940లలో అణుబాంబు ప్రయోగాల సమయంలో పుట్టిన "స్కర్ఫీ" (Scurfy) ఎలుకలు స్వీయ రోగనిరోధక వ్యాధులతో బాధపడుతూ చనిపోయేవి. దశాబ్దాల సవాలు తరువాత, బ్రున్కోవ్, రామ్స్‌డెల్ 2001లో ఈ లక్షణాలకు కారణమైన జన్యువును FOXP3గా గుర్తించారు. FOXP3 లోపం ఉన్నప్పుడు, Treg కణాలు సరిగా ఏర్పడలేవని, దానివల్ల మన శరీరం సొంత కణాలపై దాడి చేస్తుందని (దీన్నే IPEX సిండ్రోమ్ అంటారు) నిరూపించారు.
ముగ్గురి పరిశోధనల ఫలితం: FOXP3,Treg మాస్టర్ కంట్రోల్
సకాగుచి, బ్రున్కోవ్, రామ్స్‌డెల్‌ల పరిశోధనలు కలిపి, FOXP3 జన్యువు Treg కణాల అస్తిత్వాన్ని, విధులను నిర్వచించే కీలక నియంత్రకంగా (Transcription Factor) పనిచేస్తుందని స్పష్టమైంది. ఈ విధంగా, రోగనిరోధక వ్యవస్థను స్వీయ విధ్వంసం నుండి కాపాడే పరిధీయ రోగనిరోధక సహనం (పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్) వెనుక ఉన్న వ్యవస్థల విషయాలను ఈ ముగ్గురూ ప్రపంచానికి అందించారు.

వైద్య చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు
ఈ పరిశోధనలతో క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, అవయవ మార్పిడి వంటి రంగాలలో కొత్త చికిత్సల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసింది.
క్యాన్సర్ చికిత్స : క్యాన్సర్ కణాలు Tregs ను ఆకర్షించి తమకు రక్షణ కవచాన్ని సృష్టించుకుంటాయి. ఈ Tregs గోడను ధ్వంసం చేయడం ద్వారా రోగనిరోధక కణాల దాడిని పెంచే చికిత్సలపై పరిశోధన జరుగుతోంది.
స్వీయ రోగ చికిత్సలు: టైప్ 1 డయాబెటిస్ వంటి వ్యాధులలో, రోగి Tregs ను వేరు చేసి, శుద్ధి చేసి తిరిగి శరీరంలో ప్రవేశపెట్టే Adoptive Transfer Therapy వంటి ప్రక్రియలు చికిత్సా ఫలితాలను మెరుగుపరుస్తున్నాయి.
జన్యు మార్పిడి: CRISPR-Cas9 వంటి టెక్నాలజీని ఉపయోగించి CAR-Tregs వంటి "సూపర్ Tregs" ను తయారు చేస్తున్నారు. వీటిని మరింత శక్తివంతంగా, స్థిరంగా మార్చేందుకు RBPJ వంటి ఫ్యాక్టర్లను తొలగించే అధునాతన అధ్యయనాలు జరుగుతున్నాయి.
నోబెల్ కమిటీ పేర్కొన్నట్లుగా, ఈ ముగ్గురి ఆవిష్కరణలు మానవ రోగనిరోధక వ్యవస్థపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను పూర్తిగా మార్చేశాయి.
మేరీ ఇ. బ్రున్కోవ్ (Mary E. Brunkow) ఎవరు?
మేరీ ఇ. బ్రున్కోవ్ (Mary E. Brunkow) 1961లో జన్మించారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం సియాటిల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయోలజీ (Institute for Systems Biology)లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బ్రున్కోవ్ FOXP3 జన్యువు పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. దీనితో పాటు స్క్లెరోస్టియోసిస్ అనే అరుదైన ఎముక వ్యాధికి కారణమైన SOST జన్యువును కనుగొనడంలో కీలకంగా ఉన్నారు. ఎముక వ్యాధి సంబంధిత ఇతర అంశాలపై పరిశోధనల్లో కూడా అనుభవం కలిగి ఉన్నారు.
ఫ్రెడ్ రామ్స్‌డెల్ (Fred Ramsdell) ఎవరు?
రోగనిరోధక శాస్త్రంలో (Immunology) ముఖ్యంగా Tregs పరిశోధనలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఫ్రెడ్ రామ్స్‌డెల్. ఆయన 1960లో జన్మించారు. UCLA (కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిల్స్) నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనేక ముఖ్యమైన పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. రామ్స్‌డెల్ మేరీ, ఇ. బ్రున్కోవ్‌తో కలిసి FOXP3 జన్యువును ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. FOXP3 అనేది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే T రెగ్యులేటరీ కణాల (Tregs) అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించే జన్యువు. ప్రస్తుతం ఆయన సోనోమా బయోథెరప్యూటిక్స్ (Sonoma Biotherapeutics) సంస్థలో సైంటిఫిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ Tregs-ఆధారిత చికిత్సలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. గతంలో, ఆయన పార్కర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ (Parker Institute for Cancer Immunotherapy, శాన్ ఫ్రాన్సిస్కో)లో రీసెర్చ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
షిమోన్ సకాగుచి (Shimon Sakaguchi) ఎవరు?
షిమోన్ సకాగుచి (Shimon Sakaguchi) ప్రముఖ జపనీస్ ఇమ్యునాలజిస్ట్ (రోగనిరోధక శాస్త్రవేత్త). ఆయన 1951లో జపాన్‌లోని షిగా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. క్యోటో యూనివర్సిటీ నుండి ఎండీ (1976), పీహెచ్‌డీ (1983) పట్టాలను పొందారు. ప్రస్తుతం, ఆయన ఒసాకా యూనివర్సిటీలోని ఇమ్యునాలజీ ఫ్రాంటియర్ రీసెర్చ్ సెంటర్ (Immunology Frontier Research Center)లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సకాగుచి రోగనిరోధక శాస్త్రంలో తన విప్లవాత్మక పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన ముఖ్యంగా టీ రెగ్యులేటరీ కణాల (Tregs) ఆవిష్కరణ, వాటి విధులను గుర్తించడంతో పేరుపొందారు. ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థను నియంత్రించి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. వాటిలో విలియం బి. కోలీ అవార్డు (William B. Coley Award) (2004), క్రాఫూర్డ్ ప్రైజ్ (Crafoord Prize) (2017), రాబర్ట్ కోచ్ ప్రైజ్ (Robert Koch Prize) (2020), జపాన్ దేశ అత్యున్నత గౌరవాలలో ఒకటైన ఆర్డర్ ఆఫ్ కల్చర్ (Order of Culture) (2019) ఉన్నాయి.
మన రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే ఈ చిన్న Treg కణాలు, ఇప్పుడు వైద్యరంగంలో కొత్త యుగానికి పునాది వేస్తున్నాయి. వాటిని కనుగొనడం ఒక శాస్త్రీయ విజయమే కాదు.. మానవ ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయి. అందుకే వారిని ప్రపంచం నోబెల్ బహుమతితో గౌరవించింది.
