- Home
- National
- Oil prices: వంటింటి కష్టాలకు చెక్.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు. ఎంతో తెలుసా.?
Oil prices: వంటింటి కష్టాలకు చెక్.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు. ఎంతో తెలుసా.?
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ఏకంగా రూ. 150 వరకు చేరింది. అయితే తాజాగా పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

వంట నూనె ధరల పెరుగుదల
సెప్టెంబర్ 2024 తర్వాత వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా చమురు ధరలు ఎగబాకాయి. ఫలితంగా సామాన్య కుటుంబాల వంటగదిలో ఖర్చు పెరిగిపోయింది. నూనె కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
ముడి నూనెపై సుంకం తగ్గింపు
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 20% నుంచి 10%కి తగ్గించింది. ఈ తగ్గింపు పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ ఆయిల్, పామాయిల్‌లపై వర్తిస్తుంది. ఇవి భారతదేశంలో ఎక్కువగా వినియోగించే నూనెలు కావడం వల్ల నూనె ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
సామాన్యులపై భారం
సెప్టెంబర్‌లో తీసుకున్న దిగుమతి సుంకం పెంపు నిర్ణయం దేశీయ పరిశ్రమకు అండగా నిలిచినప్పటికీ అది వినియోగదారులపై ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు పెరగడంతో, వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంగా ధరలు అదుపు తప్పి సామాన్యులపై భారం పడింది.
సుంకాల్లో వ్యత్యాసం
ముడి నూనె అంటే శుద్ధి చేయకుండా దిగుమతి చేసిన ఆయిల్. శుద్ధి చేసిన నూనె అంటే పూర్తిగా ప్రాసెస్ చేసి, వినియోగానికి సిద్ధంగా నూనె. ఇప్పటివరకు రెండింటి మధ్య దిగుమతి సుంకం వ్యత్యాసం 8.75% మాత్రమే ఉండేది. ఇప్పుడు ముడి నూనెపై సుంకం తగ్గడంతో ఆ వ్యత్యాసం 19.25%కి పెరిగింది.
ఈ నిర్ణయంతో ఏం జరగనుంది.?
ఈ మార్పుతో భారతదేశంలో ముడి నూనెను దిగుమతి చేసుకుని ఇక్కడే శుద్ధి చేయడానికి కంపెనీలు మొగ్గు చూపుతాయి. ఇది దేశీయ ఆయిల్ రిఫైనింగ్ పరిశ్రమకు మేలు చేస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో శుద్ధి చేసిన నూనె దిగుమతి తగ్గుతుంది. ఈ మార్పులు కలిసివచ్చి వంట నూనె ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.