గోవా అంటే బీచ్‌లు, పబ్‌లే కాదు.. వెలుగులోకి 550 ఏళ్ల ప్రాచీన మఠం విశేషాలు
Partagali math: గోవా అనగానే సహజంగా బీచ్‌లు, పబ్‌లు గుర్తొస్తాయి. కానీ గోవాలో ఓ ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఇటీవల మోదీ 77 అడుగుల శ్రీరామ విగ్రహావిష్కరణతో 550 ఏళ్ల చరిత్ర ఉన్న మఠం వెలుగులోకి వచ్చింది.

77 అడుగుల శ్రీరామ విగ్రహం ఆవిష్కరణ
ప్రధాని నరేంద్ర మోదీ గోవా రాష్ట్రంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో 77 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.బప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహంగా గుర్తింపు పొందింది. మఠం ఉన్న ప్రదేశం పార్తగలి (కనకొనా తాలూకా) — ఇది శతాబ్దాలుగా ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతం.
550 ఏళ్ల మఠ సంప్రదాయ వేడుకలు
గోకర్ణ జీవోత్తమ మఠం దేశంలో అత్యంత ప్రాచీన వైదిక మఠాలలో ఒకటి. సారస్వత సమాజంలో ఈ మఠానికి ప్రత్యేక స్థానముంది. 550 ఏళ్ల మఠ సంప్రదాయోత్సవాలు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రతీరోజూ 7,000 నుంచి 10,000 మంది భక్తులు పాల్గొంటున్నారు. ఈ మఠం ప్రాంగణాన్ని 370 ఏళ్ల క్రితమే పార్తగలిలో నిర్మించారు. మఠం గోవా సంస్కృతి, సంప్రదాయాలకు దారిచూపే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
దేశంలో జరుగుతున్న ఆధ్యాత్మిక పునరుజ్జీవనం: మోదీ
విగ్రహ ఆవిష్కరణ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత్‌లో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందన్నారు. అయోధ్యలో రామాలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ అభివృద్ధి, ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్ విస్తరణ. ఇవన్నీ దేశ ఆధ్యాత్మికతను మరోస్థాయికి తీసుకెళ్తున్నాయన్నారు. ఈ పునరుజ్జీవనం భవిష్యత్ తరాలకు సంస్కృతి పట్ల అనుబంధం పెంచుతుంది. “గోవా సంస్కృతి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, తన అసలు స్వరూపాన్ని కోల్పోలేదు. కాలానికి అనుగుణంగా తిరిగి పునరుద్ధరించుకుంది,” అని మోదీ చెప్పుకొచ్చారు.
దేశ నిర్మాణంలో మఠం పాత్ర
ప్రధాని మోదీ మఠం ప్రాముఖ్యతను వివరించిన మోదీ.. గత 550 ఏళ్లలో ఎన్నో కాలమార్పుల్ని తట్టుకుని నిలిచిన సంస్థ అని అన్నారు. సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఆధ్యాత్మిక కేంద్రం, భారతాన్ని వికసిత భారత్ దిశగా తీసుకెళ్లడంలో సామాజిక ఐక్యత ముఖ్యమని, ఆ విలువలను మఠం నిలబెట్టిందని మోదీ అన్నారు. అలాగే ప్రజల కోసం తొమ్మిది సంకల్పాలను ప్రకటించారు. నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, పరిశుభ్రత, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, దేశ దర్శనం, ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకర జీవనం, యోగా, క్రీడలు, పేదవారికి సహాయం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
రామాయణ థీమ్ పార్క్
ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. రామాయణ ఆధారంగా రూపొందించిన థీమ్ పార్క్‌ను ప్రారంభించారు. ఇది భవిష్యత్ తరాలకు ధ్యానం, భక్తి, స్ఫూర్తికి శాశ్వత కేంద్రంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్, మఠ అధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామిజీ పాల్గొన్నారు.
పార్తగలి ప్రదేశం ప్రత్యేకత ఏంటి.?
ఇది సారస్వత బ్రాహ్మణ సంప్రదాయాలకు ముఖ్య కేంద్రం. గోవాలో అత్యంత ప్రశాంతంగా, ప్రకృతితో నిండిన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. 370 ఏళ్లుగా మఠం ఇక్కడే కొనసాగుతూ వేలాది మంది భక్తుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. రామాయణం, వేదాధ్యయనం, సాంప్రదాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహం, రామాయణ థీమ్ పార్క్‌తో పర్యాటకంగా కూడా ప్రధాన ఆకర్షణగా మారింది.
మఠం గురించి విశేషాలు
గోకర్ణ జీవోత్తమ మఠం గోవా రాష్ట్రం.. దక్షిణ గోవాలోని పర్తిగలి గ్రామంలో ఉంది. కుశ్వవటి నది ఒడ్డున ఉన్న చాలా ప్రశాంతమైన స్థలంలో ఇది ఉంది. ఇది గౌడ్ సారస్వత్ బ్రాహ్మణుల (GSB) ఆధ్యాత్మిక కేంద్రం. ఈ మఠం చరిత్ర 1475 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి గురువు శ్రీ నారాయణ తీర్థ స్వామిజీ. తర్వాత వచ్చిన జీవోత్తమ తీర్థ స్వామిజీ కారణంగా ఈ మఠం “జీవోత్తమ మఠం” అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు అనేక గురువులు/స్వామిజీలు ఈ మఠాన్ని నడిపారు.
ఈ మఠంలో ఏం చేస్తారు.?
* వేదాలు నేర్పడం
* పూజలు, హోమాలు, జపాలు నిర్వహించడం
* గౌడ్ సారస్వత్ సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం
* గ్రంథాలయం, విద్యా కార్యకలాపాలు
* సేవా కార్యక్రమాలు

