Indian Army: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ మాస్టర్ ప్లాన్
India China border: ఇటీవలి కాలంలో సరిహద్దులో ఉద్రిక్తల నడుమ భారత్ తన రక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే లేహ్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీకి కొత్త ప్రయాణ మార్గాలను మరింత విస్తరిస్తోంది.

భారత సరిహద్దులో 130 కి.మీ. సరికొత్త మార్గం
భారతదేశం ఉత్తర సరిహద్దులపై ఉన్న సైనిక సౌకర్యాల పెంపు దిశగా మరో కీలక అడుగు పడింది. లేహ్ నుంచి సియాచిన్ బేస్ క్యాంప్ దిశగా సాగే నుబ్రా లోయలోని ససోమా నుండి ప్రారంభమయ్యే 130 కిలోమీటర్ల మార్గం ద్వారా డీప్సాంగ్, దౌలత్ బేగ్ ఓల్డీ (DBO) ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి పూర్తిగా నవంబర్ 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
12 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రస్తుత డర్బుక్-ష్యోక్-డీబీవో (DSDBO) రహదారికి సమాంతరంగా ఉండే ఈ కొత్త మార్గం ససోమా-ససర్ లా-ససర్ బ్రాంగ్సా-గాప్‌షన్-డీబీవో మార్గంలో సాగుతుంది. కొత్త మార్గం మొత్తం 9 వంతెనలతో కూడి ఉంటుంది. ఇవన్నీ 40 టన్నుల సామర్థ్యం కలిగి ఉన్న వంతెనలు కాగా, త్వరలోనే వీటిని 70 టన్నుల సామర్థ్యం కలిగిన వంతెనలుగా మార్చేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ కొత్త మార్గం ద్వారా లేహ్ నుండి డీబీవో వరకు దూరం 322 కి.మీ నుండి 243 కి.మీకి తగ్గుతుంది. దీంతో మునుపటి రెండు రోజుల ప్రయాణ సమయం ఇప్పుడు కేవలం 11-12 గంటలకు తగ్గనుంది
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) ప్రాజెక్ట్ వివరాలు
ససోమా నుండి ససర్ బ్రాంగ్సా వరకు నిర్మాణ బాధ్యత బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) ప్రాజెక్ట్ విజయక్ చేపడుతోంది. దీని ఖర్చు రూ. 300 కోట్లు. అలాగే, ససర్ బ్రాంగ్సా నుండి డీబీవో వరకు రహదారులు, వంతెనలను నిర్మించాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ హిమాన్క్ పైన ఉంది. దీని అంచనా వ్యయం రూ. 200 కోట్లుగా ఉంది.
సరిహద్దులకు భారీ ఆయుధాల మోహరింపు సులభం కానుంది
కొత్త మార్గాన్ని పరీక్షించేందుకు బోఫోర్స్ వంటి ఆయుధాలు ససర్ బ్రాంగ్సా వరకు తరలించి రహదారి సామర్థ్యాన్ని పరీక్షించారు. రహదారిని అన్నికాలాల మార్గంగా మార్చేందుకు 17,660 అడుగుల ఎత్తులో ససర్ లా వద్ద 8 కిలోమీటర్ల సొరంగం ప్రాజెక్ట్ రూపకల్పన దశలో ఉంది. దీని పూర్తి కావడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏసియానెట్ న్యూస్ తో అధికారులు మాట్లాడుతూ.. "ససోమా నుండి ససర్ బ్రాంగ్సా వరకు, దాని తూర్పున ముర్గో, గాప్‌షాన్ వైపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి మొత్తం రహదారి అందుబాటులోకి వస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము" అని తెలిపారు. బోఫోర్స్‌తో సహా దాదాపు అన్ని ఫిరంగి ఆయుధాలను దాని బరువు మోసే సామర్థ్యాన్ని పరీక్షించడానికి ససర్ బ్రాంగ్సా వరకు ఈ మార్గంలో తరలించినట్లు వర్గాలు తెలిపాయి.
సైనిక వ్యూహాత్మక ప్రాధాన్యంతో బ్రో చర్యలు
భారత-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏర్పడింది. డీబీవో, డీప్సాంగ్ వంటి సబ్‌సెక్టర్ నార్త్ (SSN) ప్రాంతాలకు అదనపు యాక్సెస్ కోసం ఇది ముఖ్యమైన మార్గం. గల్వాన్ లోయ ప్రాంతంలో ఉన్న చైనీస్ మోహరింపు కారణంగా ప్రస్తుత DSDBO రహదారి లోని అనేక ప్రాంతాల్లో ముప్పు ఉండవచ్చు. కాబట్టి ఈ కొత్త దారులు వ్యూహాత్మకంగా ప్రధాన్యతో కూడినవని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత సైనికుల మోహరింపునకు సులువైన మార్గం
డీబీవో వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఇది 1962 భారత-చైనా యుద్ధ సమయంలో నిర్మించబడినప్పటికీ, 2008లో భారత వైమానిక దళం దీన్ని పునరుద్ధరించింది. కొత్త మార్గం, సియాచిన్ బేస్ క్యాంప్ దగ్గరుండటంతో, మూడవ దశను పూర్తి చేసిన సైనికులను నేరుగా ముందంజ బేస్‌లకు తరలించేందుకు దోహదపడుతుంది.
మొత్తంగా, ఈ కొత్త మార్గం భారత సైనికుల రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, డీబీవో మార్గంలో వ్యూహాత్మక నియంత్రణను మరింత బలోపేతం చేస్తుంది. 2026 నాటికి పూర్తిగా ఆపరేషనల్ అయ్యే ఈ మార్గం, భారతదేశం సరిహద్దుల్లో సురక్షితతను మరింత పటిష్ఠంగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.