- Home
- National
- వెంటనే అమెరికా వచ్చేయండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ ఆదేశాలు ఎందుకు ఇచ్చాయి?
వెంటనే అమెరికా వచ్చేయండి.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ ఆదేశాలు ఎందుకు ఇచ్చాయి?
H1-B visa Explained: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. దీని తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు ఉద్యోగులను వెంటనే అమెరికాకు రావాలని ఆదేశించాయి. ఎందుకు?

డోనాల్డ్ ట్రంప్ కొత్త ఆదేశాలతో టెక్ కంపెనీలు అప్రమత్తం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వీసాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో హెచ్-1బీ (H-1B visa) వీసా కలిగిన ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. హెచ్-1బీ వీసా తాజా నిబంధనల ప్రకారం అమెరికా ప్రవేశం కోసం H-1B వీసా పిటిషన్‌తో పాటు $100,000 (సుమారు రూ.88 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 21, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఇది కంపెనీలపై మరింత భారంగా మారనుంది. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వెంటనే అమెరికాకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. హెచ్1బీ వీసాతో పనిచేస్తున్న తమ ఉద్యోగుల రెన్యూవల్, ట్రాన్స్ ఫర్ టైమ్ లో పెంచిన ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుందని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్ అత్యవసర సూచనలు
రాయిటర్స్ నివేదికల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ తమ H-1B, H-4 వీసా ఉద్యోగులను రేపటిలోగా, అంటే సెప్టెంబర్ 21కు ముందే అమెరికాకు తిరిగి రావాలని సూచనలు చేసింది. కంపెనీ ప్రకటనలో, అమెరికాలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులు దేశం వదిలి వెళ్లకూడదనీ, కొంత కాలం పాటు అక్కడే ఉండాలని పేర్కొంది. H-4 వీసా కలిగిన వారిని కూడా అమెరికాలోనే ఉండాలని సూచించింది.
అమెజాన్, మెటా లు ఉద్యోగులకు ఏం చెప్పాయి?
అమెజాన్ కూడా తమ ఉద్యోగులను అమెరికాను వదిలే ప్రయాణాలు వద్దని పేర్కొంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు గడువు ముగియకముందే తిరిగి రావాలని తెలిపింది. రేపు మధ్యాహ్నం 12.00 ET (భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 21 ఉదయం 9.30) లోపు అమెరికాకు చేరుకోవాలని ఆదేశించింది.
అలాగే, మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ మెటా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ ఆదేశం “ప్రాక్టికల్ అప్లికేషన్” అర్థమయ్యే వరకు కనీసం 14 రోజులు అమెరికాలోనే ఉండాలని ఉద్యోగులకు సూచించింది. అమెరికా వెలుపల ఉన్నవారు 24 గంటల్లోగా తిరిగి రావాలని ఆదేశించింది.
జేపీ మోర్గాన్, ఇతర సంస్థల చర్యలు
జేపీ మోర్గాన్ కూడా తమ H-1B వీసా ఉద్యోగులను అమెరికాలోనే ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణం మానుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 ET గడువులోపు అమెరికాకు చేరుకోవాలని స్పష్టంగా తెలిపింది. కోగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులను వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలు వద్దని హెచ్చరించింది. ఇది ముందస్తు జాగ్రత్త చర్య అని కంపెనీ పేర్కొంది.
భారతీయులపై ఎక్కువ ప్రభావం
H-1B వీసాను కలిగిన భారతీయ ఐటీ నిపుణులు చాలా మంది ఉన్నారు. USCIS గణాంకాల ప్రకారం, అమెజాన్ 10,044 H-1B వీసాలు కలిగిన ఉద్యోగులతో టాప్ లో ఉంది. ఆ తర్వాత టీసీఎస్ (5,505), మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181) తదితర కంపెనీలు ఉన్నాయి.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా టెక్ రంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థలు కూడా ఈ ఫీజు పెంపుతో పెద్ద భారాన్ని మోయాల్సి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ట్రంప్ నిర్ణయంతో అయోమయం, గందరగోళం
ట్రంప్ సంతకం చేసిన ప్రకటనలో H-1B ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగులను తక్కువ వేతనాలకే భర్తీ చేస్తున్నారని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు వీసా మోసం, మనీ లాండరింగ్ వంటి అక్రమాలు చేస్తున్నాయని కూడా ఆరోపించారు. అందువల్ల, $100,000 ఫీజు లేకుండా వీసా పిటిషన్లు ఆమోదించకూడదని స్పష్టంచేశారు.
కాగా, ఒక్కరోజు గడువు కారణంగా ఉద్యోగులు, కంపెనీలు అయోమయం, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఫీజు పెంపు వల్ల ఇండియన్ ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా అమెరికా టెక్ కంపెనీలకూ కోట్ల రూపాయల అదనపు భారమవుతుందని SMC Global Securities నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న కంపెనీలు, స్టార్ట్‌అప్స్ మరింత ఇబ్బంది పడతాయి. ఈ భారం భరించలేక అమెరికా వెలుపలికి కంపెనీలను తరలించే అవకాశం ఉంది. ఇది అమెరికా టెక్ అధిపత్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.