H1b Visa: హెచ్1 బి వీసా అంటే ఏమిటి? దానికి 88 లక్షల రూపాయలు అమెరికాకు ఎందుకు కట్టాలి?
భారత దేశానికి చెందిన ఎంతోమంది టెక్ నిపుణులు హెచ్1 బి (H1b visa) వీసాపై అమెరికా వెళుతున్నారు. అక్కడ ఉద్యోగాలు చేసి ఆర్థికంగా స్థిరపడుతున్నారు. అయితే ఇప్పుడు హెచ్1బి వీసా ఖరీదైనదిగా మారిపోయింది. ఇదంతా ట్రంప్ అరాచకం.

ట్రంప్ చేసిన పనే
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటినుండి అమెరికాలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. నియమ నిబంధనలు మారిపోతున్నాయి. ఇప్పుడు హెచ్1 బి వీసాలో కూడా పెద్ద మార్పు జరిగింది. ఇకపై హెచ్1బి వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసే వారు ఎవరైనా కూడా 88 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా వెళ్లాలని ఆశపడుతున్న ఎంతోమంది భారతీయులకు నిరాశ ఎదురైనట్టు అయింది.
ఇండియా నుంచి ఎంత మంది?
ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లోని ఒక నివేదిక చెబుతున్న ప్రకారం 2023లో భారతీయులకు 1,91,000 వేల హెచ్1 బి బీసాలు జారీ అయ్యాయి. అదే 2024లో ఆ సంఖ్య రెండు లక్షల ఏడు వేలుకి చేరింది. ఎక్కువగా ఐటీ, సాఫ్ట్ వేర్ నిపుణులు అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ట్రంప్ కు ఇతర దేశస్థులు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి అన్నది ఆయన వాదన.
ఏటా ఎన్ని వీసాలు?
ప్రస్తుతం ఏటా అమెరికా వెళ్లేందుకు 85 వేల వీసాలు అమెరికా జారీ చేస్తోంది. ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. వీరిలో 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. ఇకపై అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
హెచ్1 బి వీసా అంటే ఏమిటి?
హెచ్1 బి వీసా అంటే ఇతర దేశస్తులు అమెరికాకు వలస వచ్చేందుకు అవసరమైన అనుమతి పత్రం. ఇది అమెరికాలో పనిచేయడానికి, ప్రయాణించడానికి ఇతర దేశస్తులకు అనుమతిస్తుంది. ఈ ఒక్కసారి హెచ్1 బి వీసా తీసుకుంటే 6 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. అమెరికాలోనే ఈ వీసాను భారత ఐటీ నిపుణులకు మంజూరు చేస్తూ ఉంటారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్1బి వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే.
ట్రంప్ మహిమ
ట్రంప్ ఎన్నికల సమయంలోనే అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారని, అలా జరగకుండా అడ్డుకుంటానని చెప్పారు. అలాగే తాను అధికారంలోకి వచ్చాక అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాల నుంచి వలసలు ఆపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు హెచ్1 బి వీసాను ఖరీదైనదిగా మార్చారు.