LPG: దేశంలో ఎక్కువ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే రాష్ట్రం ఏదో తెలుసా.?
LPG: ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరా గురించి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల వినియోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య గ్యాస్‌పై పెరిగిన ఆందోళన
ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిందని వార్తలు వచ్చాయి. ఈ సముద్ర మార్గం ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైంది. ఇరాన్ ఆ మార్గంలో ఇంధన రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై కొంత అనిశ్చితి ఏర్పడింది. దీంతో భారత్‌లో కూడా గృహ వినియోగదారులు గ్యాస్ కొరత వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది.
భారత్‌లో LPG వినియోగదారుల పరిస్థితి
భారతదేశంలో గృహ ఎల్పీజీ వినియోగం గత కొన్ని సంవత్సరాల్లో భారీగా పెరిగింది. 2021 జనవరి 1 నాటికి దేశంలో సుమారు 28.90 కోట్లు గృహ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. అదేవిధంగా సుమారు 70.75 లక్షల మంది పైప్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగిస్తున్నారు. ఇప్పటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజ్ దాదాపు 99.5 శాతం చేరింది. అంటే దాదాపు ప్రతి ఇంటికీ వంట గ్యాస్ అందుబాటులో ఉంది. అయితే గ్యాస్ వినియోగం అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండటం, నగరీకరణ అధికంగా ఉండటం వల్ల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది.
LPG ఎక్కువగా వినియోగించే టాప్-5 రాష్ట్రాలు
దేశంలో ఎల్పీజీ వినియోగంలో కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద జనాభా ఉన్న రాష్ట్రాల్లో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో LPG వినియోగంలో టాప్ రాష్ట్రాలు ఇవి:
ఉత్తరప్రదేశ్ – దేశంలోనే అత్యధిక వినియోగం
మహారాష్ట్ర – ముఖ్యంగా ముంబై, పుణే నగరాలు
దిల్లీ (ఎన్‌సీఆర్ ప్రాంతం)
తమిళనాడు – చెన్నై, కోయంబత్తూరు
కేరళ – కొచ్చి, తిరువనంతపురం
ఈ రాష్ట్రాల్లో గృహ వినియోగం మాత్రమే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు కూడా ఎక్కువగా LPG సిలిండర్లను ఉపయోగిస్తాయి. అందువల్ల మొత్తం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో భారీ గ్యాస్ వినియోగం
దేశంలో ఎల్పీజీ వినియోగంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉండటంతో గ్యాస్ వినియోగదారుల సంఖ్య కూడా భారీగా ఉంది. లక్నోలో సుమారు 15 లక్షల వినియోగదారులు, ప్రయాగ్‌రాజ్‌లో సుమారు 14 లక్షలు, ఆగ్రాలో సుమారు 12 లక్షలు, గోరఖ్‌పూర్‌లో సుమారు 12 లక్షలు, గాజియాబాద్‌లో సుమారు 12 లక్షల మంది వినియోగదారులున్నారు. ఈ ఐదు నగరాల్లోనే కలిపి సుమారు 65 లక్షల LPG వినియోగదారులు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ వినియోగంలో వీటి వాటా చాలా ఎక్కువ.
తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే.?
తెలంగాణలో గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతం సుమారు 1.3 కోట్లకు చేరుకుంది. వీటిలో ప్రతి నెలా సగటున 58 లక్షల నుంచి 60 లక్షల వరకు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరాన్ని మాత్రమే తీసుకుంటే, అక్కడ దాదాపు 19.65 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రతి నెలా సుమారు 16 లక్షల మంది వరకు సిలిండర్ బుకింగ్ చేస్తుంటారు. ఇటీవల ఏర్పడిన కొరత భయం కారణంగా గ్యాస్ బుకింగ్‌లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఉండే స్థాయితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు బుకింగ్‌లు పెరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు సిలిండర్ల కనెక్షన్ ఉన్న కుటుంబాలు ముందుగానే బుకింగ్ చేసుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో రాబోయే రోజుల్లో గ్యాస్ సరఫరా తగ్గిపోవచ్చనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. అందుకే కొరత ఏర్పడకముందే ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు.

