- Home
- National
- Karur Stampede: విజయ్ సభ తొక్కిసలాట బాధితుల మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అసలేం జరిగిందంటే?
Karur Stampede: విజయ్ సభ తొక్కిసలాట బాధితుల మెడికల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అసలేం జరిగిందంటే?
Karur Stampede: తమిళగ వెట్రికళగం(TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్ ప్రచారంలో జరిగిన తొక్కిసలాటలో ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాగా బాధితుల మెడికల్ రిపోర్టుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తొక్కిసలాట వెనుక నిజాలు వెలుగులోకి
కరూర్‌లో విజయ్ సభ అనంతరం జరిగిన తొక్కిసలాట భయానక పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనలో గాయపడిన వారిని పరిశీలించిన వైద్యుల నివేదికలు, ప్రత్యేక బృందం పరిశీలనలు కొత్త వివరాలను బయటపెట్టాయి. ఈ ఘటనలో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏంటో స్పష్టమవుతున్నాయి.
ఊపిరాడక పోవడం వల్లే
వైద్యుల విశ్లేషణ ప్రకారం, చాలా మంది కంప్రెస్సివ్ అస్ఫిక్సియా వల్ల మరణించారు. గుంపులో ఒత్తిడి ఎక్కువవడంతో ఛాతీ భాగంపై గాలి ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది. ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో మెదడుకు ఆక్సిజన్ చేరకపోవడం ప్రాణాలు పోయాయి. పిల్లల విషయంలో ఈ ప్రభావం మరింత వేగంగా పనిచేసి, కేవలం కొన్ని సెకన్లలోనే ఊపిరాడక మరణించారని డాక్టర్లు చెబుతున్నారు.
ఎముకలు విరిగిన గాయాలు
బతికి బయటపడ్డవారిని పరిశీలించగా, చాలామందిలో పక్కటెముకలు, వెన్నెముక విరిగిన గాయాలు ఉన్నట్లు ఎక్స్‌రేల్లో తేలింది. ఈ గాయాలు జరిగిన తొక్కిసలాట తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి. బాధితులు భరించలేని నొప్పిని ఎదుర్కొని ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
మృతుల సంఖ్యపై నివేదిక
ఇప్పటివరకు 41మంది మృతులు అధికారికంగా నమోదు అయ్యారు. కరూర్ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న వారిలో 39మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. మిగిలిన నలుగురిని ఇతర ఆసుపత్రుల నుంచి రిఫర్ చేసి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మరణించిన వారిలో 2ఏళ్ల బాలుడు అతి చిన్న వయస్కుడిగా గుర్తించారు.
పోస్టుమార్టంపై విమర్శలు
రాత్రివేళల్లోనే పోస్టుమార్టం ఎందుకు చేశారని రాజకీయ వర్గాలు ప్రశ్నించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, 2021 కేంద్ర మార్గదర్శకాలు ప్రకారం సాయంత్రం తర్వాత కూడా శవపరీక్షలు నిర్వహించవచ్చని తెలిపింది.
మహిళలు, పిల్లలే ఎక్కువ
మృతులలో 18మంది మహిళలు, 13మంది పురుషులు, 10మంది చిన్నారులు ఉన్నట్లు వైద్య విభాగం తెలిపింది. ప్రస్తుతం 59మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వీరిలో ఇద్దరు ఐసీయూలో ఉన్నారు.
తొలి అరెస్ట్
ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొక్కిసలాటకు సంబంధించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.