ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
IndiGo Flight Chaos Explained : పైలట్ల అలసటను తగ్గించేందుకు డీజీసీఏ తెచ్చిన కఠినమైన ఎఫ్‌డిటిఎల్ నిబంధనలు, ఇండిగో శీతాకాల షెడ్యూల్ మధ్య ఘర్షణ కారణంగా దేశవ్యాప్తంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. ఈ కొత్త రూల్స్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇండిగో దెబ్బతో భారత విమానయాన రంగంలో తీవ్ర అంతరాయం
భారత విమానయాన రంగం ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతోంది. ముఖ్యంగా ఇండిగో మిమాన సేవలు పెద్ద ఎత్తున రద్దు కావడంతో ఈ రంగంతో పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పైలట్ల పనివేళలకు సంబంధించి విధించిన కఠినమైన నిబంధనలు, శీతాకాలపు రద్దీ షెడ్యూల్ ఒక్కసారిగా ఘర్షణకు గురై దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోపై తీవ్రంగా పడింది. దీంతో ఇప్పుడు పైలట్ల అలసటను నివారించేందుకు ఉద్దేశించిన ఎఫ్‌డిటిఎల్ (FDTL) నిబంధనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
గత ఐదు రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, గౌహతి వంటి కీలకమైన విమానాశ్రయాలలో దాదాపు 400 విమానాలు రద్దయ్యాయి. చివరి నిమిషంలో అందిన సమాచారంతో ఎయిర్ పోర్టులలో అనిశ్చిత నిరీక్షణతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాలు పైలట్ల భద్రతా ప్రమాణాలు, విమానయాన సంస్థల సంసిద్ధతపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
కేవలం ఢిల్లీ విమానాశ్రయంలోనే శనివారం ఉదయానికి 54 డిపార్చర్లు, 52 అరైవల్స్ రద్దయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక హైదరాబాద్‌లో విమానాశ్రయ ఆపరేటర్ అయిన జిఎంఆర్ (GMR) తెలిపిన వివరాల ప్రకారం, 69 విమానాలు రద్దు కావడంతో సాధారణ కార్యకలాపాలకు భారీగా విఘాతం కలిగింది. గౌహతిలో కూడా ముందస్తు సమాచారం లేకుండా ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ గందరగోళం మధ్య, సాధారణ ప్రయాణికులకు పెద్దగా పరిచయం లేని ఎఫ్‌డిటిఎల్ అనే పదం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.
ఎఫ్‌డిటిఎల్ (FDTL) అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
ఎఫ్‌డిటిఎల్ (FDTL) అంటే 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్' (Flight Duty Time Limitations). ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన ఒక నిబంధనల వ్యవస్థ. పైలట్లు ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని విమానాలు నడపవచ్చు, వారికి ఎంత విశ్రాంతి ఇవ్వాలి, రాత్రిపూట ఆపరేషన్లు ఎలా ఉండాలి అనే విషయాలను ఇది నియంత్రిస్తుంది.
విమానయాన భద్రతే ఈ ఎఫ్‌డిటిఎల్ నిబంధనల ప్రధాన లక్ష్యం. పైలట్లకు కలిగే అలసట ఆపరేషనల్ రిస్క్‌లను గణనీయంగా పెంచుతుందనీ, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు, తెల్లవారుజామున బయలుదేరే విమానాల విషయంలో ఇది ప్రమాదని అంతర్జాతీయంగా గుర్తించారు.
అలసట కారణంగా జరిగిన ఘటనలను సమీక్షించిన తర్వాత, ప్రపంచవ్యాప్త నమూనాలను పోల్చి చూసిన తర్వాత, డీజీసీఏ 2024 జనవరిలో ఎఫ్‌డిటిఎల్ నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధనలు దశలవారీగా అమలులోకి వస్తున్నాయి. సరిగ్గా శీతాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, వాతావరణం అనుకూలించని సమయంలో ఈ మార్పులు అమలులోకి రావడంతో సంక్షోభం తలెత్తింది. విమానయాన సంస్థలు తమ రోస్టర్లను (డ్యూటీ చార్టులను) పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉన్నప్పటికీ, చాలా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
విమానయాన రంగంలో గతంలో నిబంధనలు ఎలా ఉండేవి?
2024 సవరణకు ముందు, ఎఫ్‌డిటిఎల్ నిబంధనలు చివరిసారిగా 2019లో మారాయి. అప్పట్లో విమానయాన సంస్థలకు ఎక్కువ వెసులుబాటు ఉండేది. పాత నిబంధనల ప్రకారం, పైలట్లకు వారాంతపు విశ్రాంతిగా కనీసం 36 గంటలు ఇవ్వాల్సి ఉండేది. అలాగే, రాత్రి సమయాన్ని ఉదయం 5 గంటల వరకు మాత్రమే పరిగణించేవారు.
ఒక డ్యూటీ సైకిల్‌లో ఆరు రాత్రి ల్యాండింగ్‌లకు అనుమతి ఉండేది. పగలు, రాత్రి విమాన ప్రయాణ సమయం పది గంటల వరకు ఉండవచ్చు, అలాగే డ్యూటీ సమయం పదమూడు గంటల వరకు పొడిగించే ఛాన్స్ ఉండేది. ఈ వెసులుబాటు వల్ల రాత్రి వేళల్లో ఎక్కువ విమానాలు నడపడానికి, తక్కువ సమయంలో ఎక్కువ సెక్టార్లలో తిరగడానికి అవకాశం ఉండేది. అయితే, ఈ పద్ధతి వల్ల పైలట్లలో విపరీతమైన అలసటకు కారణమవుతోందని పైలట్ అసోసియేషన్లు చాలా సార్లు హెచ్చరించాయి.
కొత్త డీజీసీఏ నిబంధనల్లో వచ్చిన మార్పులు ఏమిటి?
ప్రస్తుతం అమలులో ఉన్న సవరించిన ఎఫ్‌డిటిఎల్ నిబంధనలు పని, విశ్రాంతి పరిమితులను గణనీయంగా కఠినతరం చేశాయి. ముఖ్యమైన మార్పులు గమనిస్తే..
- వారాంతపు విశ్రాంతి: పైలట్లకు కనీస వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకు పెంచారు. ఒకవేళ పైలట్ ఏడు రోజుల వ్యవధిలో మూడు కంటే ఎక్కువ రాత్రి డ్యూటీలు చేస్తే, ఈ విశ్రాంతిని 60 గంటలకు పెంచాలి.
- రాత్రి అంటే: రాత్రి సమయం నిర్వచనాన్ని ఉదయం 5 గంటల వరకు కాకుండా, ఉదయం 6 గంటల వరకు పొడిగించారు.
- ల్యాండింగ్ పరిమితులు: ఇప్పుడు ఒక డ్యూటీలో పైలట్లు రెండు కంటే ఎక్కువ రాత్రి ల్యాండింగ్‌లు చేయరాదు.
- విమాన సమయం: వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే అనుమతిస్తారు. రాత్రి విమాన ప్రయాణ సమయం గరిష్ఠంగా ఎనిమిది గంటలకు, మొత్తం డ్యూటీ సమయం పది గంటలకు పరిమితం చేశారు.
ఎక్కువ పని గంటలు, తరచుగా ఉండే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్, రెడ్-ఐ ఆపరేషన్లు పైలట్ల అలసటకు ప్రధాన కారణాలని కోర్టు ఆదేశాలు, రెగ్యులేటర్ సమీక్షలు స్పష్టం చేసిన తర్వాతే ఈ మార్పులు తీసుకొచ్చారు.
విమానాల రద్దుకు అసలు కారణం ఇదే
కొత్త నిబంధనల తప్పనిసరి అమలు ఇండిగో శీతాకాలపు టైమ్‌టేబుల్‌ను ప్రభావితం చేసింది. దీనికి తోడు సాంకేతిక లోపాలు, పొగమంచు ఆలస్యం, శిక్షణ పొందిన పైలట్ల కొరత పరిస్థితిని మరింత దిగజార్చాయి. రోజుకు దాదాపు 2,300 విమానాలను నడిపే ఇండిగో, రోస్టరింగ్ సామర్థ్యంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కొత్త డ్యూటీ, విశ్రాంతి పరిమితులను ఉల్లంఘించకుండా ఉండేందుకు విమానాలను రద్దు చేయడం తప్ప వేరే మార్గం లేకపోయింది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం రెండు రోజుల్లోనే 300కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగో ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ 35 శాతానికి పడిపోయింది, ఇది ఇటీవలి చరిత్రలో అత్యల్పంగా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) ప్రకారం.. సిబ్బంది, షెడ్యూల్ మార్పులను ప్లాన్ చేసుకోవడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయం ఉంది, కానీ అవి సర్దుబాట్లను ఆలస్యం చేశాయి. తగినంత మంది సిబ్బంది లేకపోయినా, ఎయిర్‌పోర్ట్ స్లాట్‌లను నిలబెట్టుకోవడానికి సంస్థలు అత్యుత్సాహంతో కూడిన షెడ్యూల్‌లను ఫైల్ చేసి ఉండవచ్చని, అదే ఇప్పుడు ఈ ప్రభావానికి దారితీసిందని ఆరోపించింది.
ప్రయాణికులపై పడే ప్రభావం.. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో, డీజీసీఏ కొన్ని తాత్కాలిక సడలింపులను జారీ చేసింది. ఇండిగో సంస్థకు 2026 ఫిబ్రవరి 10 వరకు ఒక సారి మినహాయింపు (one-time exemption) లభించింది. దీనివల్ల కొత్త పరిమితి కంటే ఎక్కువ రాత్రి డ్యూటీలు, ల్యాండింగ్‌లకు అనుమతి లభిస్తుంది. అయితే, ఈ మినహాయింపులు సురక్షితం కాదని పైలట్ సంఘాలు విమర్శిస్తున్నాయి.
విమానయాన నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పులు ప్రస్తుతం బాధాకరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా ఇవి ప్రయోజనకరమే. ఎందుకంటే విమాన ప్రమాదాలకు గల ప్రధాన కారణాలలో అలసట ఒకటి.
భవిష్యత్తులో ప్రయాణికులు తక్కువ లేట్-నైట్ విమానాలను చూడవచ్చు. నెట్‌వర్క్‌లను సరిచేసుకునే క్రమంలో టికెట్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. పైలట్లకు ఈ నిబంధనలు సురక్షితమైన పని పరిస్థితులను కల్పిస్తాయి. ఈ సంక్షోభం భారత విమానయాన రంగానికి ఒక మలుపు వంటిది. ఇది కేవలం తాత్కాలిక అవాంతరమా లేక లోతైన నిర్మాణ లోపమా అనేది భద్రత కోసం ఎయిర్‌లైన్స్ ఎంత వేగంగా మారుతాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.

