- Home
- National
- Defence: భారత అమ్ములపొదిలో ఏఐ మెషిన్ గన్స్.. శత్రుదేశాలకు దడపుట్టిస్తున్న వీటి ప్రత్యేకత ఏంటి?
Defence: భారత అమ్ములపొదిలో ఏఐ మెషిన్ గన్స్.. శత్రుదేశాలకు దడపుట్టిస్తున్న వీటి ప్రత్యేకత ఏంటి?
AI powered gun: భారత సైన్యం 14,500 అడుగుల ఎత్తులో ఏఐ ఆధారిత మిషన్ గన్స్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రువులు, వారి టార్గెట్ లను స్వయంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది.

భారత సైన్యం తొలి ఏఐ ఆధారిత మిషిన్ గన్ ను విజయవంతంగా పరీక్షించింది
భారత అమ్ములపొదిలో మరో పవర్ ఫుల్ ఆయుధం వచ్చి చేరింది. భారత ఆర్మీలో చేరిన ఏఐ మెషిన్ గన్స్.. శత్రుదేశాలకు దడపుట్టిస్తోంది. 2025 జూన్ నెలలో భారత సైన్యం బెంగళూరు కేంద్రంగా ఉన్న రక్షణ సంస్థ బీఎస్ఎస్ తో కలిసి, దేశంలో తొలి ఏఐ ఆధారిత మిషిన్ గన్ ప్రామాణిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆయుధం 7.62×51 mm బ్యారెల్ కలిగిన నెగెవ్ లైట్ మెషిన్ గన్ (LMG)గా రూపుదిద్దుకుంది.
ఎత్తైన ప్రదేశాల్లో పరీక్షలు.. 600 మీటర్ల టార్గెట్
ఈ పరీక్షలు సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో నిర్వహించారు. ఈ వ్యవస్థ స్వయంగా లక్ష్యాలను గుర్తించి, శత్రువులు, మిత్రులను వేరు చేసి, లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
ఇది 600 మీటర్ల దూరంలో స్థిరమైన టార్గెట్ యాక్విజిషన్ సాధించగలదు. ఈ ఏఐ మిషిన్ గన్ గరిష్ఠ ప్రభావవంతమైన పరిధి 1,000 మీటర్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మల్టీ సెన్సార్ మాడ్యూల్ తో ఏఐ మిషిన్ గన్
ఈ ఏఐ మిషిన్ గన్ థర్మల్, ఆప్టికల్ సెన్సార్లను సమ్మిళితం చేసిన మల్టీ-సెన్సార్ మాడ్యూల్ కలిగి ఉంది. దీనివల్ల పర్వత ప్రాంతాల్లోని తక్కువగా కనిపించే పరిస్థితులలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. టార్గెన్ ఖచ్చితత్వంతో గురిపెడుతుంది.
ఏఐ మిషిన్ గన్: 21 రోజులు కమాండ్ ఇవ్వకపోయినా పనిచేస్తుంది
ఈ ఏఐ మిషిన్ గన్ పర్యావరణ పరిస్థితులను (గాలి, ఉష్ణోగ్రత, దూరం) పరిగణనలోకి తీసుకుని ఖచ్చితమైన బాలిస్టిక్ కంపెన్సేషన్ కలిగి ఉంది. బంకర్‌లో 21 రోజులపాటు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, ఈ ఆయుధాన్ని సైనికులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన అవసరం లేకుండా రహస్య కమాండ్ లింక్ ద్వారా నియంత్రించవచ్చు.
ఈ వ్యవస్థను బంకర్లతో పాటు ఆర్మర్డ్ వాహనాలు, నౌకలు, అన్‌మ్యాన్‌డ్ గ్రౌండ్ వాహనాలు, స్థిరమైన ప్లాట్‌ఫామ్స్‌లోకి కూడా సమర్ధంగా అనుసంధానం చేయవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పెరుగుతున్న ఏఐ తుపాకుల అవసరం
2020లో భారత్ ఇజ్రాయెల్ నుండి 16,479 నెగెవ్ తుపాకులను (ఏఐ మిషన్ గన్స్) ఆర్డర్ చేసింది. ప్రస్తుతం 40,000 యూనిట్లకు పైగా అవసరం ఉంది. ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశీయ ఆయుధాలు తమ సమర్థతను నిరూపించాయి.
ఆత్మనిర్భర్ భారత్ కు తోడ్పాటు.. రూ.100 కోట్ల AI పరిశోధన బడ్జెట్
ఈ ప్రయోగం 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం రూ.100 కోట్ల మేర ఏఐ పరిశోధనకు కేటాయిస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి, రూ.35,000 కోట్ల ఎగుమతులు టార్గెట్ గా పెట్టుకుంది.
భారత రక్షణ అభివృద్ధిలో మైలురాయి
ఈ ఏఐ ఆధారిత నెగెవ్ తుపాకీ ప్రయోగం భారత రక్షణ దళాల ఆధునీకరణలో ఓ కీలక ముందడుగు. ఇది సరిహద్దుల్లో, ప్రమాదభరిత ప్రాంతాల్లో బేస్ రక్షణ, కాన్వాయ్ భద్రత, పెరిటర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంచుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.