Hyderabad Rain : హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా? అసలు ఏమిటిది? ఎలా జరుగుతుంది?
Hyderabad Cloudburst : అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఉత్తరాఖండ్ లో మాదిరిగానే హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ జరిగిందా?

హైదరాబాద్ క్లౌడ్ బరస్ట్?
Hyderabad Rains : సోమవారం (ఆగస్ట్ 4) కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. కేవలం రెండుమూడు గంటల్లోనే కొన్నిప్రాంతాల్లో 150 మిల్లిమీటర్లు (15 సెం.మీ) వర్షం కురిసింది... అంటే క్లౌడ్ బరస్ట్ జరిగిందన్నమాట. అయితే ఎక్కువ ప్రాంతంలో వర్షం కురవడంతో ప్రమాదం తప్పింది.
ఈ కుంభవృష్టితో నగరంలో రోడ్లన్ని చెరువులను తలపించాయి... ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. కానీ పెనుప్రమాదాలు మాత్రం చోటుచేసుకోలేదు. కానీ ఇలా అతి తక్కువ సమయంలో కురిసే అత్యంత భారీ వర్షాలు ఎంత ప్రమాదకరమో తాజాగా ఉత్తరాఖండ్ లో బైటపడింది.
KNOW
ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లా ధరాలి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 1:45 గంటల సమయంలో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) సంభవించింది. కొండప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురవడంతో వరదనీరు మట్టిని కరిగించుకుంటూ కిందకు దూకింది. ఇలా వరదనీరు ఒక్కసారిగా గ్రామాన్ని ముంచేసింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా అదృశ్యమయ్యారు. ఈ ఘటనతో క్లౌడ్ బరస్ట్ ఎంత ప్రమాదకరమో అర్థమయ్యింది.
ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
మేఘ విస్పోటనం (క్లౌడ్ బరస్ట్) కేవలం భారీ వర్షం కాదు... ఒక్కసారిగా చాలా తక్కువ సమయంలో పరిమిత ప్రాంతంలో లక్షల లీటర్ల నీరు వర్షంగా కురుస్తుంది. భారత వాతావరణ శాఖ (IMD) నిర్వచనం ప్రకారం... 20-30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 20 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం సంభవిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇది సాధారణంగా కొండప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది.
ఎందుకు క్లౌడ్ బరస్ట్ ప్రమాదకరం?
క్లౌడ్ బరస్ట్ వల్ల తక్కువ సమయంలోనే అత్యంత భారీ వర్షం కురిసి నీటిప్రవాహం జనవాసాలను ముంచెత్తుతుంది. ఇది కొండప్రాంతాల్లో కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. తడిసిన మట్టి సడలిపోవడంతో కొండచరియలు విరిగిపడతాయి. చిన్న ప్రవాహాల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు చేరుతుంది...దీంతో ప్రవాహం హటాత్తుగా పెరిగి తీరంలోని రహదారులు, వంతెనలు, ఇళ్లపైకి దూసుకువస్తుంది. తాజాగా ఉత్తరాఖండ్ లో ఇదే జరిగి తీవ్ర ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టానికి కారణమయ్యింది.
క్లౌడ్ బరస్ట్ హిమాలయాల్లో ఎందుకు ఎక్కువగా జరుగుతుంది?
మాన్సూన్ కాలంలో వేడి, తేమగల గాలి పైకి లేచి చల్లబడి మేఘాలుగా మారుతుంది. హిమాలయాల వంటి ఎత్తైన కొండలు గాలిని మరింత ఎత్తుకు నెట్టివేస్తాయి. దీంతో మేఘాలు త్వరగా ఏర్పడి, బరువుగా మారతాయి. మేఘాల్లోని నీటి బిందువులు భారంగా మారి, గాలితరంగాలు (updraft) వాటిని మోయలేకపోయినప్పుడు, ఒక్కసారిగా భూమిపై పడతాయి. ఇది క్లౌడ్ బరస్ట్ కు దారితీస్తుంది.
క్లౌడ్ బరస్ట్ ను ముందుగా గుర్తించలేం
క్లౌడ్ బరస్ట్ ను ముందుగానే గుర్తించడం కష్టం. తుఫానుల మాదిరిగా దీనికి రోజుల ముందే హెచ్చరిక ఇవ్వడం సాధ్యం కాదు. ఉపగ్రహాలు, డాప్లర్ రాడార్లు కొన్ని సందర్భాల్లో కాస్త ముందే గుర్తించగలిగినా, సమయానికి హెచ్చరిక ఇవ్వడం సాధ్యం కాని సందర్భాలే ఎక్కువ.
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు కావడంతో, మాన్సూన్ గాలులు వాటిని దాటి వెళ్లలేవు. అందువల్ల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు క్లౌడ్ బరస్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.