- Home
- Telangana
- Rains Alert : మీ ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రమాదకర పరిస్థితులుంటే... ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి
Rains Alert : మీ ప్రాంతంలో భారీ వర్షాలతో ప్రమాదకర పరిస్థితులుంటే... ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదశ్ రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రజల సహాయార్థం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Telangana and Andhra Pradesh Weather Update : రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు మరింత జోరందుకుంటాయని... జులై నెలంతా అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్నిప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అంటే సడన్ గా కుండపోత వానలు కురిసే అవకాశాలున్నాయిని హెచ్చరించింది.
వరద పరిస్థితులు
ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి... జలాశయాలు నిండటంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. చెరువులకు గండ్లు పడి వరదనీరు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రోడ్లు, వంతెనలపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరికొన్నిరోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త
మరో నాలుగైదురోజులు ఇదే పరిస్థితి ఉంటే వరదల తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. విపత్తు నిర్వహణ సంస్థలతో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎస్ సిబ్బందిని సిద్దం చేశారు... హైదరాబాద్ లో అయితే జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు ఏదయినా ఇబ్బందుల్లో ఉంటే సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించాయి ఇరు ప్రభుత్వాలు.
ఏపీ ప్రజల సహాయం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లు
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులతో మట్లాడిన ఆయన ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే సహాయం కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను ఫోన్ చేసి సహాయం పొందవచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితి పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ... సహాయ చర్యల కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించింది.#ChandrababuNaidu#AndhraPradesh… pic.twitter.com/mB6gRNUSS1
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 25, 2025
తెలంగాణ ప్రజల సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు
ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. ఈ వర్షం కొనసాగే అవకాశాలన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల కోసం జిహెచ్ఎంసి 040-21111111 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసింది. ఇక హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 90001 13667 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
అత్యవసర సమయంలో పోలీసులు 100, ఫైర్ ఆండ్ రెస్క్యూ 101, అంబులెన్స్ 108 లేదా 102, స్టేట్ కంట్రోల్ రూం 1070 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు. విద్యుత్ సమస్యలుంటే TSNPDCL కస్టమర్ కేర్ నంబర్లు 1800 425 0028, 1912 కు ఫిర్యాదు చేయవచ్చు.
నేడు తెలంగాణలో వర్షాలు
శనివారం తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడె, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్ శుక్రవారమంతా చిరుజల్లులు కురుస్తానే ఉన్నాయి... శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
ఇవాళ(శనివారం) ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.