National News: నన్ను వదిలేస్తావా, చంపేయాలా.? ఈ భార్యలేంట్రా బాబూ ఇలా తయారయ్యారు.
సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల భర్తలను చంపుతోన్న భార్యల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతోన్న సంఘటనలు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇలాంటి ఓ సంఘటన జరిగింది.

కష్టపడి చదివించిన భర్తనే వద్దంటోంది
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను చదివించి ఉద్యోగానికి తగిన స్థాయికి చేర్చాడు. కానీ భార్య ఇప్పుడు అతనితో కలిసి జీవించడానికి నిరాకరిస్తోంది. తీరా కారణం ఏమిటంటే భర్త అందంగా లేడని చెప్పడం అతన్ని తీవ్రంగా కలిచి వేసింది.
ఒర్చా రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఛత్తర్పూర్‌లోని భగవంతపురా గ్రామానికి చెందిన వినోద్ అహిర్వార్ 2023 జూన్‌లో గోమతి అహిర్వార్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో గోమతి కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివింది. పెళ్లి తరువాత వినోద్ ఆమెను ఉన్నత విద్యను చదివించి, ఉద్యోగం వచ్చేలా చేశాడు. అయితే గోమతి ఇప్పుడు అతనితో ఉండేందుకు నిరాకరించి, “నువ్వు నా స్థాయికి సరిపోడు, అందంగా లేవు” అని చెబుతోందని భర్త వాపోయాడు.
“నిన్ను చంపేస్తాను” అంటూ భార్య బెదిరింపులు
వినోద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం. తన భార్య విడాకులు మాత్రమే కాకుండా, తనను వదిలేయకపోతే చంపేస్తానని బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తాను మానసిక ఒత్తిడితో ఉన్నానని పోలీసులకు తన గోడును తెలిపాడు.
భార్య నుంచి కాపాడాలని కోరుతూ
వినోద్ అహిర్వార్ పోలీస్ సూపరింటెండెంట్‌కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశాడు. భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
పురుషులపై హింస పెరుగుతోందా.?
ఇటీవల జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే సమాజంలో పురుషుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రియుడి మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్న సంఘటనలు భయం కలిగించే ఉన్నాయి. మొత్తం మీద ఈ సంఘటనలు సమాజంలో దిగజారుతోన్న విలువలకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.