Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో అసలైన వర్షాకాలం షురూ... ఈ రోజుల్లో ఇక కుండపోతే..!
తెలుగు రాష్ట్రాల్లో అసలైన వర్షాకాలం మొదలవుతోంది. రుతుపవనాలు ముందుగానే వచ్చినా వర్షాలు మాత్రం వెనకబడ్డాయి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రజలు అసలైన వర్షాకాలాన్ని చూడనున్నారని వాతావరణ శాఖ ప్రకటనను బట్టి తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇక భారీ వర్షాలు
Weather Updates : వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెబుతోంది. భారీ, అతిభారీ వర్షాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని... ఇకపై జోరువానలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు అల్పపీడనాలు, వాయుగుండాలు, ద్రోణి ప్రభావాలతో జులై సెకండాఫ్ లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగురాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... కానీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మాత్రం వర్షాల జాడే లేదు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాలకు కూడా వర్షసూచనలు వెలువడ్డాయి. ఇప్పటికే మోస్తరు వర్షాలు మొదలవగా ఇవి భారీ వర్షాలుగా మారతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం తెలంగాణలో వర్షాలు
ఇవాళ(జులై 16, బుధవారం) తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, గద్వాల, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది?
గత రెండుమూడు రోజులుగా ఎక్కువైన వేడి, ఉక్కపోత నుండి తెలుగు ప్రజలకు ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ తో పాటు శివారులోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుందని... చిరుజల్లులతో చల్లగా మారి ఆహ్లాదకరంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బుధవారం ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(బుధవారం) మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూల్, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
ఈ రాత్రి నుండి భారీ వర్షాలే
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాత్రినుండి ఈ వర్షాలు మరిన్ని జిల్లాలకు వ్యాపిస్తాయని... జులై 17న భారీ నుండి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, యానాం ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో కుండపోతే
ఇక తెలంగాణలో కూడా రేపట్నుంచి (జులై 17, గురువారం) నుండి భారీ వర్షాలు మొదలవుతాయట. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా జోరువానలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలుంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.