Heavy rains: భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
Heavy rains: దేశవ్యాప్తంగా ఈ వారం విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. జూలై 5 వరకు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

వివిధ రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
దేశంలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సాధారణంగా జూలై 8 నాటికి మొత్తం దేశం మీద మోన్సూన్ విస్తరించాల్సి ఉంటే, ఈసారి తొమ్మిది రోజులు ముందుగానే అంటే జూన్ 29 నాటికి విస్తరించింది.
ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో జూలై 5 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తూర్పు, మధ్య భారతంలో భారీ వర్షాలు
జార్ఖండ్, ఒడిశాలలో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జూలై 5 వరకు వర్షాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు సైతం వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జూలై 5 వరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లలో కూడా కొన్ని రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 29 నుంచి జూలై 3 మధ్య ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది.
అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కుండపోత వర్షాలు
కొంకణ్ & గోవా, ఘాట్ ప్రాంతాలు (మధ్య మహారాష్ట్ర), గుజరాత్‌లో వచ్చే 7 రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరాఠ్వాడాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో జూలై 2 నుంచి 5 మధ్య వడగండ్ల వర్షాలు, ఉరుము మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
కేరళలో భారీ వర్షాలు
కేరళ & మాహేలో జులై 4 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్ణాటకలో జూలై 2-5 మధ్య వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతమంతా వచ్చే వారం రోజుల పాటు 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. తీరప్రాంతాలు, అంతర్గత ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం
వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలు నీటిమునిగాయి. మండీ జిల్లాలో పండోహ్ వద్ద అత్యధికంగా 130 మిమీ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ సాధారణ జీవనానికి అంతరాయం ఏర్పడింది. మంచలీ, బంజార్ ఉపవిభాగాల్లో విద్యా సంస్థలు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.
యమునోత్రీ జాతీయ రహదారిపై కొండచరియలు
యమునోత్రీ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. బర్కోట్ సమీపంలో మేఘవిస్పోటంతో ఇద్దరు మరణించగా, ఏడుగురు గల్లంతయ్యారు. విద్యుత్, నీటి సరఫరా లేకుండా పోయింది. చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసి మళ్లీ ప్రారంభించారు.
జమ్మూ & కాశ్మీర్‌లో చినాబ్ నది ఉధృతి
చినాబ్ నదిలో వరద ప్రవాహం కారణంగా సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు. లొతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే, నది పక్కకు వెళ్లవద్దని డీఐజీ శ్రిధర్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపిన ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానా వంటి ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయి. గోదావరి, మహానది, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరగవచ్చు, ఆయా డ్యామ్‌లు, జలాశయాల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం సాయంత్రం ఒక తీవ్ర వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 24 నుండి 48 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు హెచ్చరికను అన్ని జిల్లాలకూ జారీ చేసింది.