యువతకు గుడ్ న్యూస్: ఫ్రీగా AI సర్టిఫికేట్ స్కాలర్‌షిప్‌లు
Artificial Intelligence: యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు అందించేందుకు ఉమెన్ ఇన్ క్లౌడ్ (Women in Cloud) సంస్థ ₹5.76 కోట్ల విలువైన 1,000 ఏఐ ఇన్నోవేటర్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. పూర్తి వివరాలు మీకోసం.

ప్రపంచవ్యాప్తంగా యువతకు కొత్త అవకాశాలు
యువతకు గుడ్ న్యూస్. కోట్ల రూపాయల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉచితంగా అందించేందుకు అంతర్జాతీయ టెక్ నెట్‌వర్క్ అయిన ఉమెన్ ఇన్ క్లౌడ్ (WiC) సంస్థ ముందుకొచ్చింది. ₹5.76 కోట్ల విలువైన 1000 ఏఐ ఇన్నోవేటర్ (AI Innovator) సర్టిఫికేట్ స్కాలర్‌షిప్‌లను ప్రారంభించింది.
ప్రతి స్కాలర్‌షిప్ విలువ సుమారు USD 6,500 (₹5.76 లక్షలు) కాగా, మొత్తం 1,000 స్కాలర్‌షిప్‌లతో ఈ ప్రోగ్రాం విలువ ₹5.76 కోట్లకు చేరింది. 16 సంవత్సరాల పైబడిన యువత, మహిళలు, పురుషులు ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా సర్టిఫికేట్ స్కాలర్‌షిప్‌లకు అర్హులని విక్ పేర్కొంది. WiC సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల టెక్ ప్రొఫెషనల్స్, వ్యవస్థాపకులు, నిర్వాహకులు ఉన్నారు.
చైత్ర వేదులపల్లి ఏమన్నారంటే?
న్యూస్ కనెక్ట్ ఇండియా (News Connect India) ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో ఉమెన్ ఇన్ క్లౌడ్ సహ వ్యవస్థాపకురాలు, అధ్యక్షులు చైత్ర వేదులపల్లి ఈ ఏఐ సర్టిఫికేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంను ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ.. “ఈ స్కాలర్‌షిప్ యువతకు భవిష్యత్ దిశగా అవసరమైన ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక స్థిరత్వం, గ్లోబల్ అవకాశాలు, ఏఐ రంగంలో నాయకులుగా ఎదగడానికి ఈ కార్యక్రమం మార్గం చూపుతుంది” అని తెలిపారు.
భారతీయ యువతకు మంచి ఛాన్స్
న్యూస్ కనెక్ట్ ఇండియా వ్యవస్థాపకుడు, మీడియా నిపుణుడు బీఎన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. “ఇది భారత యువతకు దేవుడిచ్చిన అవకాశం లాంటిది. ప్రస్తుతం భారత్‌లో సగం మంది గ్రాడ్యుయేట్లు ఉపాధి లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వారు అవసరమైన ఏఐ నైపుణ్యాలు నేర్చుకుని ఉద్యోగాలు పొందడమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు చేసి వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది” అని అన్నారు.
ఉమెన్ ఇన్ క్లౌడ్ ఫ్రీ ఏఐ సర్టిఫికేషన్ స్కాలర్‌షిప్ వివరాలు ఇవే
ప్రతి స్కాలర్‌షిప్‌లో కింద పేర్కొన్న అంశాలు ఉంటాయి..
• ఒక సంవత్సరపు ఏఐ సర్టిఫికేషన్ కోర్సు
• మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ వోచర్
• మైక్రోసాఫ్ట్ టాప్ మెంటర్లతో శిక్షణ
• ICONS లీడర్‌షిప్ అసెస్‌మెంట్, మాస్టర్‌క్లాస్ యాక్సెస్
• ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహాలు
• 120 దేశాల 1.5 లక్షల మంది ప్రొఫెషనల్స్‌తో నెట్‌వర్కింగ్ అవకాశాలు
ఉమెన్ ఇన్ క్లౌడ్ ప్రీ ఏఐ సర్టిఫికేషన్ స్కాలర్‌షిప్ కు అప్లై చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు “Why I deserve the AI Innovative Certification Programme” అనే అంశంపై స్వయంగా రాసిన ఒక చిన్న వ్యాసాన్ని సమర్పించాలి. తర్వాత తమ అప్లికేషన్‌ను ఈ లింక్ ద్వారా సమర్పించవచ్చు - AI Innovative Certification Programme
ఉమెన్ ఇన్ క్లౌడ్ గ్లోబల్ ఇంపాక్ట్
ఉమెన్ ఇన్ క్లౌడ్ సంస్థ కేవలం స్కాలర్‌షిప్‌లతోనే కాకుండా, క్లౌడ్ వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, సివిక్ ఎంగేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్, ఏఐ ఇన్నోవేషన్, గ్లోబల్ పార్టనర్‌షిప్స్ వంటి విభాగాల్లో కూడా పనిచేస్తోంది. ఈ సంస్థ అన్ని కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు (UN Sustainable Development Goals-SDGs) అనుగుణంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగావకాశాలు, వైవిధ్యం, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ పై దృష్టి పెట్టింది. ఈ సంస్థకు ఫిస్కల్ స్పాన్సర్‌గా SDG Digital Foundation (501c3) ఉంది.