ర్యాపిడో డ్రైవర్ అకౌంట్‌లోకి రూ. 331 కోట్లు.. అసలేం జరిగిందంటే.?
ED Case: ఒకరి ఖాతాల్లోకి పంపించాల్సిన డబ్బును మరో ఖాతాల్లోకి పంపిస్తుండడం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతాలోకి ఏకంగా రూ. 331 కోట్ల జమకావడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బైక్ టాక్సీ డ్రైవర్ అకౌంట్‌లో కోట్ల రూపాయల డిపాజిట్
అవినీతి డబ్బు తరలింపుపై విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఓ సంఘటనతో షాక్ అయ్యారు. ఒక బైక్-టాక్సీ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్‌లో ఎనిమిది నెలల్లో రూ. 331.36 కోట్లు జమ అయినట్టు బయటపడింది. ఈ డ్రైవర్ ర్యాపిడోలో పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతని పేరుతో ఉన్న ఖాతాలో కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతుండడంతో EDకి అనుమానం కలిగింది.
‘మ్యూల్ అకౌంట్’గా అనుమానించిన ఈడీ..
ED అధికారులు ఇది స్పష్టంగా ‘మ్యూల్ అకౌంట్’ కేసు అని గుర్తించారు. ఇతరుల అక్రమ డబ్బును చట్టవిరుద్ధంగా తరలించేందుకు వాడే ఖాతానే మ్యూల్ అకౌంట్‌గా చెబుతుంటారు. ఖాతా ఎవరి పేరు మీద ఉందో వారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ ఖాతాలోకి అనేక తెలియని వనరుల నుంచి డిపాజిట్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ మొత్తం వెంటనే ఇతర అనుమానాస్పద ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. వీటిలో ఒక ప్రధాన వనరు అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ (1xBet) ఉంది.
రెండు గదుల ఇంటి నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు
డ్రైవర్ బ్యాంక్ రికార్డులో ఉన్న చిరునామాను ED అధికారులు సందర్శించారు. ఈ సమయంలో వారికి కనిపించింది కేవలం రెండు గదులున్న ఒక చిన్న ఇల్లు. రోజూవారి సంపాదన జీవనం సాగించే వ్యక్తి ఖాతాలో ఇంత మొత్తంలో అమౌంట్ డిపాజిట్ కావడంతో ఈడీ అధికారులకు అనుమానం పెరిగింది. అయితే తన ఖాతాలో నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్‌పై ర్యాపిడో డ్రైవర్ మాట్లాడుతూ.. “ఈ లావాదేవీల గురించి నాకు ఏమీ తెలియదు. డబ్బు పంపిన వాళ్లు ఎవరో, వెడ్డింగ్ ఎవరిదో కూడా తెలియదు.” అని చెప్పుకొచ్చాడు.
వివాహానికి కోటి రూపాయలు ట్రాన్స్‌ఫర్
ఈ అకౌంట్‌లోని డబ్బులో కోటి రూపాయలకు పైగా రాజస్థాన్‌లోని ఉడయ్‌పూర్‌లో జరిగిన ఓ లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్ ఖర్చుల కోసం ఉపయోగించినట్లు విచారణలో తేలింది. ఈ వివాహం ఒక గుజరాత్ యువ రాజకీయ నేత కుటుంబంతో సంబంధం ఉన్న కుటుంబానికి చెందినది కావడం గమనార్హం. దీంతో ఈడీ త్వరలోనే ఈ నేతను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

