Defense: K-6 హైపర్సోనిక్ క్షిపణి.. ఇండియన్ నేవీ దెబ్బకు చైనాకు చుక్కలే
K6 hypersonic missile: భారత్ అభివృద్ధి చేస్తున్న K-6 హైపర్సోనిక్ క్షిపణి 8,000 కిలో మీటర్ల పరిధితో నావికాదళానికి కీలకంగా మారనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భూభౌగోళిక ఉద్రిక్తతల మధ్య భారత్ కు మరింత శక్తిని ఇవ్వగలదు.

ఇండియన్ నేవీలో చేరనున్న K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి
K6 hypersonic missile: భారత దేశం అభివృద్ధి చేస్తోన్న K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి దేశపు నావికాదళ సామర్థ్యాల్లో విప్లవాత్మక మార్పుని తీసుకొస్తుంది. ఈ అత్యాధునిక SLBM (Submarine-Launched Ballistic Missile) వ్యవస్థ భారత సముద్ర ఆధారిత అణు వ్యూహానికి ప్రధాన స్థంభంగా నిలవనుంది. పలు రిపోర్టుల ప్రకారం.. ఈ క్షిపణి అభివృద్ధిని డీఆర్‌డీఓ (DRDO) అడ్వాన్స్‌డ్ నావల్ సిస్టమ్స్ లాబొరేటరీ (ASL), హైదరాబాద్‌లో చేపట్టింది.
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి నేపథ్యం
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి 2017 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇది దాదాపు పదేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పురోగమిస్తోంది. భారత క్షిపణుల శ్రేణిలో భాగమైన K-సిరీస్‌లో ఇది అత్యాధునిక మోడల్.
ఈ శ్రేణి భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరుతో గుర్తింపు పొందింది. ఈ క్షిపణి వ్యూహం ముఖ్యంగా చైనా ఇండో-పసిఫిక్ ప్రభావాన్ని ఎదుర్కొనడాన్ని దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంది.
చైనా ప్రస్తుతం JL-3 SLBMలతో అమర్చిన Type 094, భవిష్యత్ Type 096 అణు సబ్‌మెరిన్‌లను సముద్రంలో మోహరిస్తుండటంతో, భారత సరిహద్దుల్లో కొత్త రకం ముప్పు ఏర్పడుతోంది. K-6 దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సాధనంగా మారనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి వేగం, పరిధి ఎంత?
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి మ్యాక్ 7.5 (సుమారుగా గంటకు 9,261 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణించగలదు. ప్రత్యర్థులు స్పందిచే లోపు దాడి చేస్తుంది. అలాగే దీని 8,000 కిలో మీటర్ల పరిధి, భారత సబ్‌మెరిన్లకు ఇండియన్ ఓషన్‌లో సురక్షిత ప్రాంతాల నుంచే లక్ష్యాలను టార్గెట్ చేసే అవకాశం కల్పిస్తుంది.
నిర్మాణం, పేలోడ్ విషయానికి వస్తే.. మూడు దశల ఘన ఇంధన SLBM 12 మీటర్లకు పైగా పొడవు, 2 మీటర్లకు పైగా వెడల్పుతో రూపొందించారు. దీని పేలోడ్ సామర్థ్యం 2-3 టన్నులుగా ఉంటుంది. ఇది K-సిరీస్‌లో ఇప్పటివరకు ఉన్న క్షిపణుల కంటే చాలా పెద్దది.
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిలో MIRV సాంకేతికత
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిలో MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) సాంకేతికత ఉంటుంది. దీంతో ఒక్క క్షిపణి ద్వారా అనేక లక్ష్యాలపై విభిన్న వార్‌హెడ్‌లను దాడికి పంపించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది టార్గెట్ లను అందుకోవడంలో సమర్థవంతంగా ఉంటుంది. దీంతో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే వంటి అణు శక్తుల సరసన భారత్ చేరుతుంది.
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి: S-5 తరగతి సబ్‌మెరిన్‌లతో అనుసంధానం
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని రాబోయే S-5 తరగతి అణు సబ్‌మెరిన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇవి సుమారు 13,000 టన్నుల డిస్‌ప్లేస్‌మెంట్‌తో ఉంటాయి, ఇది ప్రస్తుతం నౌకాదళంలో ఉన్న అరిహంత్ తరగతి కంటే రెట్టింపుగా ఉండనుంది.
ఈ సబ్‌మెరిన్లు 12 నుండి 16 K-6 క్షిపణులను మోహరించగల సామర్థ్యంతో ఉంటాయి. వాటిలో 190 మెగావాట్ల ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు ఉంటాయి. ఈ సబ్‌మెరిన్ల నిర్మాణం 2027లో ప్రారంభమవుతుందనీ, మొదటి నౌక 2030 మధ్యకాలంలో భారత నావికాదళంలో చేరి సేవలు అందిస్తుందని అంచనా.
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి: వ్యూహాత్మక ప్రాధాన్యత
భారత అణు త్రిసౌధ వ్యూహంలో సముద్ర ఆధారిత SLBM వ్యవస్థ అత్యంత రక్షిత భాగంగా పరిగణిస్తారు. K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి ఈ వ్యూహాన్ని మరింత బలంగా మలుచుతుంది. ముఖ్యంగా చైనాకు చెందిన JL-2 (7,000 కిలో మీటర్ల పరిది), JL-3 (9,000 కిలో మీటర్ల పరిధి) SLBMలతో సమానంగా, లేదా మరింత వ్యూహాత్మక నిపుణతతో పనిచేస్తుంది.
K-4 (3,500 కి.మీ) క్షిపణి ఇప్పటికే భారత నౌకాదళంలో ప్రవేశించింది. INS Arighaat నుండి 2024 నవంబరులో పరీక్ష విజయవంతమైంది. K-5 క్షిపణి (5,000–6,000 కి.మీ) అభివృద్ధి పూర్తయింది. K-6 కు సంబంధించి పరీక్షలు 2030 వరకు జరగనున్నాయి. పూర్తిస్థాయి ఆపరేషనల్ సామర్థ్యం 2030 నాటికి సాధించే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
స్వదేశీ టెక్నాలజీలో పురోగతి
K-6 హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్. HEMRL అభివృద్ధి చేసిన అధునాతన ప్రొపెలెంట్లు, DRDL, RCI లాంటి DRDO లాబొరేటరీల తయారు చేసిన గైడెన్స్ వ్యవస్థలు దీన్ని సాంకేతికంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ SLBMలు సాధారణంగా 90-100 మీటర్ల CEP నిష్పత్తితో అధిక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి.
మొత్తంగా K-6 హైపర్సోనిక్ క్షిపణి భారత దేశాన్ని సముద్రాధారిత అణు వ్యూహ సామర్థ్యంలో అగ్రశ్రేణిలో నిలబెట్టనుంది. దీని అధిక వేగం, విస్తృతమైన పరిధి, MIRV సామర్థ్యం, రాబోయే S-5 తరగతి సబ్‌మెరిన్లతో సమన్వయం భారత నౌకాదళాన్ని గణనీయంగా శక్తివంతంగా మార్చుతుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భూభౌగోళిక ఉద్రిక్తతల మధ్య, శాంతిని స్థిరీకరించే వ్యూహంగా ఇది కీలకంగా నిలవనుంది.