Crime: లవర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
Crime: చట్టంపై అవగాహన లేకపోవడం నేరానికి మినహాయింపు కాదని అంటారు. అంటే చట్టం తెలియదని నేరం చేస్తే కుదరదు. అలాంటి ఒక నేరం గురించి, దానికి ఎలాంటి శిక్ష పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంతో లేఖ రాయడం చట్టపరంగా నేరమా?
భారత చట్టాల ప్రకారం స్వంత రక్తంతో లేఖ రాయడం కూడా నేరంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా ఆ లేఖను ఎవరికైనా బెదిరించడానికి, భయపెట్టడానికి లేదా మానసిక ఒత్తిడి కలిగించడానికి ఉపయోగిస్తే ఇది తీవ్రమైన నేరంగా మారుతుంది. భారతీయ న్యాయ సంహిత (BNS) ఇటువంటి చర్యలను ప్రజా భద్రతకు ముప్పుగా చూస్తుంది.
బెదిరింపుగా భావిస్తే వర్తించే శిక్షలు
రక్తంతో రాసిన లేఖలో ఒక వ్యక్తికి, సంస్థకు లేదా ప్రభుత్వ అధికారికి బెదిరింపులు ఉంటే, ఇది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351 కింద క్రిమినల్ థ్రెట్‌గా పరిగణిస్తారు. అందులో మరణం, తీవ్రమైన గాయాలు లేదా ఆస్తి నష్టం గురించి హెచ్చరికలు ఉంటే, నేరం మరింత తీవ్రమవుతుంది. అలాంటి సందర్భాల్లో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. లెటర్ పంపిన వ్యక్తి ఉద్దేశంతో పాటు, లేఖ చదివిన వ్యక్తిపై పడిన మానసిక ప్రభావాన్ని కూడా చట్టం పరిగణలోకి తీసుకుంటుంది.
స్వయంగా గాయపర్చుకోవడం ద్వారా ఒత్తిడి పెడితే
రక్తంతో లేఖ రాయాలంటే వ్యక్తి తనకే గాయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా స్వీయ హాని. ఈ పని ద్వారా ప్రభుత్వ ఉద్యోగి, అధికారి లేదా సంస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే, సెక్షన్ 226 వర్తించవచ్చు. ఈ సెక్షన్ కింద జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ప్రజల్లో భయం లేదా ఉద్రిక్తత పెరిగితే
రక్తంతో రాసిన లేఖను బహిరంగంగా ప్రదర్శించడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా ప్రజల్లో భయం కలిగేలా ప్రచారం చేస్తే, ఇది సెక్షన్ 196 కిందకి వస్తుంది. ఈ సెక్షన్ ప్రజా శాంతి భంగం, సామాజిక ఉద్రిక్తత లేదా సామూహిక భయాందోళన కలిగించే చర్యలపై వర్తిస్తుంది. ఉద్దేశపూర్వకంగా అశాంతి సృష్టించాలనే భావన ఉంటే చర్యలు మరింత కఠినంగా ఉంటాయి.
మహిళలకు పంపితే, ఆరోగ్య–ఐటీ చట్టాల సమస్యలు
ఒక మహిళకు రక్తంతో రాసిన లేఖ పంపి, ఆమెకు మళ్లీ మళ్లీ భయం లేదా మానసిక వేధింపులు కలిగిస్తే, ఇది సెక్షన్ 78 కింద మానసిక వేధింపు లేదా స్టాకింగ్‌గా పరిగణించవచ్చు. ఇంకా, మనిషి రక్తాన్ని బయోహాజర్డ్గా భావిస్తారు. దాన్ని డాక్యుమెంట్ రూపంలో పోస్టు లేదా కూరియర్ ద్వారా పంపడం ఆరోగ్య భద్రతా నిబంధనల ఉల్లంఘన. అదేవిధంగా రక్తంతో రాసిన లేఖ ఫోటో లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. అకౌంట్ సస్పెండ్ చేయడం, కంటెంట్ తొలగించడం వంటి చర్యలు తీసుకుంటారు.

