- Home
- National
- బెంగళూరులో పట్టపగలు, నడిరోడ్డుపై రూ.7 కోట్లు చోరీ.. ఎలా జరిగిందో తెలుసా? ఒక్క ఏడాదిలో ఇన్ని బ్యాంకు దోపిడీలా..!
బెంగళూరులో పట్టపగలు, నడిరోడ్డుపై రూ.7 కోట్లు చోరీ.. ఎలా జరిగిందో తెలుసా? ఒక్క ఏడాదిలో ఇన్ని బ్యాంకు దోపిడీలా..!
Bengaluru Daylight Heist : పట్టపగలు… జనాలతో బిజీగా ఉండే రోడ్డుపై… ఏకంగా రూ.7 కోట్లకు పైగా బ్యాంకు డబ్బు దొంగిలించారు కొందరు దుండగులు. ఐటీ సిటీ బెంగళూరులో ఈ దొంగతనం ఎలా జరిగిందో తెలుసా?

బెంగళూరులో ఘరాానా దొంగతనం
Bangalore Robbery : అతడు మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది... ''వీడేంట్రా చాలా శ్రద్దగా కొట్టాడు... ఏదో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు, చాలా జాగ్రత్తగా, పద్దతిగా కొట్టాడ్రా..''... తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున పట్టపగలే జరిగిన దొంగతనానికి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతోంది. బ్యాంకు డబ్బులు దొంగతనం అంటే బెదిరింపులు, హింసాత్మక ఘటనలు, చేజింగ్ లు వంటి ఘటనలు ఉంటాయి... కానీ బెంగళూరులో ొ దొంగలు ముఠా పక్కా ప్లాన్ తో వచ్చి పద్దతిగా దొంగతనం చేశారు. ''వచ్చారు... అధికారులమని నమ్మించారు... డబ్బులతో పరారయ్యారు''... ఇలా చాలా సింపుల్ గా జరిగిపోయింది దొంగతనం.
ప్రస్తుతం బెంగళూరులో జరిగిన చోరీ గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులమని నమ్మించి నడిరోడ్డుపైనే కోట్ల రూపాయలు దొంగిలించారు దుండగులు. ఏటిఎంలకు డబ్బులను సరఫరా చేసే వ్యాన్ ను అడ్డగించి ఏకంగా 7 కోట్ల 11 లక్షల రూపాయల డబ్బును దోచుకున్నాారు. ఈ ఘటన బెంగళూరు జయనగర్ అశోక పిల్లర్ దగ్గర జరిగింది.
దొంగతనం ఎలా జరిగింది..?
పోలీసులు, కన్నడ మీడియా సంస్ధల కథనం ప్రకారం... బెంగళూరు జేపీ నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి మధ్యాహ్నం సమయంలో డబ్బులతో బయలుదేరింది సీఎంఎస్ కంపెనీకి చెందిన ఏటీఎం క్యాష్ రీఫిల్ వ్యాన్. దీన్నే దొంగలు టార్గెట్ చేశారు. తెలుపు రంగు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఇన్నోవా కారులో వచ్చిన ఏడెనిమిది మంది దొంగలముఠా దారి మధ్యలోనే సీఎంఎస్ వాహనాన్ని అడ్డగించింది.
దొంగలు తమను సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అధికారులమని పరిచయం చేసుకుని తరలిస్తున్న డబ్బులకు సంబంధించిన పత్రాలు తనిఖీ చేయాలని సిబ్బందిని నమ్మించారు. దొంగలపై అనుమానం రాకపోవడంతో సీఎంఎస్ సిబ్బంది వాహనాన్ని ఆపి పత్రాలను చూపించారు. సరైన పత్రాలు లేవని బెదిరించడంతో సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఇదే అదునుగా వాహనంలోని రూ.7 కోట్లకు పైగా నగదును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సీఎంఎస్ సిబ్బందిని ఇన్నోవా కారులో ఎక్కించుకుని డైరీ సర్కిల్ వైపు తీసుకెళ్లారు దొంగలు. అక్కడ సిబ్బందిని దించి, నగదుతో సహా పరారయ్యారు. ఈ ఘటన మొత్తం కొద్ది నిమిషాల్లోనే జరిగిపోయింది. దొంగలు పక్కా ప్లాన్‌తోనే ఇది చేశారని స్పష్టమవుతోంది.
బెంగళూరు దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం :
రాష్ట్ర రాజధాని, ఐటీ సిటీ బెంగళూరులో పట్టపగలే జరిగిన ఈ ఘరానా దోపిడీ కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ దొంగతనం కేసును సిద్దరామయ్య ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. స్వయంగా హోంమంత్రి పరమేశ్వర్ రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ దోపిడీ కేసుకు సంబంధించి నిందితుల క్లూ దొరికిందని ఆయన వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని హోంమంత్రి అన్నారు.
ఏటీఎంలకు డబ్బులు నింపే సమాచారాన్ని కొందరు దొంగలకు ఇచ్చారు... దాని ఆధారంగానే దోపిడీ జరిగిందని హోంమంత్రి తెలిపారు. ఈ దోపిడీ చేసింది ఎవరు? ఏటీఎంకు డబ్బులు తెచ్చి నింపే సమాచారం ఇచ్చింది ఎవరు? అనేది తెలిసిందన్నారు. త్వరలోనే దొంగల ముఠాను, వారికి సహకరించినవారి వివరాలను వెల్లడిస్తామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు.
కర్ణాటకలో ఇప్పటివరకు జరిగిన బ్యాంకు దొంగతనాలివే..
బెంగళూరులో పట్టపగలు ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరగడం బహుశా ఇదే మొదటిసారి. కానీ ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రధాన దోపిడీ కేసుల జాబితాలో ఇది కూడా చేరింది. బీదర్, మంగళూరు, కలబురగి తర్వాత ఇప్పుడు బెంగళూరు పేరు కూడా దోపిడీ కేసుల జాబితాలో చేరింది. ఒకప్పుడు సాధారణంగా బీహార్‌లో మాత్రమే కనిపించే ఇలాంటి కేసులు ఇప్పుడు కర్ణాటకలో కూడా మొదలయ్యాయి.
బీదర్ (Bidar ATM Robbery) ఏటీఎం దోపిడీ కేసు
ఈ ఏడాది ప్రారంభంలో బీదర్‌లో ఇద్దరు దొంగలు పట్టపగలే ఏటీఎం వ్యాన్‌లోని 83 లక్షల రూపాయలను దొంగిలించి పారిపోయారు. డబ్బు ఉన్న ట్రంకు పెట్టెను తమ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకుని వారు తప్పించుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ సమయంలో క్యాష్ కస్టోడియన్ గిరి వెంకటేశ్‌పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.
మంగళూరులో (Mangaluru ATM Robbery) పట్టపగలే బ్యాంకు దోపిడీ
ఈ ఏడాది జనవరి 17న మధ్యాహ్నం మంగళూరు శివారులోని ఉల్లాల సమీపంలోని కోటెకార్ వ్యవసాయ సేవా సహకార సంఘంలోకి (సహకార బ్యాంకు) చొరబడిన ఆయుధాలు ధరించిన ఓ ముఠా, సుమారు ₹4 కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళూరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజే, కె.సి. రోడ్డులోని సంఘం తలపాడి శాఖలో ఈ దోపిడీ జరిగింది. బీదర్‌లో ఏటీఎం దోపిడీ జరిగిన వార్త వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.
బెళగావిలో (Belagavi ATM Robbery) ఎస్‌బీఐ ఏటీఎం దోపిడీ
ఫిబ్రవరిలో బెళగావి-బాగల్‌కోట్ రోడ్డులోని సాంబా గ్రామంలో దొంగలు ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి డబ్బును దోచుకున్నారు. గ్యాస్ కట్టర్లతో వచ్చిన దొంగలు, ఏటీఎం ఒక వైపు లాక్ చేసి ఉన్న డోర్‌ను తెరిచి, అందులోని మొత్తం డబ్బును దోచుకెళ్లారు. దొంగిలించిన డబ్బు వివరాలు తెలియరాలేదు. 24/7 జనాలు, వాహనాలతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఏటీఎం లూటీ జరగడం ఆశ్చర్యం కలిగించింది.
కర్ణాటకలో జరిగిన మరికొన్ని దోపిడీలు
కలబురగిలో (Kalaburagi ATM Robbery) ఏటీఎంలోకి చొరబడి 18 లక్షల దొంగతనం
కలబురగి నగరంలో ఏప్రిల్ 9న తెల్లవారుజామున గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి దొంగలు ₹18 లక్షలు దోచుకున్నారు. ఆ తర్వాత 20 రోజులకు పోలీసులు దొంగలపై కాల్పులు జరిపి పట్టుకున్నారు.
విజయపురలో (Vijayapura ATM Robbery) బ్యాంకు నుంచి 59 కేజీల బంగారం దొంగతనం
సెప్టెంబర్ 16న సాయంత్రం సైనిక దుస్తులు ధరించిన ముసుగు వ్యక్తులు విజయపుర జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను దోచుకున్నారు. దొంగలు 58 కిలోగ్రాముల బంగారం, ₹8 కోట్ల నగదును దోచుకెళ్లారు. దేశీయ పిస్టల్స్, ఇతర ఆయుధాలతో ఎస్‌బీఐ శాఖలోకి చొరబడిన దొంగలు, పలువురు ఉద్యోగులను బంధించి పోలీసులకు సమాచారం ఇవ్వరాదని బెదిరించారు. డబ్బు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు.
విజయపురలో (Vijayapura Canara Bank Robbery) కెనరా బ్యాంక్ దోపిడీ
ఈ ఏడాది మే 25న విజయపుర జిల్లాలోని మనగూళి పట్టణంలోని బసవన బాగేవాడి తాలూకాలోని కెనరా బ్యాంక్ నుంచి ₹53 కోట్లకు పైగా విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇందులో 58 కేజీల బంగారం, 5.20 లక్షల నగదు ఉన్నాయి.
కోలార్ (Kolar ATM Robbery) ఎస్‌బీఐ ఏటీఎం దోపిడీ
జూన్ 2025లో కోలార్‌లోని గుల్‌పేట్ ప్రాంతంలోని ఎస్‌బీఐ ఏటీఎంను దోచుకున్నారు. దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి క్యాష్ బాక్స్‌ను తెరిచి 27 లక్షల రూపాయల డబ్బును దొంగిలించారు.
బాగల్‌కోట్ (Bagalkote ATM Robbery) ఏటీఎం దోపిడీ
బాగల్‌కోట్‌లోని బాదామి తాలూకా కకనూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏటీఎంను సెప్టెంబర్‌లో దోచుకున్నారు. దుండగులు ఏటీఎం నుంచి 10 లక్షల రూపాయల డబ్బును దోచుకున్నారు. సీసీటీవీ కెమెరాకు రంగు పూసి, గ్యాస్ కట్టర్ ఉపయోగించి మూడు లాకర్లను పగలగొట్టడానికి ప్రయత్నించారు. వాటిలో ఒకటి మాత్రమే తెరుచుకుంది.
ఇవన్నీ ఈ ఏడాది జరిగిన దోపిడీ కేసులే. వీటిలో కొన్నింటిని ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. కానీ చాలా కేసులు ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఇందులో బెంగళూరు దోపిడీ చేరింది.

