Delhi Robbery: ఒకే ఒక్కడు! స్కెచ్ వేసి రూ. 25 కోట్ల చోరీ, ఒక దొంగ ఇచ్చిన హింట్‌తో అరెస్టు! ఆసక్తికర స్టోరీ ఇదే
ఢిల్లీ రాజధానిలో కలకలం రేపిన నగల షాపులో రూ. 25 కోట్ల విలువైన వస్తువుల చోరీ కేసులో అనూహ్య మలుపులు ఉన్నాయి. ఛత్తీస్‌గడ్‌లో దుర్గ్ పోలీసులు ఓ దొంగను ఇంటరాగేట్ చేస్తుండగా బయటపడ్డ ఒక్క హింట్ ఒంటి చేత్తో రూ. 25 కోట్లను దొంగిలించిన దొంగను పట్టించింది. దొంగ కంటే ముందే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి వెయిట్ చేసి అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నగల షాపులో రూ. 25 కోట్ల చోరీ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇటీవలి కాలంలో అంతమొత్తంలో చోరీ చూడలేదు. ఎంతమంది ప్లాన్ చేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారో అని, పెద్ద వ్యూహంతో ఆ ముఠా దొంగతనం చేసి ఉంటుందని అనుకున్నారు. నగల షాపు గోడకు కన్నం వేసి నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించింది ఒక్కడే అని తెలిస్తే ఖంగుతినక తప్పదు. స్కెచ్ వేసింది, అమలు చేసింది, నింపాదిగా బయటకు వెళ్లి మరో బ్యాగ్ కొనుక్కుని చోరీ చేసిన బంగారాన్ని అందులో వేసుకుని ఏమీ ఎరగనట్టు తన స్వరాష్ట్రం ఛత్తీస్‌గడ్‌కు ప్రయాణమయ్యాడు. కానీ, ఛత్తీస్‌గడ్‌లో పోలీసుల ఇంటరాగేషన్‌లో ఓ దొంగ ఇచ్చిన చిన్న హింట్ ఈ బడా దొంగను అరెస్టు చేయించింది. ఈ ఆసక్తికర కథనాన్ని చదవండి.
ఛత్తీస్‌గడ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్ ఈ నెల మొదట్లో ఒక్కడే బస్సులో ఢిల్లీకి వచ్చాడు. అక్కడ చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు. భొగల్ ఏరియాలో తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఉమ్రావ్ జువెల్లర్స్ నుంచి చోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ షాప్ ప్రతి సోమవారం క్లోజ్ చేసి ఉంటుందని గమనించాడు. చోరీకి స్కెచ్ వేసుకున్నాడు.
Also Read: Delimitation: ఉత్తరాది, దక్షిణాది మధ్య డీలిమిటేషన్ వివాదం! ఎందుకు ఈ వివాదం?
20 గంటలు షాప్‌లోనే..
సెప్టెంబర్ 24వ తేదీన అంటే ఆదివారం రాత్రి 11 గంటలకు తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. ఆ షాపు పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి తన పథకాన్ని అమలు చేశాడు. రాత్రి 11 గంటలకు షాపులోకి వెళ్లగలిగాడు. మరుసటి రోజు ఆ షాప్ ఓపెన్ చేయరు కాబట్టి నింపాదిగా చోరీ చేయడం ప్రారంభించాడు.
డిస్‌ప్లేలో పెట్టిన నగలను బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లాడు. గోడకు కన్నం వేశాడు. స్ట్రాంగ్ రూమ్‌లోని నగలను కూడా తీసుకున్నాడు. దాదాపు 20 గంటలు ఆ షాపులోనే కలియతిరుగుతూ దొంగతనం పూర్తి చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో షాపు నుంచి బయటకు వచ్చాడు.
Also Read: ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు ఎందుకు ముగిసింది? బీజేపీకి గడ్డుకాలమేనా? పొత్తుల చరిత్ర ఏమిటీ?
మంగళవారం షాప్ ఓపెన్ చేసిన ఓనర్లు నిర్ఘాంతపోయారు. కానీ, శ్రీవాస్ అప్పటికే ఛత్తీస్‌గడ్ ప్రయాణం ప్రారంభించాడు. శ్రీవాస్ షాపు నుంచి బయటకు వచ్చి ఢిల్లీలో కశ్మీర్ గేట్ వద్ద ఇంటర్ స్టేట్ బస్ టర్మినస్ వద్దకువెళ్లాడు. అక్కడ తన దొంగిలించిన బంగారాన్ని దాచుకోవడం కోసం ఓ షాప్‌లో మరో బ్యాగు కొనుక్కున్నాడు.
ఢిల్లీ మిషన్ సక్సెస్, కానీ ఛత్తీస్‌గడ్‌లో..
ఢిల్లీలో తన పని విజయవంతంగా ముగించుకుని స్వరాష్ట్రం ఛత్తీస్‌గడ్‌కు బయల్దేరాడు. అయితే, ఛత్తీస్‌గడ్‌లో ఆయనను పట్టుకోవడానికి అప్పటికే రంగం సిద్ధం అవుతున్నది. దుర్గ్ పోలీసులు లోకేశ్ రావు అనే ఓ దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఆ దొంగ ఓ ముఖ్యమైన హింట్ ఇచ్చాడు. ఒకడు ఢిల్లీలో పెద్ద పని ముగించుకుని ఛత్తీస్‌గడ్‌కు తిరిగి వస్తున్నాడు అని ఆ దొంగ చెప్పాడు. బిలాస్‌పూర్‌లోని అద్దె ఇంటికి వచ్చేస్తున్నాడని వివరించాడు. శ్రీవాస్‌ను పట్టుకోవడానికి పోలీసులకు ఈ ముక్క సరిపోయింది. ఆ హింట్‌ను ఛత్తీస్ గడ్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు అందించారు.
Also Read: బిడ్డ పెళ్లికి 18 లక్షలు బ్యాంక్ లాకర్‌లో దాచిపెట్టింది.. ఏడాది తర్వాత తెరిస్తే షాక్
ఢిల్లీ పోలీసులు ఇంటర్నెట్‌లో లోకేశ్ శ్రీవాస్తవ ఫొటో వెతికి పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తితో పోల్చి చూశారు. భోగల్ మార్కెట్‌లో ఆదివారం వైట్ షర్ట్, బ్లాక్ ట్రజర్ ధరించి రెండు నల్లటి బ్యాగులు పట్టుకున్న వ్యక్తితోనూ పోల్చారు. కశ్మీర్ గేట్ వద్ద ఇంటర్ సిటీ బస్ట టర్మినస్‌లో టికెట్ తీసుకుంటుండగా రాత్రి 8.40 గంటలకు అదే వ్యక్తి సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు.
ఆయన ఇంటి వద్ద పోలీసుల వెయిటింగ్..
అంతే ఢిల్లీ పోలీసుల టీమ్ గురువారమే ఛత్తీస్‌గడ్‌కు బయల్దేరింది. బిలాస్‌పూర్‌లోని స్మృతి నగర్‌లో శ్రీవాస్ అద్దెకు ఉంటున్న ఇంటికి దుర్గ్ పోలీసులు, రాయ్‌పూర్ పోలీసులతో కలిసి చేరుకున్నారు. ఆ రోజు రాత్రంతా ఇంటి ముందే వేచి ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవాస్ లగేజీతో ఇంటికి వస్తుండగా వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం శ్రీవాస్ బిలాస్‌పూర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.