పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి..? ఉపాసన vs శ్రీధర్ వెంబు, మీరే చెప్పండి ఎవరు కరెక్టో..?
Upasana vs Sridhar Vembu : కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలా..? పెళ్లిని కెరీర్ తో ముడిపెట్టకూడదా..? ఉపాసన చెప్పింది కరెక్టా? ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ వెంబు చెెప్పింది నిజమా?

ఎవరు కరెక్ట్ .. ఉపాసనా, శ్రీధర్ వెంబా..?
ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలంటుంటారు పెద్దలు... అది పెళ్లయినా, పిల్లలయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా. ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాల పునాదులపై నిర్మితమైన భారత సమాజం ఈ మాటను గట్టిగా నమ్ముతుంది. అందుకే వయసులో ఉండగానే పెళ్లిచేయాలని... వెంటన ఓ మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలని పెద్దలు కోరుకుంటారు.
అయితే నేటి యువతరం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది... ముప్పైలు, నలబైలు ధాటాక పెళ్లిగురించి ఆలోచిస్తున్నారు. కేరీర్ వెంటపడి వయసులో ఉండగా పెళ్లి చేసుకోవడం లేదు... వయసు మీదపడ్డాక తోడుకోసం వెతుక్కుంటున్నారు.
ఈతరం యువత తీరుపై భిన్న వాదనలున్నాయి. కొందరు వయసులో ఉండగా పెళ్లి చేసుకోవాలంటే... మరికొందరు కెరీర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి ఉత్తమమని సలహా ఇస్తున్నారు. తాజాగా సినీ హీరో రాంచరణ్ తేజ్ భార్య కొణిదల ఉపాసన యువత పెళ్లిపై చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఉపాసన ఏమన్నారంటే...
సామాజిక వ్యవహారాల్లో ఉపాసన చాలా యాక్టివ్ గా ఉంటారు... ముఖ్యంగా మహిళాసాధికారత గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం చూస్తుంటాం. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె యువతలో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు ఉపాసన. చాలామంది విద్యార్థులు చేతులెత్తి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు... ఇందులో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు... అమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారని ఉపాసన అన్నారు. దీన్నిబట్టి మహిళలు కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతోందని... ఇది న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాగా ఉపాసన అభివర్ణించారు. ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకొండి... గోల్ ఏమిటో తెలుసుకొండి... అన్ స్టాపబుల్ గా దూసుకుపొండని అమ్మాయిలకు ఉపాసన సలహా ఇచ్చారు.
అయితే ఉపాసన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఐఐటీలో తన స్పీచ్ కు సంబంధించిన వీడియోను ఉపాసన ట్విట్టర్ లో పెట్టగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఉపాసన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు.
పెళ్లిపై శ్రీధర్ వెంబు అభిప్రాయమిదే...
ఉపాసన కెరీర్ లో సెట్ అయ్యాక పెళ్లిచేసుకోమంటే ఐటి దిగ్గజం జోహో వ్యవస్థాపకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబు మాత్రం పెళ్ళి చేసుకున్నాక కూడా ఈ పని చేయవచ్చని అంటున్నారు. వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలని.. ఇది బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
''నేను కలిసే యువ పారిశ్రామికవేత్తలకు (అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా) 20ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని... పిల్లలు కలిగి ఉండాలని సలహా ఇస్తాను. వీటిని ఎందుకోసమో వాయిదా వేయొద్దని చెబుతాను. సమాజం పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న జనాభా బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. ఈ ఆలోచనలు కొంచెం పాతకాలపు భావాల్లా అనిపించవచ్చు, కానీ ఇవి మళ్లీ ప్రజలలో ప్రతిధ్వనిస్తాయని నేను నమ్ముతున్నాను'' అంటూ ఉపాసన ట్వీట్ కు రియాక్ట్ అవుతూ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ వెంబు.
I advise young entrepreneurs I meet, both men and women, to marry and have kids in their 20s and not keep postponing it.
I tell them they have to do their demographic duty to society and their own ancestors. I know these notions may sound quaint or old-fashioned but I am sure… https://t.co/5GaEzkMcbQ— Sridhar Vembu (@svembu) November 19, 2025
ఉపాసనపై నెటిజన్స్ ఫైర్
హైదరాబాద్ ఐఐటీలో ఉపాసన మాట్లాడుతూ... అమ్మాయిలు అండాలను దాచుకోవాలని సూచించారు. దీనివల్ల ఎప్పుడు పెళ్లిచేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది నిర్ణయించుకోవచ్చన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం లభించాకే పెళ్ళిచేసుకోవాలి... ఆ తర్వాతే పిల్లల్ని కనాలని సూచించారు. ఇలా అండాలను దాచుకోవాలన్న ఉపాసన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతున్నారు.
తమ ఫ్యామిలీ కంపెనీ అపోలో ఫెర్టిలిటీ బిజినెస్ పెంచుకునేందుకే ఉపాసన ఈ వ్యాఖ్యలు చేశారని ఓ నెటిజన్ మండిపడ్డారు. అపోలో ఐవిఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ బిజినెస్ ను కోసం మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, కెరీర్, గోల్స్ అంటూ మాట్లాడుతున్నారని... ఈ మాయలో అమ్మాయిలు పడవద్దని సూచించారు. పెళ్లయ్యాక భర్త సాయంతో ఉన్నత స్థానాలకు చేరుకున్న మహిళలు చాలామందే ఉన్నారని అన్నారు. కెరీర్ ముఖ్యమే కానీ ఇందుకోసం దేన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ఉపాసన వీడియోకు ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

